- ‘రెమ్‌డెసివిర్’ జనరిక్‌కు డీసీజీఐ అనుమతి
- ‘కొవిఫర్’ పేరుతో ఇంజెక్షన్..
- ఒక్కో డోస్ రూ.5-6 వేలు
- హైదరాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి..
- సిప్లాకూ డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
- ముంబైలో ఫాబిఫ్లూ విక్రయాలు..
- వారంలో దేశమంతటా
న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం హెటెరో.. కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే పరిశోధనాత్మక యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఔషఽధ తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్టు ఆదివారం కంపెనీ తెలిపింది. మరో ఫార్మా దిగ్గజం సిప్లాకు కూడా రెమ్‌డెసివిర్ ఔషధాన్ని ఉత్పత్తి చేసేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. ‘కొవిఫర్’ బ్రాండ్ పేరుతో రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను హెటెరో దేశీయంగా మార్కెట్ చేయనుంది. ఈ ఔషధం 100 ఎంజీ వయల్ (ఇంజెక్షన్) రూపంలో అందుబాటులోకి వస్తుంది.
ఒక్కో డోసు ధర రూ.5,000-6,000 ఉంటుందని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ బండి తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని హైదరాబాద్‌లోని కంపెనీ ఫార్ములేషన్ యూనిట్‌లో తయారు చేస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ)ను విశాఖపట్నంలోని కంపెనీ యూనిట్‌లో తయారు చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రులు, ప్రభుత్వం ద్వారా మాత్రమే ఈ ఔషధం అందుబాటులో ఉంటుందన్నారు. కొన్ని వారాల్లోనే లక్ష డోసులు అందించాలన్న దానిపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. పెద్దవారు, పిల్లలు, తీవ్రమైన రోగ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారికి దీన్ని వాడవచ్చని పేర్కొంది. కాగా దేశంలో కొవిడ్-19 విస్తృతి భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో కొవిఫర్ కు అనుమతి లభించడం గేమ్ చేంజర్‌లా మారుతుందని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి.పార్థసారథి రెడ్డి తెలిపారు.
కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే యాంటీ వైరల్ ఔషధం ఫావిపిరావిర్ టాబ్లెట్లను ఫాబిఫ్లూ పేరుతో గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. 34 టాబ్లెట్ల ప్యాక్ ధరను రూ.3,500గా నిర్ణయించింది. 200 ఎంజీ మోతాదులో ఉండే ఒక్కో టాబ్లెట్ ధర రూ.103 ఉంటుందన్న మాట. మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్-19 లక్షణాలు ఉన్న వారికి ఈ టాబ్లెట్లను వాడవచ్చు. ప్రస్తుతం ఈ టాబ్లెట్లు ముంబై మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ మార్కెట్లో, వారంలో దేశవ్యాప్తంగా ఈ టాబ్లెట్లు అందుబాటులోకి రానున్నాయి.
Courtesy Andhrajyothi