శ్వేతజాతిలో వికసించిన నల్ల వజ్రం

0
65
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌, డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

కులం, జెండర్‌ అధ్యయనాలపై అత్యంత గొప్ప పండితులలో ఒకరైన గెయిల్‌ ఒమ్వెట్‌ మహారాష్ట్రలోని కెసెగావ్‌ గ్రామంలో ఆగస్ట్‌ 25 తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. ఈ అమెరికన్‌ సంతతి భారతీయ పరిశోధకురాలు, సామాజిక శాస్త్రవేత్త గత అయిదు దశాబ్దాలకు పైగా దళిత, ఓబీసీ, ఆదివాసీల సమస్యలపై తన రచనలకు గాను ప్రపంచఖ్యాతి పొందారు. గెయిల్‌ ఒమ్వెట్‌ అమెరికన్‌ చర్మంలో ఒదిగిన దళిత మహిళ. రచనా క్షేత్రంలో, పోరాట రంగంలో ఉంటున్న మాలాంటి అనేక మందికి సిద్ధాంతాలపై రాజీపడకుండా, ప్రమాణాలు పలుచబారకుండా ఎలా రచనలు చేయాలో ఆమె నేర్పారు.  ఇవాళ ఆమె మన మధ్య లేరు కానీ, తను రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ప్రసంగాల ద్వారా, అసమానత్వానికి వ్యతిరేకంగా మేం సాగిస్తున్న పోరాటంలో ఆమె మాతో ఎప్పటికీ కలిసే ఉంటారు.

1980ల ప్రారంభంలో ఒక యువ విద్యావిషయక కార్యకర్తగా నేను ఆమెను పుణే  సెమినార్‌లో తొలిసారిగా కలిశాను. మహారాష్ట్ర కులాల పొందిక, సామాజిక ఉద్యమాలు, రాజకీయాల చరిత్ర వంటి అంశాలపై ఆమెకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. భారతదేశంలోని దిగువ కులాల గురించి ఇంత పరితాపం, ఆసక్తి ఉన్న విదేశీయులను నేను అంతవరకు తెలుసుకుని ఉండలేదు. ఆ సెమినార్లో పాల్గొన్నవారందరూ సత్యశోధక్‌ ఉద్యమం, అంబేడ్కర్‌ ఆందోళనలు, రచనలపై అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె వివరణను తీసుకోవాలని ప్రయత్నించారు.

ఒక మార్క్సిస్టు విద్యాధిక కార్యకర్తగా నేను ఆ శ్వేత మహిళలోని అపార జ్ఞానాన్ని, కులం, మహిళా విముక్తికి చెందిన ప్రతి అంశంపై ఆమె అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆ సమయంలో దళిత, ఓబీసీ ఉద్యమాల కంటే ఫెమినిస్టు ఉద్యమమే బాగా ప్రచారంలో ఉండేది. ఈ రెండింటి గురించి ఒమ్వెట్‌ సమాన స్థాయిలో మాకు సమాచారం పంపేవారు. ఆ తర్వాత ఆమె దిగువ తరగతి శూద్ర/ఓబీసీ కుటుంబంలో కోడలిగా మారి ఒక గ్రామంలో నివసించారు. అమెరికానుంచి వచ్చి పూలే, అంబేడ్కర్‌ రచనలతో ప్రభావితురాలై, భారత్‌లోని అస్పృశ్యులు, ఆదివాసీల విముక్తి కోసం బోధన చేసి, వారిని సంఘటితపర్చి, ఆందోళనల్లో పాల్గొన్న ఈ గొప్ప మహిళ రచనలను అప్పటినుంచే చదవసాగాను. అది అంధకార గృహం నుంచి విరిసిన సరి కొత్త కాంతిపుంజం. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ఆమె దేశ, విదేశాల్లోని వేలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.

అమెరికా నుంచి విద్యార్థిగా వచ్చి 1970లలో భారత్‌లో నివాసమేర్పర్చుకున్న ఒమ్వెట్‌ కుల అధ్యయనాలపై గొప్ప ప్రతిభ ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆమె మార్క్సిస్టు పండితుడు, కార్యకర్త భరత్‌ పటాంకర్‌ను వివాహమాడారు.  కులాన్ని, మహాత్మా పూలే ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా నుంచి ఆమె పీహెచ్‌డీ విద్యార్థినిగా వచ్చారు. భారతదేశంలో కులం, అస్పృశ్యతా వ్యవస్థను చూసి ఆమె కదిలిపోయారు. పీడిత కులాల విముక్తిపై కృషి చేయడానికి ఈ దేశంలోనే స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. భారతదేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ చైతన్యానికి రూపురేఖలు దిద్దడానికి ఆమె చేసిన దోహదం అసమానమైనదని చెప్పాలి.

అమెరికాలోని మినియాపోలిస్‌లో జన్మించిన ఒమ్వెట్‌ యూసీ బర్క్‌లీ వర్సిటీలో చదివారు. 1973లో అదే వర్సిటీ నుంచి పీహెచ్‌.డి పొందారు. ఈ క్రమంలోనే ఆమె సామ్రాజ్యవాద వ్యతిరేకిగా మారిపోయారు. జాతీయవాదం అనేది పుట్టుక ద్వారా ఏర్పడదని నిరూపించడానికి ఆమె భారత్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు.

ఆమె అసాధారణ రచయిత, పలు పుస్తకాలు రచించారు. ఆమె థీసిస్‌ ప్రపంచానికి మహాత్మా పూలే సత్యశోధక్‌ ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిపింది. ఆమె రాసిన విశిష్ట రచన ‘దళిత్స్‌ అండ్‌ డెమొక్రాటిక్‌ రివల్యూషన్‌’ భారత దేశంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ, ప్రపంచంలోని దక్షిణాసియా స్టడీ సెంటర్లలోనూ ప్రతి యువ విద్యార్థికీ, విద్యార్థినికీ కరదీపికగా మారిపోయింది. పరిశోధకులు కులం, అంటరానితనం సమస్యపై అవగాహనకు, ఆమె పుస్తకాలు చదివారు. గెయిల్‌ ఒమ్వెట్‌ పుణేలోని పూలే ఇంటికి వచ్చి కొత్త కాంతి ప్రసరించేంతవరకు, 1898 మహమ్మారికి బలైన సావిత్రీబాయి పూలే మరణం వరకు భారతీయ పండితులు వీరిద్దరి గురించి తెలుసుకోలేదు.   స్వయంగా రంగం మీద ఉండి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జీవితకాలం ఆమె చేసిన కృషి, కలిగిం చిన స్ఫూర్తికి గాను శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీ ఉద్యమాలు ఆమెకు రుణపడి ఉంటాయి.

అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యంతో భారతదేశం వచ్చిన ఒమ్వెట్‌ తన రంగును మార్చుకోలేకపోయారు కానీ, భారతీయ దళిత మహిళగా మారేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని ఆమె పాటించారు. ఆమె సమర్పించిన పరిశోధనా సిద్ధాంతం పేరు ‘కల్చరల్‌ రిపోల్ట్‌ ఇన్‌ ఎ కలోనియల్‌ సొసైటీ: ది నాన్‌ బ్రాహ్మన్‌ మూవ్‌మెంట్‌ ఇన్‌ వెస్టర్న్‌ ఇండియా, 1870–1930.’ దీన్ని తర్వాత పుస్తకంగా ప్రచురించారు. గెయిల్‌ తన కెరీర్‌ని మార్క్సిస్టుగా ప్రారంభించారు. భారతీయ కుల వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఆమె మార్క్సిస్టుగా కొనసాగి సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు వైధానికతను అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో అంబేడ్కరైట్‌గా కూడా ఆమె పరివర్తన చెందారు.

Gail Omvedt: శ్వేతజాతిలో వికసించిన నల్ల వజ్రం | Gail Omvedt: Tribute by  Kancha Ilaiah Shepherd in Telugu - Sakshiమహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒమ్వెట్‌ దంపతులు చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అనేక రంగాలపై ఆమె రచనలు చేశారు. బుద్ధిజంపై, మహిళలపై ఆమె రాసిన రచనలు కులంపై ఆమె రాసిన రచనల్లాగే సుపరిచితం. గత నలభై ఏళ్లుగా ఆమె భర్త భరత్‌ పటాంకర్, ఏకైక కుమార్తె ప్రాచీ పటాంకర్‌తో కలిసి దళిత, ఓబీసీ, ఆదివాసీ, మహిళా విముక్తి ఉద్యమాలలో సుదీర్ఘకాలం ఆమెతో కలిసి పని చేసిన మేమంతా ఆమె జీవితాన్ని, కృషిని భారతీయులుగా గర్విస్తూ వేడుకలు జరుపుకుంటాము.

Courtesy Sakshi

Leave a Reply