నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘లా’ చదువుతున్న రోజులవి (1986). చాలా మంది చదువుతూ పోటీ పరీక్షలకు తయారవ్వడం పరిపాటి. మా క్యాంపస్‌లో చాలా మంది గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వారే. అక్కడే నేను మొదటిసారిగా ఎస్.ఆర్ శంకరన్ గురించి విన్నాను. ఆయన కొంతమంది పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం చేసేవారు. అలా పరీక్షలు రాసి సెంట్రల్ సర్వీసుకు ఎంపికైన కొంతమంది విద్యార్థులు నాకు తెలుసు. ఒక ఐఎఎస్ అధికారిగా పేదలకు, ముఖ్యంగా దళితులకు ఎన్నో మేళ్లు చేసిన ఆచరణవాది. 1991లో నేను గ్రూప్ వన్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో శిక్షణ అవుతున్న రోజుల్లో ఎస్.ఆర్.శంకరన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.
తమిళనాడు లోని తంజావూరు జిల్లా సింగలత్తురు గ్రామంలో 22-10-1934లో శంకరన్ జన్మించారు. వీరిది ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. అయితే కుల, మత, భాష ప్రాంతీయపరమైన అన్ని అడ్డు గోడలను ఛేదించి ఒక అభ్యుదయవాదిగా, పేదల పెన్నిధిగా నిలిచారు. మద్రాసు లయోలా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి అతి పిన్న వయసులో (23) కేంద్ర ప్రభుత్వ ఐఎఎస్ సర్వీసుకు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడ్డారు. 1957లో ఐఎఎస్ అధికారిగా విధుల్లో చేరినప్పటి నుంచి 1992లో పదవీ విరమణ చేసే వరకు ఎక్కడ ఉన్నా నిరుపేదల పక్షాన నిలబడ్డారు. ఆఖరుకు కొన్ని సమయాలలో ప్రభుత్వంతో రాజీ పడలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి ఆ తర్వాత త్రిపుర రాష్ట్రానికి (వామపక్ష ప్రభుత్వం) చీఫ్ సెక్రటరీగా వెళ్లారు. శంకరన్‌ది ఏ రకమైన భేషజాలకు లోనుకాని వ్యక్తిత్వం. ఉద్యోగ ధర్మంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని, నిరుపేదల పక్షాన నిలబడి పోరాడిన యోధుడు.
శంకరన్ అంచెలంచెలుగా ఎన్నో పదవుల్ని చేపట్టారు. కర్నూలు జిల్లా, నంద్యాల సబ్ కలెక్టరుగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా 3 సంవత్సరాలు, నెల్లూరు జిల్లా కలెక్టరుగా 3 సంవత్సరాలు పని చేసిన కాలంలో నెలకు సగం రోజులు క్షేత్ర పర్యటనలు చేపట్టి ప్రజల్లో ముఖ్యంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి ఫలాలు అందేలా కృషి చేసేవారు. ఎక్కడ ఏ మంచి పని జరిగినా వాటిని చూసి అధికారులను అభినందించి వారిని ఉత్సాహపరిచేవారు.
ఆయన జీవన శైలి అతి నిరాడంబరంగా వుండేది. పెళ్లి తను ఎంచుకున్న మార్గానికి అవరోధమని భావించారు. బ్రహ్మచారిగా వుండిపోయారు. నిరుపేదలు, దళితులు గిరిజనులందరూ ఆయన కుటుంబమే. వారందరి జీవితాల్లో వెలుగు కోసం అహర్నిశలు కృషి చేశారు. శతాబ్దాల తరబడి నిరాదరణకు, అణచివేతకు గురైన ఆదివాసీలు, పేదలు, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన ఆశయంగా భావించి ఆవిధంగా కృషి చేశారు. ఆయన ఎంత ఉన్నత పదవులు నిర్వహించినా, ఆయన నివసించింది సింగిల్ బెడ్ రూంలోనే. ఆయన ధరించే మామూలు ఫ్యాంటు, అర చేతుల చొక్కా నిలువెత్తు నిరాడంబరత్వానికి నిదర్శనం. ఆయన పక్కన బిళ్ల బంట్రోతు లేకపోతే కలెక్టరు గారు అని తెలుసుకోవడం కష్టమయ్యేదట. అందుకే అందరూ ఆయన్ను ఐఎఎస్ గాంధీ అని పిలిచేవారు. నెల్లూరు కలెక్టరుగా వున్నప్పుడు విశాలమైన తన కలెక్టరు బంగళాను ప్రైవేటు బిల్డింగ్‌లో చదువుకుంటున్న విద్యార్థినులకు చదువుకోడానికి ఇచ్చేశారు.
శంకరన్ నిర్వహించిన శాఖల్లో ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖ సాంఘిక సంక్షేమ శాఖ. ఎందుకంటే ఆ శాఖ ద్వారానే ఎక్కువగా గిరిజనులు, షెడ్యూలు కులాల వారికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత దళితులకు రాజకీయ స్వాతంత్య్రం లభించినా ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రం అనుకున్నంత స్థాయిలో లభించలేదు. శంకరన్ దృష్టిలో ‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి అనేది వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వేగవంతంగా రావాలి. మిగతా సమాజానికి, వారికి మధ్య వున్న అంతరాలు, అగాధాలు సాధ్యమైనంత త్వరగా పూడిపోయి చివరకు పూర్తిగా నిర్మూలించబడాలి. న్యాయబద్దమైన మానవత్వంతో తొణికిసలాడే సమ సమాజం ఏర్పడేందుకు దోహదపడాలి’.
వీరి హయాం లోనే గిరిజనులకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వసతి గృహాలు, స్కాలర్‌షిప్‌లకిచ్చే డబ్బు పెంచారు. దళిత, గిరిజనుల ఆర్థిక పరిస్థితులు సామాజిక స్థితిగతులు తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేవారు. ముఖ్యంగా సఫాయి కర్మచారులకు, వెట్టి చాకిరి చేస్తున్న వారి విముక్తి కోసం, భూ సమస్యల మీద ఆయన చేసిన కృషి కొనియాడదగినది. వెట్టిచాకిరి, జోగిని వ్యవస్థల నిర్మూలన, చెంచు, యానాదుల కోసం ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా వారి అభివృద్ధి, అభ్యున్నతికి, నిరంతరం కృషి సల్పిన సంక్షేమ కార్యశీలి శంకరన్. ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం, ఉప ప్రణాళికలు తయారు చేయడం వంటి వాటికి వీరి కాలం లోనే అంకురార్పణ జరిగింది.
పేదరిక నిర్మూలనలో భాగంగా తలపెట్టిన కార్యక్రమాల్లో భూ సంస్కరణలు ప్రధాన పాత్ర వహిస్తాయని నమ్మిన వాడు శంకరన్. భూమి సమస్యే పేదరికానికి, దోపిడీకి, దుఃఖానికి, అసమాన మానవ సంబంధాలకు ప్రధాన కారణమని గ్రహించారు. దళిత గిరిజనులకు భూమి బదలాయింపు ద్వారా, ఆర్థికంగా, సాంఘికంగా సమాజంలో హోదా లభిస్తుందని నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన మాటల్లో ‘సమానత్వం కోసం, భూమి కోసం పేదలు పడే అమితమైన తపన కొత్త విషయం కాదు. ఏ భౌతిక వాస్తవికత అయితే తమకు సమానత్వాన్ని… భూమిని లేకుండా చేసిందో, ఆ భౌతిక వాస్తవికతతో వారు ముఖాముఖి తలపడే క్రమంలో తమలో పుంజుకుంటూ వచ్చిన దృక్పథాలను, విలువలను వారు ప్రతిఫలింపజేస్తారు. వాళ్ల దృష్టిలో భూమి మీద యాజమాన్యమనేది తమ సాంఘిక ప్రతిపత్తిని సూచిస్తుంది. కనుక సమానత్వమంటే భూయాజమాన్యంతో సమానత్వమనే అర్థం’. 1980లో దేశానికే ఆదర్శవంతంగా, ఎన్‌ఆర్‌ఇపి, ఆర్‌ఎల్‌జిపి వంటి గ్రామీణ పథకాలు… ఎస్సీ, ఎస్టీలకు చెందిన పేద రైతుల భూములలో వ్యవసాయ బావులు తవ్వించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టి వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు.
సర్వీసు ప్రారంభం నుండి పదవీ విరమణ వరకు వివిధ హోదాల్లో, వివిధ శాఖల్లో పని చేసేటప్పుడు, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అటవీ హక్కుల కమిటీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదలగు వాటి కార్యకలాపాలలో శంకరన్ చురుగ్గా పాల్గొనేవారు. బొగ్గు గనులు జాతీయం చెయ్యడం లోను, ప్రభుత్వానికి నక్సల్‌తో జరిగిన శాంతి చర్చలలో మధ్యవర్తిగా చురుకైన పాత్ర వహించారు.
తరతరాల వెనకుబాటుతనం, అణచివేత, దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న దళిత, గిరిజనులను విముక్తి చేయడానికి ఎనలేని కృషి చేసిన వారిలో శంకరన్ అగ్రగణ్యుడు. అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత దాని అమలుకు ప్రభుత్వం ఏర్పరచిన 19 మంది సభ్యుల కమిటీకి శంకరన్ నాయకత్వం వహించారు. తొలుత రూల్స్ రూపొందింది ఆయన ఆధ్వర్యంలోనే! నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేయడానికి ప్రణాళికా సంఘం నియమించిన కమిటీలో సభ్యుడిగా కూడా పని చేశారు. ప్రభుత్వేతర సంస్థల్లోనూ పని చేశారు.
అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, దేశ సర్వోన్నత న్యాయస్థానం, పలు ఇతర సంస్థలు శంకరన్‌ను సలహాదారులుగా నియమించుకొని, సర్వేలు, చేపట్ట వలసిందిగా కోరేవి. అనుభవం, పేదల పట్ల వున్న అవగాహన, పేదల పక్షపాతిగా, రూపకల్పన చేసిన ప్రణాళికల రీత్యా ఈ బాధ్యతను ఆయనకు అప్పగించేవారు.
మానవతా విలువలను మనసు నిండా నింపుకొని చిత్తశుద్ధితో, పని చేసే అధికారిగా దళితులు, అధికారులు, ప్రజల మన్నన పొందిన ఆయన ఎంతోమంది యువ అధికారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఎందరో పేద, దళిత, యువకులకు తన సొంత డబ్బుతో విద్యా బుద్ధులు నేర్పారు. ఎందరో దళిత, యువ అధికారులను తీర్చిదిద్ది, వారికి పరిపాలన అంటే ఆలనా పాలనా లేని పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కర్తవ్య బోధ చేస్తూ ఉత్తేజపరిచేవారు. శంకరన్ దేశం గర్వించ దగ్గ అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారి. అంతేకాదు, మానవ హక్కుల పరిరక్షణ, ఆదివాసీల రక్షణకు, వారి అభ్యున్నతికి అనేక పథకాలు రూపకల్పన జేసిన గొప్ప మానవతావాది. వారి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ పురస్కారాన్ని అతి సున్నితంగా తిరస్కరించిన నిరాడంబరుడు. నేడు శంకరన్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు పునరంకితం కావడమే మనమిచ్చే ఘనమైన నివాళి.
– రేగుళ్ల మల్లికార్జున రావు
( వ్యాసకర్త సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు )