‘లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం చేయండి’

0
2236

హైకోర్టు ఆదేశం

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత లింగన్న మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం.. లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం ఆస్పత్రిలో భద్రపరిచి.. రేపు సాయంత్రం 6 గంటల్లోపు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి.. రీపోస్టుమార్టం నిర్వహించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని లింగన్న బంధువులకు అప్పగించాలని.. నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు స్పష్టంచేసింది.

అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

గుండాల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. లింగన్నను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని.. పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఫోరెన్సిక్‌ నిపుణులతో మళ్లీ పోస్టుమార్టం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎన్‌కౌంటర్‌ ఛత్తీస్‌గఢ్‌ పరిధిలో జరిగిందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు న్యాయస్థానానికి నివేదించారు. లింగన్న జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పల్పడుతున్నారని.. నిజంగా జరిగిన ఎదురు కాల్పుల్లోనే చనిపోయారని వివరించారు. లింగన్న వద్ద ఆయుధాలు ఉన్నట్టు, ఆయనే పోలీసులపై ముందుగా కాల్పులు జరిపినట్టు ఆధారాలేమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించగా..అన్నీ ఉన్నాయని అదనపు ఏజీ వివరణ ఇచ్చారు. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది.

లింగన్న మృతిపై రాజకీయ మంటలు!

గుండాల అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో లింగన్న మృతి రాజకీయ మంటలు లేపుతోంది. ఆదివాసీల హక్కుల నేతను పోలీసులు కాల్చి చంపారంటూ న్యూడెమోక్రసీ నేతలు, ఇతర ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గుండాల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత లింగన్న కొత్తగూడెం ఏరియా జిల్లా దళ కార్యదర్శి లింగన్న మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏరియా ఆస్పత్రికి లింగన్నను కడసారి చూసేందుకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నేతలు పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. లింగన్న స్వస్థలం గుండాల మండలం నుంచి భారీగా తరలి వచ్చిన ఆదివాసీలను పోలీసులు అనుమతించలేదు. పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.

(Courtacy Eenadu)

Leave a Reply