కోరలు చాస్తున్న వైరల్‌ వ్యాధులు

0
211
  • పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, డయేరియా కేసులు
  • జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాల
  • వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
  • వారం రోజుల్లోనే హైదరాబాద్‌లో 8139 ఫీవర్‌ కేసులు
  • మరో నెల రోజులు ఇంతే.. జరభద్రం: వైద్యుల హెచ్చరిక

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వైరస్‌ సంబంధిత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అతిసారం, ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నాయి. వీటితో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఈ తరహా అడ్మిషన్లు గత కొద్దిరోజులుగా పెరుగుతున్నాయని.. ప్రతి పది కేసుల్లో ఏడు ఇలాంటివే ఉంటున్నాయని అక్కడి వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, బస్తీ దవాఖానాల్లోనూ ఇటువంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బడికెళ్లే పిల్లలకు తరగతిగదిలో ఇతర విద్యార్థుల ద్వారా వైరల్‌ ఇన్ఫెక్షన్లు వేగంగా సోకుతున్నాయని.. వీటిబారిన పడుతున్న పెద్దల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో(నవంబరు 1 నుంచి 7 వరకూ) 10,200 ఫీవర్‌ కేసులు నమోదయ్యాయని.. వాటిలో ఏకంగా 8,139 వైరల్‌ ఫీవర్లు ఒక్క హైదరాబాద్‌లోనే వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబరు నెలంతా కలిపి హైదరాబాద్‌లో 25,633 జర్వం కేసులు రాగా.. ఈ నెలలో తొలివారంలోనే 8 వేలకుపైగా కేసులు రావడం గమనార్హం. వైరల్‌ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడినవారిలో జలుబు, ముక్కు కారడం, జ్వరం, పొడిదగ్గు ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు రోజుల తర్వాత కొందరిలో విరేచనాలూ కనిపిస్తాయి. వీరికి లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. చికిత్స, పోషకాహారంతో వారు మూడు నుంచి ఐదు రోజుల్లో కోలుకుంటున్నారని వెల్లడించారు. దగ్గు మాత్రం పది రోజుల వరకు ఉంటుందని పేర్కొన్నారు. వైరల్‌ జ్వరాలేవైనా సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతాయని.. ఆయాసం లాంటి లక్షణాలుంటే మాత్రం కోలుకోవడానికి పదిరోజుల దాకా పడుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. చాలామందికి ఇలా తగ్గినా.. కొద్దిమందికి మాత్రం వైరల్‌ ఇన్ఫెక్షన్లు చాలా సమస్యాత్మకంగా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్‌ వారి శ్వాసకోశ వ్యవస్థపైన, గుండెపైన ప్రభావం చూపడమే ఇందుకు కారణమని వారు వివరిస్తున్నారు. ఇక వైరల్‌ డయేరియా కేసుల్లో తొలుత వాంతులు అవుతాయి. ఆ తర్వాత విరేచనాలు మొదలవుతాయి. ఇటువంటి కేసులకు ఓరల్‌ హైడ్రేషన్‌ ఇస్తున్నట్లు డాక్టర్స్‌ పేర్కొన్నారు.

ఇవీ జాగ్రత్తలు..
పిల్లలతో పాటు బీపీ, షుగర్‌ వంటి సమస్యలున్నవారు ఎక్కువగా జనం ఉండే చోట్లకు (షాపింగ్‌మాల్స్‌, సూపర్‌మార్కెట్లు, సినిమా హాళ్ల వంటివి) వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చల్లగాలిలో తిరగొద్దని.. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ‘‘వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారికి దగ్గు వస్తుంటే.. వారికి గోరువెచ్చటి నీళ్లు ఎక్కువగా తాగించాలి. దాంతో కఫం పోతుంది. పిల్లలు ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే మాత్రం వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. అయాసంతో కూడిన దగ్గు ఉన్నా అప్రమత్తం అవ్వాలి. జనవరి వరకూ ఈ రెస్పరేటరీ ఇన్ఫెక్షన్స్‌ కేసులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లో కొంత తగ్గినా.. జనవరిలో మళ్లీ పెరుగుతాయి. కానీ ఈ నెలంతా ఇటువంటి కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.’’ అని వైద్యులు చెబుతున్నారు.

ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఉత్తమం
ప్రస్తుతం ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. బీపీ, షుగర్‌ ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరు నెలల వయసు దాటిన వారంతా కచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. వీలైతే విదేశాల్లో మాదిరిగా ఏటా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఉత్తమం. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లోనే ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఫ్లూ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి యాంటీ ఫ్లూ ఔషధాలను వాడాలి.
– డాక్టర్‌ ఎంవీ రావు, కన్సల్టెంట్‌ ఫిజిషీయన్‌, యశోదా ఆస్పత్రి, హైదరాబాద్‌.

ఆందోళన వద్దు.. జాగ్రత్త మేలు
కొద్దిరోజులుగా పిల్లల్లో వైరల్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌, వైరల్‌ డయేరియా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అడ్మిషన్స్‌ కూడా పెరిగాయి. తల్లిదండ్రులు అనవసరంగా ఆందోళన చెందవద్దు. తగు జాగ్రత్తలు పాటిస్తే వారం రోజుల్లోనే తగ్గిపోతాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ బారిన పడినవారిలో.. జలుబు, ముక్కు కారడం, జ్వరం, పొడిదగ్గు, విరేచనాల వంటి లక్షణాలు ఉంటున్నాయి. లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్‌ సి.నిర్మల, ప్రొఫెసర్‌ పీడియాట్రిక్స్‌, నిలోఫర్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌

Leave a Reply