మీడియాపై ఆంక్షలు సరికాదు

0
232

* జిఒ 938ని రద్దు చేయాలి
* ఎపిడబ్ల్యూజెఎఫ్‌ రౌండ్‌టేబుల్‌ తీర్మానం
-అమరావతి బ్యూరో
మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎపిడబ్ల్యూజెఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో ‘మీడియాపై ఆంక్షలా’ అంశంపై మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. నిరాధార వార్తలు రాస్తే కేసులు నమోదు చేసేలా ఉన్న జిఒ 938ని రద్దు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. జర్నలిస్టులపై హత్యలు, దాడులకు సంబంధించిన అన్నింటి మీద విచారణకు ప్రత్యేక కమిటీని నియమించాలని, ఉద్యోగుల రక్షణ చట్టం మాదిరిగా జర్నలిస్టుల రక్షణకు చట్టం తీసుకురావాలని తీర్మానించింది. రాష్ట్ర స్థాయిలో హైపవర్‌ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యాక్ట్‌, పే ఫిక్సేషన్‌ యాక్ట్‌ల సవరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ మీడియాపై ఆంక్షలను ముక్త కంఠంతో ఖండించాలన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే ఆయా శాఖల అధిపతులే కేసులు వేయచ్చని చెప్పడం సరికాదన్నారు. వ్యతిరేక వార్తలు రాస్తే చంపడమే పరిష్కారమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన జూదానికి తెరలేపిందన్నారు. దానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టేందుకు సమిష్టిగా ముందుకెళ్లాలని, అందుకు సిపిఐ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కృష్ణమూర్తి మాట్లాడుతూ విలేకరులను బెదిరించడం, చంపడానికి పూనుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. పత్రికలే గాక, ఉద్యమాల మీద కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు.
సామాజిక కార్యకర్త సయ్యద్‌ రఫీ మాట్లాడుతూ కెసిఆర్‌లాగా జగన్‌ నమూనా పాలనను సాగిస్తున్నారన్నారు. ప్రెస్‌కౌన్సిల్‌ ఉండగా జిఒ 938ని చూపి బెదిరించడం సరికాదన్నారు. ఎపి జర్నలిస్ట్‌ ఫోరం ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆర్టికల్‌ 19 ప్రకారం ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోడానికి అర్హత లేనట్టేనన్నారు.
ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్‌ బి తులసీదాస్‌ మాట్లాడుతూ మీడియా పాత్ర ఎప్పుడూ పురోగమన పాత్రేనని, సమాజంలోని అన్యాయాలను తెలిజేయడం పత్రికల పని అని అన్నారు. ఇంటర్నెట్‌ సమాజానికి గొడ్డలిపెట్టుగా మారిందని చెబుతున్నారని, నిజానికి సోషల్‌ మీడియా ద్వారానే బిజెపి అధికారంలోకి రాగలిగిందని తెలిపారు. ఆస్ట్రేలియా మీడియాను స్ఫూర్తిగా తీసుకోవాలని, మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడానికి జర్నలిస్ట్‌ సంఘాలు, ప్రజా సంఘాలూ ఏకోన్ముఖంగా ప్రభుత్వానికి మూకుతాడు వేయలని పిలుపునిచ్చారు.
విజయవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మీకాంతం మాట్లాడుతూ తప్పుడు వార్తలు రాస్తే ప్రెస్‌ కౌన్సిల్‌కు అపీల్‌ చేసుకునే అవకాశం ఉండగా జిఒ 938తో పనేముందన్నారు. జిఒ 938 ఆర్టికల్‌ 19 ఉల్లంఘనేనని, ప్రభుత్వం తగ్గకపోతే కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయచ్చని సూచించారు. టిడిపి నాయకులు గొట్టిపాటి రామకృష్ణ మాట్లాడుతూ చట్టాలు మార్చేసి నియంతృత్వ ధోరణి అవలంభిస్తామంటే సమంజసం కాదన్నారు. ఎన్‌ఎజె కార్యదర్శి ఒ శాంతిశ్రీ మాట్లాడుతూ జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే పరిస్థితి వచ్చిందని, దానికి వ్యతిరేకంగా ముందకెళ్లాలని అన్నారు. సమావేశానికి ఎపిడబ్ల్యూజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ వెంకట్రావు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తీర్మానాలను ప్రవేశపెట్టారు. సమావేశంలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌ కృష్ణా జిల్లా అధ్యక్షులు వెంకటప్పయ్య, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీరామమూర్తి, నగర కార్యదర్శి ఎస్‌కె ఖాజావలీ, ఎపిబిజెఎ నాయకులు రంగారెడ్డి, సోషల్‌ మీడియా ఫర్‌ సొసైటీ నిర్వాహకులు కారుసాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy Prejashakthi

Leave a Reply