సంపన్నశ్రేణి తీర్పును పునఃసమీక్షించండి

0
242

ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు కేంద్రం వినతి

దిల్లీ: రిజర్వేషన్‌ ప్రయోజనాల విషయంలో షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), తెగ(ఎస్టీ)లకు ‘సంపన్న శ్రేణి’ని వర్తింపచేయాలన్న తీర్పును పునఃసమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టును కోరింది. ఇందుకోసం ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అభ్యర్థించింది.

‘జర్నైల్‌ సింగ్‌ కేసు’లో 2018లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని ధనికులకు కాలేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్లు కల్పించరాదని అందులో స్పష్టంచేసింది. సమానత్వ సూత్రాన్ని అమలు చేసి, అలాంటి వర్గాలు, ఉప వర్గాల్లోని సంపన్న శ్రేణిని రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉందని తేల్చి చెప్పింది. ఈ అంశంపై నేషనల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఫర్‌ రివిజన్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాలసీ అధ్యక్షుడు ఒ.పి.శుక్లా ప్రజాహిత వ్యాజ్యం వేశారు. నిజంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. ఇందుకోసం దీర్ఘకాలంగా ఆ ఫలాలు అనుభవిస్తున్న వారిని గుర్తించి, తొలగించాలని అభ్యర్థించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ తాజాగా వాదనలు వినిపించారు. ‘‘గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ఇప్పుడు ఏడుగురు సభ్యుల బెంచీకి వెళ్లాలి’’ అని కోరారు. 2008లో ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ వర్గాలను సంపన్న శ్రేణి అంశం నుంచి మినహాయించిందన్న విషయాన్ని 2018 నాటి తీర్పు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ కేసును రెండు వారాల తర్వాత విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి స్పష్టంచేశారు.

Courtesy Eenadu…

Leave a Reply