ఆగని అద్దె గర్భాల దందా!

0
252
ఆగని అద్దె గర్భాల దందా!

గిరిజన మహిళలకు డబ్బు ఆశ చూపి ఒత్తిడి

జయశంకర్‌ భూపాలపల్లి, మంగపేట, న్యూస్‌టుడే: మన్యం ప్రాంతాల్లోని అమాయక మహిళలే లక్ష్యంగా అద్దె గర్భాల దందాను కొంత మంది ఏజెంట్లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం గిరిజన ప్రాంతాల మహిళలను అద్దె గర్భాలకు ఒప్పుకోవాలని డబ్బు ఆశ చూపి వారి భర్తల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. గత సంవత్సరం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లిమల్లారంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జగ్గారం, అనంతారం, భూపాలపట్నంలో అద్ద్దెగర్భాల విషయం వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఏజెంట్లను, బాధిత మహిళలను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఈ వ్యవహారం సద్దుమణిగినా తిరిగి కొనసాగుతోంది.

కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా మన్యం ప్రాంతంలో ఈ దందా కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన ఓ వివాహిత ఆదివారం తన గోడును ‘న్యూస్‌టుడే’కు చెప్పుకున్నారు. పినపాక మండలానికి చెందిన ఓ ఏజెంట్‌ ఒత్తిడితో తన భర్త అద్దె గర్భం దాల్చాలని సంవత్సరం క్రితమే భువనగిరికి తీసుకెళ్లాడని తెలిపారు. తనకు ఇష్టం లేక అక్కడి వైద్యులను ప్రాధేయపడి తిరిగి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. అప్పటి నుంచి తన భర్త ఇబ్బంది పెడుతున్నాడని, 10 రోజుల క్రితం ఈ విషయాన్ని మంగపేట పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. పోలీసులు ఆమె భర్తను పిలిపించి అలాంటి ప్రయత్నం మానుకోవాలని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ భువనగిరికి కాకుండా అద్దె గర్భం దాల్చేందుకు తాజాగా దుబాయ్‌కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. మీడియా ద్వారా ఈ ప్రయత్నాన్ని ఆపాలని మహిళ కోరుతున్నారు. ఈ విషయంపై మంగపేట ఎస్సై వెంకటేశ్వర్‌రావును వివరణ కోరగా.. ‘భార్యాభర్తల గొడవ విషయంలో ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ఆమె భర్త అద్దె గర్భం దాల్చమని, దుబాయ్‌ వెళ్లి పని చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని తెలిపింది. భర్తను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం’ అని చెప్పారు.

Courtesy Eenadu

Leave a Reply