హక్కుల దృక్పథానికి గ్రహణం

0
136

కల్పన కన్నబిరాన్

రాజ్యాంగ పదవులలో ఉన్న లేదా ప్రజాజీవితంలో ప్రముఖులుగా ఉన్న వ్యక్తుల భావాలు, అభిప్రాయాలు ఏ సమాజంలోనైనా ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. సామాన్యుల పిచ్చాపాటీలోను, మేధావుల చర్చలలోను అవి ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో విధులు–హక్కులు అనే అంశం ఆ విధమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ప్రజలు నిత్యం హక్కుల గురించే మాట్లాడుతూ తమ విధులు లేదా బాధ్యతలను విస్మరిస్తున్నారనే భావనతో మన పాలకులు అప్పుడప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్న విషయాల గురించి ఉపదేశిస్తుంటారు. అత్యున్నత అధికార ప్రాభవంతో వెలిగిపోతున్నవారి మాటలను అంత తేలిగ్గా తోసిపుచ్చలేం. అవి సర్వసాధారణమైనవే అయినప్పటికీ, మన సంచిత విజ్ఞానం, విద్వత్ గరిమతో ఆ మాటలను నిశితంగా తర్కించడంలో నిమగ్నులమవుతాం. ఆ మాటలు అల్పమైనవి లేదా అప్రధానమైనవే కావచ్చు గానీ వాస్తవంగా అవి మన రాజ్యాంగ విలువలు, ప్రధాన సూత్రాలపై దాడి చేసినవి కావడంతో వాటిని మన చారిత్రక అనుభవాల వెలుగులో, సంవిధాన సంప్రదాయాల స్ఫూర్తితో పరీక్షించడం తప్పనిసరి అవుతుంది.

వర్తమానాన్ని సంక్షుభిత పరుస్తున్న సంఘటనలనే పరిగణనలోకి తీసుకోండి. అత్యంత అరుదుగా సంభవించే ఒక భయానక మహామారి సాన్నిహిత్యంలో మన జీవితాలు సాగుతున్నాయి. కుటుంబాలు, ఇరుగు పొరుగులు, సామూహిక బృందాలు, పని ప్రదేశాలు కొవిడ్-19 బాధితమయి ఉన్నాయి. మనుగడ సంక్షోభాల వెల్లువలో చిక్కుకుంది. సంఖ్యానేకులు తమ జీవనాధారాలు, ఉద్యోగాలు కోల్పోయారు. ‘ఆర్థిక శ్రేయస్సు’కు ‘గిగ్ ఎకానమీ’ (కాంట్రాక్ట్ పనుల ఆర్థికవ్యవస్థ) ఆలంబన అయింది! చిన్నారుల భవిష్యత్తు అపాయంలో పడింది. ప్రాథమిక విద్యాభ్యాసం సైతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది! ఈ అతి నవీన విద్యాబోధనను పొందగల సదుపాయాలు ఎంత మందికి ఉన్నాయి? అధికరణ 21–ఎ ద్వారా భావి పౌరులకు మన రాజ్యాంగం కల్పించిన ‘విద్యాహక్కు’ అసంఖ్యాక బాలలకు సమకూరడమే లేదు. విద్య కంటే అధ్వాన్నం వైద్యం. ఆరోగ్య భద్రతకు భరోసా కరువయింది. ప్రజారోగ్య వ్యవస్థకే అనేక అనారోగ్యాలు.

ఈ విషమ పరిస్థితుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించవలసిన ప్రభుత్వాల ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. వింత గొలుపుతున్నాయి. ప్రజలకు శ్రేయస్సును సమకూర్చడంలో పాలకులకు స్పష్టమైన బాధ్యతలను భారత రాజ్యాంగం నిర్దేశించింది. అయితే రాజ్యాంగ విహిత బాధ్యతలను నిర్వర్తించేందుకు తాము ఎలాంటి చర్యలు చేపడతున్నదీ అడగవద్దని పాలకులు అంటున్నారు. ‘జాతి’కి సేవ చేయడమే మీ విధ్యుక్త ధర్మమని, దానిని పాటించాలని కోరుతున్నారు. హక్కుల (రైట్స్)ను డిమాండ్ చేయకుండా విధుల (డ్యూటీస్)ను శిరసావహించాలని ఉపదేశిస్తున్నారు. ఈ సందేశాన్ని ఇస్తున్నవారు తొలుతనే చెప్పినట్టు అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఉన్నవారే. 2020 ఫిబ్రవరి 20న నాటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే, 2022 జనవరి 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2022 జనవరి 26న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ హక్కులను కాకుండా విధులను పట్టించుకోవాలని ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హక్కుల కంటే విధులకు ప్రాధాన్యమివ్వాలని వారు ప్రబోధించిన సందర్భాన్ని గమనంలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అల్లర్లు, రాజ్యవ్యవస్థ బాధ్యతారాహిత్య నేపథ్యంలోనే వారు ఆ విజ్ఞప్తులు చేశారు. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరంలోనే దేశ ప్రజలు తమ హక్కుల గురించి నొక్కి చెప్పవలసిరావడం ఎంత విషాదకరం? ఇప్పటికే చవిచూస్తున్నవే కాకుండా మరెన్ని కష్టనష్టాలు సంభవించినా సరే ప్రజలు తమ హక్కుల గురించి, అధికారంలో ఉన్నవారు ‘వినేందుకు’ వీలుగా పదేపదే ఎలుగెత్తవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పలువురు న్యాయశాస్త్ర కోవిదులు పౌరుల హక్కులు, విధులను కలిపివేసి, ఆ రెండిటినీ ఒక్కటిగా భావించడం జరిగింది. రాజ్యాంగం గురించి లోపభూయిష్ట అవగాహన కారణంగానే వారలా భావించారని నేను మళ్ళీ చెబుతున్నాను. హక్కులు, విధులు భిన్నమైనవి. హక్కుల కంటే విధులకే రాజ్యవ్యవస్థలు ఎందుకు ప్రాధాన్యమిస్తాయో తరచి చూద్దాం.

భారత రాజ్యాంగంలోని అధికరణ 51–ఎ (ప్రాథమిక విధులు)ను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ అధికరణను జోడించడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ మన ప్రస్తుత చర్చకు మరింత సందర్భశుద్ధిగల అంశం. ఆ సవరణ ద్వారానే రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాద, లౌకిక’ (సోషలిస్ట్, సెక్యులర్) అనే పదాలను చేర్చడం జరిగింది. మనదేశంలో సామ్యవాద భావజాల సంప్రదాయాలను గుర్తుచేసుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ భూమికలో చేర్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా సోషలిస్టులు జైలులోనో లేక అరెస్ట్‌ను తప్పించుకోవడానికి అజ్ఞాతవాసంలోనే ఉండడం జరిగింది. జార్జి ఫెర్నాండెజ్ ఇందుకొక ఉదాహరణ. తెలుగు సమాజం విషయానికి వస్తే కవి చెరబండరాజు అత్యవసర పరిస్థితిలో జైలులో ఉన్నారు. ఉద్యోగం నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యం, రాజకీయ అసమ్మతికి మద్దతుగా ఆయన ‘ఇందిరమ్మా నీ సోషలిజం చాలు చాలు’ అనే స్వీయ గీతాన్ని ఆలాపించారు. ‘సామ్యవాద’ అనే పదం ఇప్పుడు రాజ్యాంగ మున్నుడిలో అంతర్భాగం అనేది నిర్వివాదం. అయితే ఆ భావనను రాజ్యాంగ ప్రస్తావనలో చేర్చిన సందర్భానికి ఒక ప్రాధాన్యమున్నది. రాజ్యాంగ అవతారికలో చొప్పించిన పదానికి, దేశంలోని సామ్యవాద భావజాల సంప్రదాయాల మధ్య రాజకీయ వ్యత్యాసమున్నది. ఇది గమనార్హమైన వాస్తవం.

1975 జూన్ 26న అత్యవసర పరిస్థితిని విధించిన నాటినుంచి 1977 మార్చి 21న దాన్ని ఎత్తివేసేంతవరకు ఆ చీకటిరోజుల నియంతృత్వ పాలనపై అలుపులేకుండా పోరాడిన పౌరహక్కుల న్యాయవాది కెజి కన్నబిరాన్ (1929–2010) అధికరణ 51–ఎ గురించి తన ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ‘24 గంటలు’లో చెప్పిన విషయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవలసిన అవసరముంది. ఆయన ఇలా రాశారు: ‘రాజ్యాంగంలోకి మీరు ఒకవైపు బాధ్యతలు ప్రవేశపెట్టి, మరోవైపు సోషలిజం ప్రవేశపెట్టారంటే ఇవి రెండూ కలిస్తే నేషనల్ సోషలిజం అవుతుంది అని నేనన్నాను. నేషనల్ సోషలిజం అంటే నాజీజం. హిట్లర్ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఉపయోగించిన నినాదం అది. దాన్ని అవలంబించడం అంత మంచిపనేమీ కాదు అని చెప్పాను’. ఆయన ఇంకా ఇలా రాశారు: సైద్ధాంతికంగా చూస్తే మీరు మీ ప్రాథమిక హక్కులను వినియోగిస్తున్నారంటే , ఇతరులు వారి ప్రాథమిక హక్కులు అనుభవించడానికి బాధ్యత పడుతున్నారన్నమాట. అంటే ఇతరుల హక్కుల పరిరక్షణ మీ బాధ్యత అవుతుంది. హక్కులకూ బాధ్యతలకూ మధ్య సంబంధాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ నిర్బంధాల కేసులు వాదించే సందర్భంలో మళ్ళీ మళ్ళీ బైటపడిన విషయం ఏమంటే రాజ్యాంగంలోని హక్కుల ఆధారిత దృక్పథం క్రమక్రమంగా విచ్ఛిన్నమైపోయింది’.

సామ్యవాద, లౌకిక అనే పదాలను రాజ్యాంగ ఉపోద్ఘాతంలో చేర్చడాన్ని కన్నబిరాన్ హర్షించలేదు. అది అశుభ సూచక చర్య అని ఆయన భావించారు. హక్కులు శీఘ్రగతిన కుంచించుకుపోతున్న తరుణంలో విధులకు ఎనలేని ప్రాధాన్యం లభించడాన్ని ఆయన గుర్తించారు. అంతేకాదు రాజ్య హింస, అణచివేత మున్నెన్నడులేని విధంగా పెరిగిపోయిన సమయంలో విధులకు చట్టబద్ధమైన ప్రాధాన్యం పెరిగిపోవడంలోని ప్రమాదాన్ని ఆయన గుర్తించారు. నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఆ సవరణను ఆమోదించారు. నాటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎ‍ఎన్ రే, మెజారిటీ న్యాయమూర్తులు కూడా అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా తొలగించడం న్యాయబద్ధమే అన్న తీర్పు వెలువరించారు. ఒక్క జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా మాత్రమే ఈ తీర్పుతో విభేదించారు. 1977 మార్చిలో జరిగిన సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలయింది. ప్రాథమిక హక్కుల కంటే ప్రాథమిక విధులకు అమిత ప్రాధాన్యమివ్వడం ప్రభుత్వం కాళ్ళకింద భూమి కదులుతుందనడానికి సూచనగా భావించవచ్చు. మన కాలంలో ‘1977’ సందర్భం పునరావృతమవనున్నదనడానికి, అది తొలిసూచనేమో?! ‘మన నియంతృత్వ రాజ్యాన్ని ఎన్‌జీఓలు లేదా ఫేస్‌బుక్ లేదా ట్విటర్ అదుపుచేయలేవని’ జావేద్ నఖ్వీ చేసిన వ్యాఖ్యతో ఏకీభవిస్తూనే నేనా విషయాన్ని చెబుతున్నాను. రెండో స్వాతంత్ర్యోద్యమం మినహా మరేదీ మనలను ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడవేయలేదు. సరే, భారత్ ‘బలహీనపడడానికి’ నెహ్రూ–గాంధీ ప్రభుత్వాలే కారణమని ప్రస్తుత పాలకులు ఆరోపిస్తున్నారు. జాతి జ్ఞాపకాల నుంచి ఆ ప్రభుత్వాలను చెరిపివేసేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. చిత్రమేమిటంటే ఇందిరాగాంధీ అమలుపరిచిన ఎమర్జెన్సీకి చిహ్నమైన అధికరణ 51–ఎ యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్ఫూర్తిగా ఉంది! అత్యవసర పరిస్థితిని విధించిన 1975 నాటి పరిస్థితులతో పోల్చదగిన సందర్భంలోనే ఇప్పుడు మనమూ ఉన్నామనేది స్పష్టం. నాటి ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన వారే ‘సుపరిపాలన’గా చెప్పబడుతున్న నియంతృత్వ పాలన ముఖ్య లక్షణాలను పుణికిపుచ్చుకున్న మంచి మిత్రులుగా పరిణమించారు.

వ్యాసకర్త న్యాయశాస్త్ర కోవిదురాలు, సామాజిక శాస్త్రవేత్త

Courtesy Andhrajyothi

Leave a Reply