ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ అధికార పగ్గాలను తొలిసారి భారత సంతతి నేత, ఆ దేశ ఖజానా మాజీ చాన్స్‌లర్ (ఆర్థిక శాఖ మాజీ మంత్రి) రిషి సునాక్ (42) చేపట్టారు.
- బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి
- ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి నాయకుడిగా చరిత్ర తొలి బ్రిటిష్ హిందూ నేత గానూ..
- 200 ఏళ్ల తర్వాత అగ్ర పీఠంపై 42 ఏళ్ల పిన్న వయస్కుడు
- దీపావళి నాడు కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా సునాక్ ఏకగ్రీవ ఎన్నిక
- రాజుకు లిజ్ ట్రస్ రాజీనామా లేఖ ఆ వెంటనే చార్లె్‌సను కలిసిన రిషి
- ఆయన్ను ప్రధానిగా నియమించినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటన
- వెంటనే కార్యరంగంలోకి సునాక్
- ఆరుగురు మంత్రులకు ఉద్వాసన
- ఉపప్రధానిగా డొమినిక్ రాబ్
- ఆర్థిక మంత్రిగా జెరిమి హంట్
- సుయెల్లాకు మళ్లీ హోం శాఖ
- భారత్-బ్రిటన్ వ్యాపార సంబంధాలకు ఊపు
లండన్, అక్టోబరు 25: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ అధికార పగ్గాలను తొలిసారి భారత సంతతి నేత, ఆ దేశ ఖజానా మాజీ చాన్స్‌లర్ (ఆర్థిక శాఖ మాజీ మంత్రి) రిషి సునాక్ (42) చేపట్టారు. హిందూమతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే ఈయన.. దీపావళి నాడు అధికార కన్జర్వేటివ్ (టోరీ)పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన నాయకత్వ పోటీలో ఈయన్ను ఓడించి ప్రధాని పదవి చేపట్టిన లిజ్ ట్రస్.. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక చేతులెత్తేశారు. 45 రోజులు తిరక్కముందే ఆమె గత గురువారం (20న) పదవి నుంచి వైదొలగడం తెలిసిందే. ఆ స్థానానికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్ రేసులో నిలిచారు. అయితే అత్యధిక ఎంపీలు రిషికే మద్దతుగా నిలవడంతో వారిద్దరూ పోటీ నుంచి వైదొలగక తప్పలేదు. దరిమిలా ఆయన ఏకగ్రీవంగా కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికై చరిత్రకెక్కారు. ఆ పార్టీ చరిత్రలో ఇంతవరకు శ్వేతజాతీయేతరుడెవరూ నాయకుడిగా ఎన్నిక కాలేదు. ఆ మాటకొస్తే ఆ దేశ చరిత్రలోనే తొలిసారి బ్రిటి్‌ష-భారతీయుడు ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు మంగళవారం ఉదయం లిజ్ ట్రస్ నేతృత్వంలో కేబినెట్ చివరి సమావేశం జరిగింది.
అనంతరం బకింగ్‌హాం ప్యాలె్‌సకు వెళ్లి రాజు చార్లె్‌స-3కి ఆమె తన రాజీనామా లేఖ సమర్పించారు. తర్వాత కాసేపటికే రిషి అక్కడకు చేరుకున్నారు. రాజును కలిసి తన ఎన్నిక గురించి తెలియజేశారు. దాంతో బ్రిటన్ 57వ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాజు ఆయన్ను ఆహ్వానించారు. ‘ప్రధానిగా, ట్రెజరీ తొలి లార్డ్‌గా తన నియామకాన్ని అంగీకరిస్తూ రాజు చేతిని రిషి ముద్దాడారు (ఇది రాజసంప్రదాయం)’ అని బకింగ్‌హాం ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో జాతినుద్దేశించి ప్రధానిగా రిషి తొలి ప్రసంగం చేశారు. 210 ఏళ్లలో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడీయన. ఈయనకు ముందు ఇదే పార్టీకి చెందిన డేవిడ్ కామరాన్ (2010-16) 43 ఏళ్ల వయసులో ప్రధాని పగ్గాలు చేపట్టారు.
200 మందికిపైగా ఎంపీల మద్దతు..
కామన్స్ సభలో కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది ఎంపీలు ఉన్నారు. పార్టీ నాయకత్వ రేసులో నిలవడానికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉండాలి. బోరిస్ జాన్సన్ పోటీ నుంచి గౌరవంగా తప్పుకొన్నారు. ఈ సారి 200 మందికి పైగా ఎంపీలు రిషికి మద్దతిచ్చారు. పెన్నీ వంద మందిని కూడగట్టుకోలేక.. చివరి నిమిషంలో బరి నుంచి వైదొలిగారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలలోపు (స్థానిక కాలమానం) నామినేషన్లు అందాల్సి ఉండగా.. రిషి ఒక్కరే దాఖలు చేశారని, ఆయనే నాయకత్వ పోటీలో విజేత అని 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీ పార్లమెంటు కాంప్లెక్స్‌లో ప్రకటించారు.
పలువురు మంత్రులపై వేటు
రిషి కొత్త మంత్రుల నియామకాలకు శ్రీకారం చుట్టారు. కొత్త ఉపప్రధానిగా డొమినిక్ రాబ్‌ను నియమించారు. బోరిస్ మంత్రివర్గంలోనూ ఈయన ఇదే హోదాలో పనిచేశారు. న్యాయ మంత్రిగానూ వ్యవహరిస్తారు. రిషికి మద్దతుగా ఎంపీలను కూటగట్టడంలో ఈయనదే కీలక పాత్ర. ఆర్థిక మంత్రిగా జెరిమి హంట్ కొనసాగనున్నారు. వీసాలకు సంబంధించి భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసి.. ఇండో-ఇంగ్లండ్ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదరకపోవడానికి కారణమైన భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్కు మళ్లీ హోం శాఖే కట్టబెట్టడం గమనార్హం. కాగా.. ట్రస్ కేబినెట్లో పనిచేసిన ఆరుగురు మంత్రులను తొలగించారు.
హాజరుకాని భార్యాపిల్లలు
ప్రధాని రిషి బాధ్యతలు స్వీకరించేటప్పుడు, తొలి ప్రసంగం చేసేటప్పుడు ఆయన భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్క వస్తారని అంతా భావించారు. అయితే వారు రాలేదు.
పన్ను కోతలకు వ్యతిరేకి..
2015లో యార్క్‌షైర్‌లోని రిచ్మండ్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికవడంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రిషి.. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. ఆర్థిక శాఖలో తొలుత జూనియర్ పాత్ర పోషించారు. 2019 నుంచి 2020 వరకు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 2020లో సాజివ్ జావిద్ ఆకస్మికంగా ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ ఎకాయెకిన రిషిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు గట్టిగా కృషిచేసిన ఆయన.. ఎన్నికల్లో గెలవడానికి పన్ను కోతలు విధించనని ప్రకటించారు. గత నెలలో లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయినా.. నాడు ఓడించిన ఎంపీలే ఇప్పుడు పిలిచి ప్రధాని పదవిలో కూర్చోబెట్టడం గమనార్హం.
చేతికి ఎర్రకంకణంతో..
10-డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ప్రజలకు రిషి సునాక్ అభివాదం చేసినప్పుడు ఆయన చేతికి కట్టుకున్న ఎర్ర కంకణం (హిందీలో కలావా బంధన్ లేదా మౌలి) కనిపించింది. హిందువులు అతి పవిత్రంగా భావించే ఈ నూలు కంకణం ధరిస్తే.. ఎల్లవేళలా రక్షిస్తుందని.. శత్రువులపై విజయం సిద్ధిస్తుందని నమ్మకం.
భారత్-బ్రిటన్ వాణిజ్యానికి ఊపు
బ్రిటన్ ప్రధానిగా రిషి ఎన్నిక కావడంతో భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య సంబంధాలు ఊపందుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో ఆగిపోయిన చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2022 జనవరిలో భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలయ్యాయి. దీపావళి నాటికే స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చలు ముగియాల్సి ఉంది. అయితే బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత కారణంగా ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. రిషి సునాక్ రాకతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ స్థిరత్వం నెలకొంటుందని, వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగం పుంజుకుంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ పేర్కొంది.
ఏడేళ్లలో ప్రధాని పదవికి!
రాజకీయ వైకుంఠపాళిలో మోక్షం.. అంటే అత్యున్నతస్థాయి పదవిని పొందడం అంత వీజీ కాదు! అందుకు ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల కావాలి. ఆ కోణంలో చూస్తే రిషి సునాక్ తన రాజకీయ జీవితంలో అత్యంత వేగంగా ఎదిగారనే చెప్పొచ్చు. ఆయన 2014 అక్టోబరులో రిచ్మండ్ (యార్క్‌షైర్) ఎంపీగా ఎన్నికయ్యారు. అక్కణ్నుంచీ ఏడేళ్లలో.. ఏకంగా ప్రధాని పదవి స్థాయికి ఎదిగిపోయారు! సునాక్ కన్నా ముందు బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు అలా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొమ్మిదేళ్లల్లో ప్రధాని పదవి చేపట్టిన ఘనత ఉంది. కామెరాన్ పిలుపుతో టోరీలకు కంచుకోట అయిన రిచ్మండ్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న సునాక్ అక్కడి నుంచి వేగంగా ఎదిగారు.