వినపడదు..కనపడదు..

0
195

– దేశ సమస్యలపై పట్టనట్టు వ్యవహరిస్తున్న మోడీ సర్కార్‌
– ఆర్థిక పరిస్థితి కకావికలం
– పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగం
– వెంటాడుతున్న కరోనా వైరస్‌
– రైతులు, కార్మికుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం

న్యూఢిల్లీ : సగటు భారతీయుడ్ని మునుపెన్నడూ ఊహించని సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు అధిక ధరలు, బయటకు వెళ్లాలంటే కరోనా భయాలు..ఇలా ఎన్నాండ్లు? అనే ప్రశ్న సగటు పౌరుడ్ని వేధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఆందోళనకు దిగుతున్నారు. తమ ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ తీసుకొచ్చిన నూతన చట్టాల్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే మోడీ సర్కార్‌ ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రధాని మోడీ సహా ఆయన మంత్రివర్గం చాలా బిజీ బిజీగా గడుపుతోంది. దేశాన్ని పీడిస్తున్న సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. సమస్యలపై కేంద్రం దాటవేత ధోరణి చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహావిష్కరణలతో, ప్రారంభోత్సవాలతో ప్రధాని మోడీ హడావిడి పడుతున్నారని, మీడియా మేనేజ్‌మెంట్‌తో ప్రజల దృష్టిని పక్కకు తప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ దేశంలో ఏం జరుగుతోంది?
కేంద్రం తీసుకొచ్చిన..కార్మిక, వ్యవసాయ చట్టాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి రైతులు ఏవిధంగా పోరాడుతున్నారో దేశ ప్రజలంతా చూశారు. పోలీసు నిర్బంధాలు, బారికేడ్లు, ముళ్లకంచలు, రబ్బరు బుల్లెట్లు, జల ఫిరంగులకు వెన్నుచూపకుండా రైతులు, కార్మికులు ముందుకు కదిలారు. దేశాన్ని పీడిస్తున్న మరో ముఖ్య సమస్య…ఆర్థికమాంద్యం. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 7.5శాతం పడిపోయింది. అత్యంత కీలకమైన 8 రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉపాధిరేటు 36.4శాతానికి క్షీణించింది. ఆర్థికవ్యవస్థ కోలుకోవటంపై అనుమానాలు బలపడుతున్నాయి. విశ్వాసం సన్నగిల్లుతోంది.

దారితప్పారు..?
ఆర్థికరంగంలో మోడీ సర్కార్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే..దేశం నేడున్న పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, సెప్టెంబరు 2019లో కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం. తద్వారా బడా కార్పొరేట్లకు, ప్రయివేటు పెట్టుబడిదారులకు రూ.1.45లక్షల కోట్లు లబ్ది చేకూర్చింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన మేలేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు విధించి, లే ఆఫ్‌లు ప్రకటించి కార్పొరేట్‌ వర్గం లాభాల మార్జిన్లు పెంచుకున్నాయి.

ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేలకోట్లు రుణాలు తీసుకొని..ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఆర్‌బీఐ మాజీ ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు తెలుపుతూ హెచ్చరించారు.

రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.6శాతానికి పెరిగింది. ఆరేండ్లలో ఇది రికార్డుస్థాయి పెరుగుదల. ఆహార ద్రవ్యోల్బణం 11శాతానికిపైగా పెరిగింది. కేంద్రం ఎంచుకున్న ఆర్థిక విధానాలు సరైనవి కావని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధిపై చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని అర్థమవుతోంది. మరోవైపు కరోనా వైరస్‌ రెండోసారి కాటేయడానికి మాటువేసుకొని ఉంది. రెండో ఉధృతి (సెకండ్‌ వేవ్‌) నుంచి ప్రజల్ని తప్పించడానికి చేస్తున్న ఏర్పాట్లేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకల్లో కరోనా మరణాలు మళ్లీ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించే ప్రయత్నం, నిధులు కేటాయింపుపై మోడీ సర్కార్‌ విముఖంగా ఉన్నట్టు కనపడుతోంది.

మాట్లాడే సమయం కూడా లేదా?
ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. హోంమంత్రి అమిత్‌ షా..బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలపై దృష్టిపెట్టారు. రాజకీయంగా కలిసివచ్చే సామాజికవర్గాలతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. మంత్రివర్గంలోని వారంతా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే దేశంలో అత్యంత కీలకమైన కార్మిక, రైతాంగ సమస్యలపై చర్చించడానికి మాత్రం వీరికి తీరిక లేదు. పంజాబ్‌లో రైతులు ఆందోళన చేస్తుంటే, వారి ప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిగానీ, ఆ శాఖ సహాయ మంత్రిగానీ ఆసక్తి చూపలేదు. మరోవైపు ఎక్కడికిపోయినా..తాము చేసిన నూతన వ్యవసాయ చట్టాలతో గొప్ప మేలు జరుగుతుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల అభ్యంతరాల్ని మాత్రం పట్టించుకోవటం లేదు.

Courtery Nava Telangana

Leave a Reply