సీఎంకు రోడ్డు కోసం ఇళ్ల కూల్చివేత!

0
212
సీఎంకు రోడ్డు కోసం ఇళ్ల కూల్చివేత!
రాత్రికి రాత్రే మార్కింగ్‌ చేసిన అధికారులు
ఫామ్‌హౌస్‌ నుంచి యాదాద్రికి నేరుగా రోడ్డు
బోరు బావులు, పంట చేలల్లో మట్టి
లబో దిబోమంటున్న కొండాపూర్‌ రైతులు
ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎదుట ధర్నా

యాదాద్రి: యాదాద్రి ఆలయానికి ముఖ్యమంత్రి వెళ్లే రోడ్డు కోసం రైతులను నిరాశ్రయులను చేస్తున్నారు అధికారులు. ఇంతకుముందు రోడ్డు నిర్మాణం కోసం ఓ రైతుకు చెందిన బోరుబావిని పూడ్చగా.. ఇప్పుడు మరికొందరు రైతుల బోరుబావులతోపాటు పంట పొలాల్లో మట్టి పోస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉండే ఇళ్లను సైతం కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులు లబో దిబోమంటూ ఆర్‌అండ్‌బీ అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సీఎం కేసీఆర్‌ నేరుగా వెళ్లడానికిగాను ఆర్‌అండ్‌బీ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్‌-వాసాలమర్రి మీదుగా కొత్తగా రహదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భూసేకరణకు నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం సమాచారం తెలపకుండా తమ బోరుబావులు, పంట పొలాల గుండా రోడ్డు వేస్తున్నారని రైతులు అంటున్నారు.

రాత్రికి రాత్రే పనులు చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయంటూ బోరుబావులు, పంట చేలల్లో మట్టి పోస్తున్నారని చెబుతున్నారు. కొండాపూర్‌లో రహదారి వెంట ఇళ్లను కూడా కూల్చి వేస్తామంటూ మార్కింగ్‌ చేశారని చెప్పారు. గ్రామానికి చెందిన పోతరాజు చిన మల్లయ్యకు చెందిన ఎకరం కందిచేనులో మట్టిపోసినట్లు తెలిపారు. దీంతో తాము ఎలా బతకాలంటూ అతని ఇద్దరు కుమారులు ప్రశ్నిస్తున్నారు. శివరాత్రి సత్తయ్య అనే యువకుడి ఇంటిని కూల్చివేస్తామనడంతో అతడు బెంగతో ఫిట్స్‌ వచ్చి అనారోగ్యానికి గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు నిర్వాసితులు సోమవారం భువనగిరిలోని ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో మంగళవారం గ్రామాన్ని సందర్శించి తగిన న్యాయం చేస్తామని ఈఈ శంకరయ్య హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

(Courtesy Andhrajyothi)

Leave a Reply