రూ.వెయ్యి కోట్ల భూమి హాంఫట్‌!

0
135
  • భారీగా ఎసైన్డ్‌ భూముల ఆక్రమణ
  • అడ్డుకున్నవారికి బెదిరింపులు
  • ఓఆర్‌ఆర్‌కు ఏడు మైళ్ల దూరంలో దందా
  • సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో 310 ఎకరాల్లో కబ్జాలు

హైదరాబాద్‌: బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)కి ఏడు మైళ్ల దూరంలో ఉన్నాయి ఆ భూములు. ఒక్కో ఎకరా ధర రూ.మూడు కోట్ల పైమాటే. పరిశ్రమలు విస్తరిస్తుండటంతో కొన్ని చోట్ల ఎకరా రూ.నాలుగు కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జాకు పాల్పడటం అక్కడ సాధారణంగా మారింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ప్రభుత్వ, మిగులు, ఎసైన్డ్‌ భూముల కబ్జా బాగోతంలో ఏకంగా రెవెన్యూ దస్త్రాలనే మార్చేశారు. ఎసైన్డ్‌ భూములను ఇతరుల పేర్లతో రాసేశారు. దాదాపు 310 ఎకరాల మిగులు, ఎసైన్డ్‌, ప్రభుత్వ భూములు ఆక్రమణల పాలయ్యాయన్న అంచనాలు ఉన్నాయి.

జిన్నారం మండలం కిష్టాయిపల్లిలో 42వ సర్వే నంబరులో 40 ఎకరాలు ఆక్రమణదారుల పరమయ్యాయి. 166వ సర్వే నంబరులోని 327 ఎకరాల్లో 180 ఎకరాల ఎసైన్డ్‌, 20 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఇతరుల పేర్లపైకి హక్కులు మారాయి. గడ్డ పోచారం పరిధిలో 79వ సర్వే నంబరులో 134 ఎకరాల సీలింగ్‌ భూమిని గతంలో దిల్‌ సంస్థకు కేటాయించారు. ప్రభుత్వం తిరిగి తీసుకోగా దీనిలో 34 ఎకరాలను కొందరు ఆక్రమించారు. కొంత విస్తీర్ణానికి దొడ్డిదారిన పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లూ చేసుకుంటున్నారు. ఆలీనగర్‌లోని 42వ సర్వే నంబరులో 36 ఎకరాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.

కిష్టాయిపల్లిలో 1978లో ప్రభుత్వం పేదలకు పంచిన ఎసైన్డ్‌ భూముల ఆక్రమణ నుంచి అక్రమం మొగ్గతొడిగింది. మండలానికి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఎసైన్డ్‌ లబ్ధిదారులను బెదిరించి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. ఎయిర్‌ఫోర్సు, ఇతర పరిశ్రమలు వస్తున్నాయంటూ ఎకరాకు రూ.లక్షన్నర చేతుల్లో పెట్టి పేదలను వెళ్లగొట్టారు. ఆ ప్రజాప్రతినిధికి రాష్ట్రస్థాయి నాయకుడు ఒకరు తోడయ్యాడు. మండలంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి వారితో చేతులు కలిపినట్లు తెలిసింది. ఏకంగా ఖాస్రా పహాణీని మాయం చేసి ఆధారాలేవీ లేకుండా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎసైన్డ్‌ చట్టానికి తూట్లు పొడుస్తూ 140 ఎకరాలకు యాజమాన్య హక్కులు మార్చేశారు.

దందా వెనుక ఆ ముగ్గురి పాత్ర
ప్రభుత్వ భూముల ఆక్రమణల దందా వెనుక ముగ్గురి ప్రమేయం ఉందని స్థానికులు చెబుతున్నారు. మండలానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఇందులో కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఇక్కడ పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి దస్త్రాలను చక్క’దిద్ద’డంతోపాటు మాయం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కబ్జా, ఆక్రమణదారులకు ఎవరైనా ఎదురుతిరిగితే పంచాయితీలు చేయడంలో మరో అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎసైన్డ్‌, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ప్రశ్నించినవాళ్లను కొందరు నాయకులు నయానోభయానో లొంగదీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ భూముల్లో ఐదు గుంటల విస్తీర్ణంలో నిర్మించిన గెస్ట్‌హౌస్‌లను కానుకలుగా ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఐదు గుంటల విస్తీర్ణం విలువ ఇక్కడ రూ.70 లక్షల వరకు పలుకుతోంది. కొందరు నాయకులు, అధికారులకూ ఇదే విధంగా కానుకలిచ్చారని స్థానికంగా ప్రచారం ఉంది.

 కిష్టాయిపల్లిలో సర్వే నంబరు 166/ఆ2లో 3.24 గుంటల భూమి బైండ్ల లక్ష్మయ్యకు ప్రభుత్వం ఎసైన్డ్‌ చేసింది. ఇప్పుడది మరో వ్యక్తి పేరుపై మారింది. పట్టా పాసుపుస్తకాలూ జారీ అయ్యాయి.
 166/2ఇలో మాదారం రాజయ్యకు 2.24 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. అందులో నగరానికి చెందిన ఓ వ్యక్తిపేరుపై 2.04ఎకరాలు, ఓ ప్రజాప్రతినిధి బంధువు పేరుపై 12గుంటలు, మరో ఎకరా భూమి మారింది.
 166/2ఈలో బ్యాగరి సత్తెమ్మకు 3.24 గుంటల ఎసైన్డ్‌ భూమి ఉంది. ఇప్పుడది ఓ ప్రజాప్రతినిధి బంధువు పేరుపై చేరింది. 16 గుంటలు మరో మహిళ పేరున చూపుతోంది.
 166/ఉ సర్వే నంబరులోని 3.24 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని ఓ పేద రైతుకు ఇవ్వగా పదేళ్ల క్రితం మరో వ్యక్తి పేరుపైకి మారింది. రెండేళ్ల క్రితం దానిలో 1.32 ఎకరాలు మరో వ్యక్తిపైకి మార్చేశారు.
 166/3అ2ని 28 గుంటలను ములుగు నర్సింహులుకు ఎసైన్డ్‌ చేశారు. ఇందులో ప్రస్తుతం 35 గుంటలు ఉన్నట్లు చూపుతున్నారు. యాజమాన్య హక్కులు నగరానికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్నాయి. 166/3ఆ1 సర్వే నంబరులో పుల్లగరి శివయ్యకు ప్రభుత్వం ఇచ్చిన 13 గుంటల భూమి, 166/3ఆ2 సర్వే నంబరులో పుల్లగరి నర్సింహులుకు ఇచ్చిన 32 గుంటలూ నగరానికి చెందిన వ్యక్తి పేరుతోనే ఉన్నాయి.
 166/11లో ఓ రైతుకు 7 ఎకరాలను ఎసైన్డ్‌ చేయగా.. రెవెన్యూ దస్త్రాలను దిద్ది 17.36 ఎకరాలుగా మార్చారు. ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరుపై ఈ విస్తీర్ణం మారింది. 166/39 సర్వే నంబరులో నీరుడి సత్తెమ్మ అనే మహిళా రైతుకు ప్రభుత్వం మూడు ఎకరాల ఎసైన్డ్‌ భూమి ఉండగా ఓ ప్రజాప్రతినిధి పేరుపైకి మార్చారు. 166/40 సర్వే నంబరులోని కుమ్మరి ఆండాలుకు 1.20 ఎకరాలు ఎసైన్డ్‌ భూమి ఉండగా ఒక ఎకరం మండలానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి పేరుపైకి మారింది.

Courtesy Eenadu

Leave a Reply