పిఎం కేర్స్‌ వివరాలు వెల్లడించాలి

0
483

తప్పు చేయకుంటే భయమెందుకు?
నిధుల సేకరణ, వ్యయం రహస్యమా?
కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌

హైదరాబాద్‌: ప్రైమ్‌ మినిస్టర్‌ సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్‌ ఫండ్‌( పిఎంకేర్స్‌) నిధుల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిధుల సేకరణ, వ్యయాలను ప్రజలముందుంచాలన్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, బాధ్యత కల్గిన అత్యున్నత పదవిలో ఉన్న వారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.

కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన విపత్తు నిధి కోసం సేకరిస్తున్న నిధుల వ్యయంపై విమర్శలు వస్తున్న తరుణంలో ‘పిఎం కేర్స్‌లో రహస్యాలెందుకు’ అనే అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్‌ జరిగింది. ఎస్‌వికె మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ఎంబివికె కార్యదర్శి పి.మురళీకృష్ణ వందన సమర్పణ చేశారు.

‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి(పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌), 1995లో ఏర్పాటు చేసిన జాతీయ విపత్తు నివారణ పరిహార నిధిలను కాదని ఎలాంటి చట్ట బద్దత లేకుండా కేవలం పిఎం వెబ్‌సైట్‌లో పొందుపర్చడం ద్వారా పిఎం కేర్స్‌ను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవడంలో తప్పు లేదు.. అదే సందర్భంలో దాని చట్ట బద్ధత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రజల ముందుచాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించారని చెబుతున్నారు. ఆ నిధుల సేకరణ, వ్యయాన్ని బహిర్గతం చేయాలి’ అని శ్రీధర్‌ అన్నారు.

పింఎం కేర్స్‌ నిధుల సేకరణ, వ్యయంపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే తమది పబ్లిక్‌ సంస్థ కానందున ఇవ్వమని చెప్పారని పేర్కొన్నారు. పిఎం కేర్స్‌ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోడీ, సభ్యులుగా కేంద్ర రక్షణ, హౌం, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారని చెప్పారు. పిఎం కేర్స్‌ ఫండ్‌కు అందించే విరాళాలకు పన్ను మినహాయింపు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. చట్టపరమైన సవరణల ద్వారా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వెసులుబాటు పొందిన సంస్థ ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని మాడభూషి స్పష్టం చేశారు. కావాలనే ప్రజలను పక్కదారి పట్టిస్తున్నరని, ఇది సరి కాదని కేంద్ర పెద్దలకు ఆయన సూచించారు. కేంద్రం తన పారదర్శకతను రుజువు చేసుకోవాలని మాడభూషి శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు.

Courtesy Prajasakti

Leave a Reply