ఒక్క రోజే రూ.125 కోట్ల మద్యం అమ్మకం!

0
200

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. బుధవారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో మంగళవారం దాదాపు రూ.125 కోట్ల విలువైన సరకు డిపోల నుంచి వైన్‌షాప్‌లకు తరలింది. మంగళవారం సాయంత్రం మద్యం కొనుగోళ్ల కోసం వినియోగదారులు వైన్స్‌ ముందు బారులు తీరడంతో చాలా దుకాణాల్లోని మద్యం పూర్తిగా అమ్ముడైంది. పది రోజులపాటు లాక్‌డౌన్‌ అమలు కానుండడంతో చాలామంది పెద్దమొత్తంలో కొనుగోలు చేశారు. గత లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలకు తాళాలు వేయడంతో ఈసారీ అలాగే ఉంటుందేమోననే అనుమానంతో బారులు తీరారు. బుధవారం నుంచి పది రోజుల పాటు ఉదయం 6-10 గంటల వరకు విక్రయాలు సాగుతాయని ఎక్సైజ్‌ శాఖ ప్రకటించినా భారీమొత్తంలో కొనుగోలు చేశారు. ఈక్రమంలో పెద్దఎత్తున సరకు అమ్ముడుపోయింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి రూ.56 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలిపోగా.. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయానికి మొత్తం రూ.125 కోట్ల మద్యం తరలినట్లు గణాంకాలు వెల్లడించారు. ఎక్సైజ్‌ జిల్లాలవారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో రూ.10.17 కోట్లు, రంగారెడ్డిలో రూ.24.2 కోట్లు, మేడ్చల్‌లో రూ.3.68 కోట్లు, నల్గొండలో రూ.15.24 కోట్లు, వరంగల్‌లో రూ.11 కోట్లు, కరీంనగర్‌లో రూ.8.44 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.9.49 కోట్లు, మెదక్‌లో రూ.10.97 కోట్లు, నిజామాబాద్‌లో రూ.5.48 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ.6.59 కోట్ల మద్యం తరలింది.

విక్రయాలు రెట్టింపు: మే నెలలో మొదటి 11 రోజుల్లో రూ.676.17 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు తరలింది. ఈ లెక్కన రోజుకు సగటున రూ.61 కోట్ల విలువైన మద్యం తరలినట్లు చెప్పొచ్చు. అయితే లాక్‌డౌన్‌ ప్రకటించిన మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ.125 కోట్ల సరకు తరలడంతో సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపుకంటే అధికంగా అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేశాయి. మంగళవారం అత్యధికంగా అమ్ముడుపోయినందున రాబోయే రెండు, మూడు రోజులపాటు విక్రయాలు పడిపోయే అవకాశాలున్నట్లు వ్యాపారులు భావిస్తున్నారు.

Courtesy Eenadu

Leave a Reply