రూ.2.5 కోట్ల భూమి రూ.5 లక్షలకేనా?

0
296
  • మంత్రిమండలి అధికార దుర్వినియోగానికి పాల్పడరాదు
  • డైరెక్టర్‌ శంకర్‌కు 5 ఎకరాల కేటాయింపుపై హైకోర్టు

హైదరాబాద్‌: విలువైన భూములను తక్కువ ధరలకు కేటాయించేముందు దానికో ప్రాతిపదిక ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. భూకేటాయింపుల నిర్ణయంలో మంత్రిమండలి అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని వ్యాఖ్యానించింది. రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని రూ.5 లక్షలకు కేటాయించడంలో ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. హైదరాబాద్‌ మణికొండ సమీపంలోని శంకరపల్లిలో ఎకరా రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని సినీ దర్శకుడు, నిర్మాత ఎన్‌.శంకర్‌కు సినిమా స్టూడియో నిర్మాణానికి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను కరీంనగర్‌కు చెందిన జె.శంకర్‌ సవాలు చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.

‘‘హెచ్‌ఎండీయే దాఖలు చేసిన కౌంటరు ప్రకారమే ఎకరా రూ.2.5 కోట్ల విలువ ఉంది. అలాంటిది కేవలం రూ.5 లక్షలకు ఏ పద్ధతిలో కేటాయించారు? మంత్రిమండలి నిర్ణయం ఆర్థికపరమైన అంశాల ఆధారంగా ఉండాలి. అంతేగానీ అధికార దుర్వినియోగానికి పాల్పడరాదు. 300 మందికి ఉద్యోగం కల్పిస్తారని చెబుతున్నప్పటికీ రూ.2.5 కోట్ల భూమిని రూ.5 లక్షలకు ఎలా కేటాయిస్తారు? ఇది కారుచౌకగా కట్టబెట్టినట్లుంది. ఎవరికైనా భూమిని కేటాయించే ముందు ఓ విధానం అనుసరించాలని, వేలం వేయడం ద్వారా ప్రభుత్వం ఎక్కువ మొత్తం పొందగలదని సుప్రీం కోర్టు పలుమార్లు చెప్పింది. అంతేగానీ పప్పులు బెల్లాలకు ఇచ్చినట్లుగా భూములను ఇవ్వరాదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అందులో ఏవైనా నిర్మాణాలున్నాయాని ప్రశ్నించింది. నిర్మాణాలు ఏవీ లేవని చదును చేశారని, దీనిపై యథాతథ స్థితి ఉత్తర్వులున్నాయంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే గత ఏడాది జూన్‌లో భూమిని కేటాయించడానికి మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపించనున్నారని, వాయిదా వేయాలని కోరడంతో ధర్మాసనం అనుమతిస్తూ విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.

Courtesy Eenadu

Leave a Reply