నాన్చుతున్న ప్రభుత్వాలు.. నానుతున్న ధాన్యం!

0
109
  • తడిసిన ధాన్యం విలువ రూ. 200 కోట్లు..
  • ముందుకు సాగని టెండర్ల ప్రక్రియ
  • సీఎంవో దాటని టెండరు ప్రతిపాదనలు..
  • సీఎంఆర్‌ అనుమతిపై మౌనం వీడని కేంద్రం
  • ఇంకా ఆలస్యమైతే మరింత నష్టం..
  • రాష్ట్రానికే నష్టం.. ఎఫ్‌సీఐ సేఫ్‌!

ధాన్యం సేకరణపై ప్రభుత్వాల నాన్చుడు ధోరణితో గోదాముల్లోని సరుకు తడిసి ముద్దవుతోంది. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ పీటముడి వీడకపోవడం.. కేంద్ర ప్రభుత్వం 42 రోజులుగా తెలంగాణ నుంచి సేకరణను నిలిపివేయడంతో ఈ దుస్థితి నెలకొంది.  రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోవడంతో నష్టం రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి.. ఆరుబయట నిల్వ చేసిన వరి ధాన్యంలో 10% పూర్తిగా తడిసిపోయింది. నష్టం విలువ రూ.200 కోట్లు ఉంటుందని సమాచారం. 

హైదరాబాద్‌ : ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలకు సిద్ధమైంది. 10 లక్షల టన్నుల ధాన్యాన్ని, టెండరు పెట్టి విక్రయిస్తామని ప్రకటించింది. ఆ ప్రతిపాదనలు ఈ నెల 15 నుంచి సీఎం కార్యాలయం(సీఎంవో)లోనే మూలుగుతున్నాయి. అటువైపు నుంచి ఆమోదముద్ర లేకపోవడంతో.. ఆ ప్రతిపాదనలు సీఎంవోను దాటడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ ఉంది! ఇందులో ఆరుబయట టార్పాలిన్‌, జాబు పరదాలు కప్పి నిల్వచేసిన ధాన్యం 10 లక్షల టన్నులు ఉంటుందని పౌరసరఫరాల సంస్థ అధికారుల అంచనా. కోతుల బెడద, గాలి వానకు టార్పాలిన్‌ దెబ్బతిన్నచోట్ల ధాన్యం తడిసింది. మరికొన్నిచోట్ల వరదనీరు రావటంతో కింది వరుసల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిశాయి. ఏ జిల్లాలో ఎంత ధాన్యం తడిసిందనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషరేట్‌ నుంచి డీఎ్‌సవోలకు ఆదేశాలు వెళ్లాయి. నాలుగైదు జిల్లాలు మినహా.. మిగతా చోట్ల నుంచి వచ్చిన సమాచారం మేరకు 10 లక్షల టన్నుల ధాన్యంలో… 10 శాతం ధాన్యం(లక్ష టన్నులు) పూర్తిగా తడిసిపోయాయని అధికారులు చెబుతున్నారు.

ఇలా తడిసిన ధాన్యం విలువ సుమారు రూ. 200 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేశారు. సీఎంవో నుంచి ఈ జాప్యం ఇలాగే కొనసాగితే.. నష్టం మరింత పెరిగే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం ఆరంభంలోనే ఈ స్థాయిలో వరదల బీభత్సం ఉంటే.. ఈనెలాఖరు, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని అధికారులు అంటున్నారు. ధాన్యం మిల్లింగ్‌ ప్రారంభించకున్నా.. కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్‌ తీసుకోకుండా ఇలాగే ఆలస్యం చేసినా.. భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెండర్లు పిలిచి.. ధాన్యాన్ని మార్కెట్లో అమ్మేద్దామని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరు బయట ఉన్న 10 లక్షల టన్నులను ఈ కేటగిరీలో విక్రయించాలనుకున్నారు. కానీ.. ఆ ప్రతిపాదనలు సీఎంవో గడపను దాటలేకపోతున్నాయి.

రాష్ట్రానికే నష్టం..?
వానలకు తడిసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా డిస్పోజల్‌ చేస్తే ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఉండదు. టెండర్లలో ధాన్యం తీసుకున్న రైస్‌ మిల్లర్లు, ట్రేడర్లు, ఎగుమతిదారులు ఎవరైనా.. దీనిని బాయిల్డ్‌ రైస్‌గానే మారుస్తారు. సాధారణ పరిస్థితుల్లో కూడా రైస్‌మిల్లుల్లో తడిసే ధాన్యం 5ు ఉంటుంది. ఇప్పుడు మరో 5ు పెరిగింది. ఎలాగూ బాయిల్డ్‌ రైస్‌ను ఉత్పత్తి చేస్తే.. తడవని ధాన్యంలో తడిసిన ధాన్యం కూడా కలిసి మిల్లింగ్‌ అవుతుంది. విత్తుగా ఉన్నపుడే బాయిల్డ్‌ చేయటంతో నష్టం ఉండదని మిల్లర్లు చెబుతున్నారు. కానీ టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగితే మాత్రం.. ఈ నష్టాన్ని నియంత్రించటం ఎవరితరం కాదంటున్నారు. మిల్లింగ్‌కు అక్కరకు రాకుండా తడిసిన ఽధాన్యం కాస్త.. టెండర్లలో అమ్ముడు పోకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి తీరని నష్టం వస్తుంది. ఇప్పుటికే బ్యాంకుల్లో తీసుకున్న వేల కోట్ల అప్పులకు వడ్డీలు అదనపు భారం అవుతాయి. రైతులకు ఎమ్మెస్పీ చెల్లించి, ప్రొక్యూర్మెంట్‌, రవాణా ఇతరత్రా ఖర్చులు భరించి కొనుగోలుచేసిన ధాన్యం.. అక్కరకు రాకుండా పోతే రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా పెట్టిన పెట్టుబడి ఏమీలేదు. భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ)కు బియ్యం డెలివరీ ఇచ్చిన తర్వాతే.. డబ్బులు చెల్లిస్తుంది. సీఎంఆర్‌ ఇవ్వకపోతే చెల్లింపులు ఉండవు. దీంతో కేంద్రానికి ఎలాంటి నష్టం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వంపైనే వేలకోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది.

ఆ బాధ్యత మిల్లర్లదే?
ధాన్యం కొనుగోళ్లకు రైస్‌మిల్లర్లు పెట్టే పెట్టుబడి నయాపైసా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బ్యాంకు గ్యారెంటీతో.. పౌరసరఫరాల సంస్థ బ్యాంకులో అప్పు తీసుకొని, రైతులకు చెల్లింపులు చేస్తుంది. రవాణా ఖర్చులు కూడా భరిస్తుంది. రైస్‌మిల్లర్లకు వారి సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయింపులు చేస్తుంది. రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి.. ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకుగాను మిల్లింగ్‌ చార్జీలతోపాటు స్టోరేజీ చార్జీలు కూడా రైస్‌మిల్లర్లకు చెల్లిస్తారు. నూకలు, తౌడు, పరం, పొట్టు లాంటి ఉప ఉత్పత్తులను మిల్లర్లే తీసుకుంటారు. నయాపైసా పెట్టుబడి లేకుండా ఽప్రభుత్వం చేపట్టే ధాన్యం ప్రొక్యూర్మెంట్‌ ద్వారా ఇన్నిరకాలుగా లబ్ధిపొందుతున్న రైస్‌మిల్లర్లపై ధాన్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది.

Leave a Reply