- రూ.5 లక్షల పెండింగ్ బిల్లుకు రూ.26 కోట్లు
- 1986 నాటి కాంట్రాక్టులో చెల్లింపునకు సిద్ధం
- ఓ మంత్రి ప్రమేయంతో జరిగినట్లు ప్రచారం
- కోర్టు కేసును వెనక్కుతీసుకోనున్న ప్రభుత్వం
- సమాచార హక్కు దరఖాస్తుతో వెలుగులోకి
- కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరినందుకే?
హైదరాబాద్, : అది ఎప్పుడో 1986 నాటి బ్రిడ్జి కాంట్రాక్టు..! రూ.20 లక్షల అంచనాతో టెండర్లు పిలవగా.. పనులు దక్కించుకున్న సంస్థ పదేళ్లకు పూర్తిచేసింది. ప్రభుత్వం రూ.5 లక్షలు బకాయి పడటంతో పాటు వ్యయం పెరిగిందని.. ఆ మొత్తం ఇప్పించాలని కంపెనీ కోర్టుకెక్కింది. మరో 12 ఏళ్ల తర్వాత సర్కారు నుంచి రూ.70 లక్షలు పొందింది. అవీ సరిపోలేదంటూ మళ్లీ కోర్టుకెళ్లింది. అయితే, ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తొలుత గట్టిగా వాదించిన ప్రభుత్వం తర్వాత మెత్తబడింది. ఇప్పుడు ఏకంగా రూ.26 కోట్లు చెల్లింపునకు సిద్ధమైంది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయం కారణాలతో మలుపు తిరిగింది. సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి వచ్చింది. పకడ్బందీగా సాగిన ఈ పథకంలో ఓ మంత్రి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఏం జరిగిందంటే..
నాడు పనులు చేసిన ఎమ్మెల్యే తండ్రి సంస్థ
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రహదారులు భవనాల శాఖ 1986లో రూ. 20 లక్షల అంచనాతో టెండర్లు పిలిచింది. ఉమా ఇంజినీరింగ్ కంపెనీ (ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డికి సంబంధించినది) టెండరు దక్కించుకుని 1996లో పని పూర్తిచేసింది. ఇందుకుగాను కంపెనీకి ప్రభుత్వం రూ.15 లక్షలు విడుదల చేసింది. అయితే, మిగతా రూ.5 లక్షల బిల్లుతో పాటు అంచనా వ్యయం పెరిగినందున అందుకు అనుగుణంగా మొత్తం మంజూరు చేయాలని కాంట్రాక్టు కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీంతో 2008లో ఆ సంస్థకు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. ఇవి కూడా సరిపోలేదంటూ కంపెనీ మరో పిటిషన్ దాఖలు చేసింది. బ్రిడ్జి పనులతో నష్టం జరిగిందని పేర్కొంటూ, రూ.26.30 కోట్లు మంజూరుకు ఆదేశాలివ్వాలని కోరింది. అయితే, ఇప్పటికే రెండు విడతల్లో రూ.85 లక్షలు చెల్లించినందున ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వనపర్తి జిల్లా కలెక్టర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీ మారడంతో..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత వివాదం మలుపు తిరిగింది. కాంట్రాక్టు కంపెనీ ఇక చెల్లించేది లేదంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు బయటే వివాదాన్ని పరిష్కరించుకుంటామని పేర్కొంది. దీనికి అనుగుణంగా ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ గత నెల 29న ఈఎన్‌సీకి సూచన చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హై కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేలా సంబంధిత ఎస్‌ఈ, ఈఈలను ఆదేశించాలని సూచించారు. కాంట్రాక్టు కంపెనీకి రూ. 26.30 కోట్లు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. మరోవైపు ఈ పనికి సంబంధించిన జీవోలను గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరినందుకు నజరానాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Courtesy Andhrajyothi