రాంకీ చెరలో ప్రభుత్వ భూమి

0
218

దుండిగల్‌లో 96 ఎకరాల ఆక్రమణ
విలువ రూ.300 కోట్లకు పైనే
సర్వేలో గుర్తించి మూడేళ్లయినా చర్యల్లేవు

హైదరాబాద్‌ , దుండిగల్‌: ఎక్కడైనా ప్రభుత్వ జాగాలో సామాన్యుడు వంద గజాల్లో ఇల్లు కట్టుకుంటే.. వెంటనే రెవెన్యూ అధికారులు వెళ్లి కూల్చేస్తారు. ఆక్రమణదారుగా ముద్ర వేసి కేసులు నమోదు చేస్తారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ వద్ద రాంకీ సంస్థ ప్రభుత్వ భూమిని తన అధీనంలోకి తెచ్చుకుని కంచె వేసినా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నగర శివారులోని దుండిగల్‌ సర్వే నం. 684లో 425.24 ఎకరాల భూమి ఉంది. దస్త్రాల ప్రకారం ‘పెద్ద కంచె సర్కారీ’గా ఉంది. అటవీ భూములను పెద్ద కంచెగా వ్యవహరిస్తారు. అటవీశాఖ గెజిట్‌ ప్రకారం నోటిఫై కాలేదు. అందుకే ప్రభుత్వం కేటాయింపులు జరుపుతోంది. 1998లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందులో 200 ఎకరాలను సర్వే నంబరు 684/1 కింద రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఏపీఐఐసీకి కేటాయించారు. ఏపీఐఐసీ రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌కు 2000 సంవత్సరంలో చౌకగా 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. ఏటా ఎకరాకు రూ.110 లీజును నిర్ణయించింది. రాంకీ సంస్థ ఇక్కడ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. కేటాయించిన భూములే కాకుండా సంస్థ మరో 96 ఎకరాలను ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన భూమి విలువ రూ.300 కోట్ల పైనే ఉంటుందని అంచనా.

స్థానికుల ఫిర్యాదుతో నాడు సర్వే
మూడేళ్ల క్రితం స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు 684 సర్వే నంబరులో ఉన్న మొత్తం భూమిపై సర్వే చేశారు. అందులో 96 ఎకరాలు రాంకీ సంస్థ ఆక్రమణలో ఉన్నట్టు తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తదుపరి చర్యల్లేవు. ప్రస్తుత దుండిగల్‌ తహసీల్దార్‌ భూపాల్‌ కూడా సర్వే చేసిన విషయాన్ని నిర్ధారించారు. రాంకీ ఆక్రమణలో 96 ఎకరాలు ఉన్నట్లు అప్పటి రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించారని, కంచె వేసి ప్లాంటేషన్‌ చేసినట్టు పేర్కొన్నారని తెలిపారు.

Courtesy Eenadu

Leave a Reply