‘అంచనాలకు’ అందని నష్టం!

0
225
‘అంచనాలకు’ అందని నష్టం!

 వాస్తవాలకు దూరంగా 14వ ఆర్థిక సంఘం అంచనాలు
ఏపీకి రూ.32వేల కోట్లు, తెలంగాణకు రూ.18వేల కోట్ల కోత

దిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా విషయంలో 14వ ఆర్థిక సంఘం అంచనాలకు, వాస్తవంగా వచ్చిన దానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో ఆర్థిక సంఘం చెప్పిన దానికంటే రాష్ట్రాలకు దాదాపు 18.83% నిధులు తగ్గాయి. 2014-15 నుంచి 2019-20 మధ్యకాలంలో జాతీయ నామమాత్రపు వృద్ధిరేటు 13.5% ఉంటుందన్న అంచనాతో 14వ ఆర్థిక సంఘం ఆదాయ అంచనాలను భారీగా వేసింది. వాస్తవం అందుకుభిన్నంగా ఉండటంతో గత ఐదేళ్లలో ఆర్థిక సంఘం అంచనాలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన వాటాల మధ్య రూ.7.43 లక్షల కోట్ల తేడా వచ్చింది. దీనివల్ల గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.32,007 కోట్లు (4.305% వాటా ప్రకారం), తెలంగాణకు రూ.18,118.78 కోట్లు (2.437% వాటా ప్రకారం) నష్టం జరిగినట్లు లెక్క. ఆర్థిక సంఘం వాస్తవానికి దగ్గరగా అంచనాలు వేసి ఉంటే రెవెన్యూలోటు కింద ఏపీకి దాదాపు ఇంత మొత్తం అదనంగా వచ్చేది.

తగ్గుతున్న పన్ను వసూళ్లు
2019-20లో ఆర్థిక సంఘం అంచనాలకు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన మొత్తానికి మధ్య రూ.3.78 లక్షల కోట్ల తేడా వచ్చింది. అంటే అంచనాలు 37% శాతం తప్పాయి. 2018-19లో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల పన్ను ఆదాయాలు జీడీపీలో 17.5% మేర ఉన్నట్లు 15వ ఆర్థిక సంఘం చెప్పింది. భారత పన్ను అంచనాల కంటే ఇది చాలా తక్కువని, 1990 దశకం తొలినాళ్ల నుంచీ ఇందులో పెద్దగా మార్పేమీ రాలేదని పేర్కొంది. అలాంటప్పుడు 14వ ఆర్థిక సంఘం అంత భారీ అంచనాలు ఎలా వేసిందో అర్థంకాని పరిస్థితి. ఇలాంటి వాటి వల్ల బడ్జెట్లు భారీగా తయారు చేయడం, చివరకు అంచనాలను అందుకోలేక అందులో కోతపెట్టడం సహజంగా మారుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ విధానంలో ప్రభుత్వానికి బహుముఖ సవాళ్లు ఎదురవుతున్నాయి. వాస్తవ అంచనాల కంటే వసూళ్లు చాలా తక్కువగా ఉంటున్నట్లు 15వ ఆర్థిక సంఘం పేర్కొంది.

Courtesy Eenadu

Leave a Reply