క్రిస్టియన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి

0
164

* పోలీసులకు బాధితులు ఫిర్యాదు
గ్రేటర్‌ విశాఖ బ్యూరో:

విశాఖ నగర్‌లో క్రిస్టియన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు దాడికి తెగబడ్డాయి. ఒక ప్రార్థనా మందిరం సమీపంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీనిపై ప్రార్థన మందిర్‌ పాస్టర్‌ వేసుపోగు ఆధ్వర్యంలో బాధిత క్రిస్టియన్లు విశాఖ నగర డిసిపికి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం… విశాలాక్షి నగర్‌లోని ప్రార్థన మందిరంలో ఉదయం 11 గంటల సమయంలో కొంతమంది క్రిస్టియన్లు సువార్తను ప్రారంభించి అక్కడి నుంచి వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 15 మంది వచ్చారు. సువార్త చెప్పవద్దంటూ, ప్రచారానికి అనుమతి చూపాలంటూ తదితర విషయాలపై ప్రయివేటు పోలీసింగ్‌ చేస్తూ కర్రలతో బెదిరించారు. ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా దాడి చేశారు. క్రిస్టియన్లు ఇక్కడ ప్రచారం చేయొద్దంటూ, ఇది హిందువుల దేశమంటూ, క్రిస్టియన్లంతా భారతదేశం విడిచి ఇజ్రాయిల్‌ దేశం పోవాలంటూ భయబ్రాంతులకు గురిచేశారు. క్రిస్టియన్లను ముందుకు వెళ్లనీయకుండా అడ్డగించారు. ఈ నేపథ్యంలో అక్కడ వాగ్వివాదం నెలకొంది. కొందరు క్రిస్టియన్లు 100కి ఫోన్‌ చేసి పోలీసుల సహాయం అభ్యర్థించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని చెదరగొట్టారు. అనంతరం క్రిస్టయన్లు తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు మరికొంతమందితో కలిసి వచ్చి క్రిస్టియన్లను జోడుగుళ్లపాలెం వద్ద మరోసారి అడ్డుకున్నారు. మారణాయుధాలతో బెదిరించారు. మతదూషణ చేశారు. క్రిస్టియన్‌ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అసభ్యకర పదజాలంతో దూషించారు. మొబైల్‌ ఫోన్లు లాక్కొని సువార్తకు ఆటంకం కలిగించారు. బాధిత క్రిస్టియన్లకు సిపిఎం నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, సుబ్బారావు, మైనార్టీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్‌డి జియూద్దిన్‌, కో-చైర్మన్‌ ఎం.అనిల్‌పాల్‌, వైస్‌ చైర్మన్‌ ఫకురుద్దీన్‌ మద్దతు పలికారు. తమపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ నగర ఒకటో డిసిపి రంగారెడ్డికు క్రిస్టియన్లు ఫిర్యాదు చేశారు.

ప్రశాంత విశాఖలో మత ఘర్షణలకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర : సిపిఎం
ప్రశాంత విశాఖ నగరంలో మత ఘర్షణలు సృష్టించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు పన్నుతోందని సిపిఎం విశాఖ నగర కార్యదర్శి బి.గంగారావు విమర్శించారు. విశాలాక్షినగర్‌లో క్రైస్తవ కూటమిపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడిని ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలపై అమ్రత్తంగా ఉండాలని కోరారు.

Courtesy Prajashakthi

Leave a Reply