ప్రజల బస్సుకు 87 ఏళ్లు!

0
295
  • ఆర్టీసీని ప్రారంభించిన చివరి నిజాం
  • ప్రభుత్వ రంగంలోనే బస్సుల నిర్వహణ
  • బ్రిటిష్‌ ఇండియాలో ఒక్క నిజాం సంస్థానంలోనే ఆర్టీసీ ఏర్పాటు
  • మిగిలినవన్నీ స్వాతంత్య్రం తర్వాతే
  • ప్రత్యేక తెలంగాణలో ప్రైవేటు దిశగా ఆర్టీసీ

మన వాహనాల నంబరు ప్లేట్లపై ఒక్కో దానిపైనా ఒక్కో రకమైన ఆంగ్ల అక్షరాలు ఉంటాయి! కానీ, అన్ని ఆర్టీసీ బస్సుల నంబరు ప్లేట్లపైనాజడ్‌ అనే అక్షరమే ఉంటుంది గమనించారా!? జడ్‌ అంటే అర్థం ఏమిటో తెలుసా!? అదేంటో తెలియాలంటే ఆర్టీసీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలి!

ఇతర రాష్ట్రాల్లో స్వాతంత్ర్యానంతరం ఆర్టీసీలు ఉద్భవించాయి! కానీ, బ్రిటిష్‌ ఇండియాలో ఒక్క నిజాం సంస్థానంలో మాత్రమే ఆర్టీసీ ఉండేది! అది కూడా ప్రభుత్వ రంగంలో! చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1932లో తన సంస్థానంలో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. అప్పట్లో స్కాటిష్‌ ఆటోమొబైల్‌ కంపెనీ ఆల్బియన్‌ ఆటోమోటివ్‌ నుంచి 27 బస్సులను కొనుగోలు చేశారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రవాణా సేవలు అందించే ఉద్దేశంతో ‘నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌-ఎన్‌ఎ్‌సఆర్‌ఆర్‌టీడీ)ను ఏర్పాటుచేశారు. 27 బస్సులతో 166 మందితో ఈ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. అప్పట్లో నిజాం పాలన కింద ఉన్న నాందేడ్‌, హైదరాబాద్‌, వరంగల్‌, పర్భనీ, గుల్బర్గా, రాయచూరు, వనపర్తిల్లో డిపోలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు బస్సులను నడిపించారు. కార్లు, ద్విచక్ర వాహనాలు చాలా తక్కువగా ఉన్న ఆ కాలంలోనే ఎర్ర బస్సు ప్రజలకు విస్తృత సేవలు అందించింది. 22 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న మొట్టమొదటి బస్సు హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌, బీదర్‌, గుల్బర్గాలకు రాకపోకలు సాగించింది.

లాభాపేక్ష కంటే ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చి నిజాం వీటిని కొనసాగించారు. చాలా తక్కువ రేట్లకే రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేవి కూడా. ఆ వాహనాల నంబరు ప్లేట్లపై రిజిస్ట్రేషన్‌ నంబరుతోపాటు నిజాం తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం ‘జడ్‌’ అనే అక్షరాన్ని కూడా ఉంచారు. ఆపరేషన్‌ పోలో తర్వాత నిజాం తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలో పెట్టిన షరతుల్లో ఈ ‘జడ్‌’ అనే అక్షరాన్ని ఆర్టీసీ బస్సులపై కొనసాగించాలనేది కూడా ఒకటని చరిత్రకారులు చెబుతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోందని వివరిస్తారు. ఇంకా చెప్పాలంటే, 1932లో నిజాం కొనుగోలు చేసిన 27 ఆల్బియన్‌ బస్సుల్లో రెండు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. వాటిలో ఒకటి బస్‌ భవన్‌ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచగా.. మరొకటి విజయవాడ సెంట్రల్‌ బస్టాండ్‌ బయట ఉంది! ఆ తర్వాత హైదరాబాద్‌ సంస్థానంలోనూ ఆర్టీసీ ప్రభుత్వ రంగంలోనే ఉండేది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు మాత్రమే దీనికి తెరపడింది. ఇందుకు కారణం లేకపోలేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు ప్రైవేటు రంగంలో ఉండేవి.

హైదరాబాద్‌ సంస్థానంలో ప్రభుత్వ రంగంలో ఉండేవి. దాంతో, రెండు రాష్ట్రాలనూ కలిపినప్పుడు ఆర్టీసీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌-1950 ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1958 జనవరి 11న ఏపీఎ్‌సఆర్టీసీ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్‌ 3 నుంచి టీఎ్‌సఆర్టీసీగా రూపుదాల్చింది. ప్రస్తుతం దీనికింద 2 వర్క్‌షాపులు, 2 శిక్షణ కాలేజీలు, ఒక బస్‌బాడీ యూనిట్‌, 97 బస్‌ డిపోలు, 364 బస్టాండ్లు ఉన్నాయి. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కలిపి మొత్తం 49,733 మంది పని చేస్తున్నారు. వీరిలో అధికారులు 270 మంది మాత్రమే. మిగతా వారంతా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందే. బ్రిటిష్‌ ఇండియాలోనే ప్రారంభమై.. హైదరాబాద్‌ సంస్థానం వరకూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిన ఆర్టీసీ.. ప్రత్యేక తెలంగాణలో ప్రైవేటు దిశగా అడుగులు వేస్తోంది!!

25వ రోజుకు సమ్మె..! ఆర్టీసీ చరిత్రలో ఇదే సుదీర్ఘం…ఆర్టీసీ సమ్మె మంగళవారం నాటికి 25వ రోజుకు చేరింది. ఆర్టీసీ చరిత్రలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే సుదీర్ఘ సమ్మె. 2001లో కార్మికులు వేతనాలు పెంచాలంటూ 24 రోజులు సమ్మె చేశారు. కానీ, ప్రస్తుత సమ్మె 25 రోజులకు చేరింది. దీంతో తెలంగాణ ఆర్టీసీలో ఇది సుదీర్ఘ సమ్మెగా నిలిచిపోనుంది. 2011లో సకల జనుల సమ్మె చేపట్టగా.. 44 రోజులు కొనసాగింది. అందులో ఆర్టీసీ కార్మికులు 27 రోజులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో కార్మికులు వేతనాల కోసం 8 రోజులు సమ్మె చేశారు. అప్పట్లో కేసీఆర్‌ వెంటనే స్పందించి కార్మికులకు అనుకూలంగా ప్రకటన చేశారు. 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. ఈ ఫిట్‌మెంట్‌ గడువు ముగిసిపోయింది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం కొత్త ఫిట్‌మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత సమ్మెలో ఈ డిమాండ్‌ కూడా ఒకటిగా ఉంది.

Courtesy Andhrajyothi..

Leave a Reply