అవినీతి.. అనకొండలు

0
309

– డిపో మేనేజర్ల చేతివాటం.. ఆడిటర్ల ఆశ్చర్యం తవ్వేకొద్దీ వెలుగులోకి…
– అంతర్గత ఆడిట్‌లో విస్తుగొలిపే వాస్తవాలు
– ‘సమ్మె’ను దుర్వినియోగం చేసిన అధికారులు
– అన్నం పెట్టిన సంస్థకే సున్నం పెట్టే చేష్టలు
– లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు దొంగ బిల్లులు

కండక్టర్‌ క్యాష్‌బ్యాగ్‌లో పది రూపాయలు ఎక్కువ ఉంటే, షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చి, క్రమశిక్షణ పేరుతో సస్పెండ్‌ చేస్తారు. ఇలాంటి కఠిన చర్యలకు బలైన కార్మికులు ఆర్టీసీలో కోకొల్లలు. ఇప్పుడు అదే ఆర్టీసీలో అవినీతి అనకొండలు చేరాయి. ఆర్టీసీ పరిరక్షణ పేరుతో కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే…దాన్ని అవకాశంగా చేసుకొని, కొందరు అధికారులు భారీగా ఆర్టీసీ ఖజానాను కొల్లగొట్టేశారు. సమ్మె గొడవలో తమను ఎవరు పట్టించుకుంటార్లే.. అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా దొంగబిల్లులు పెట్టి అన్నం పెడుతున్న ఇంటికే కన్నం వేశారు. ఇటీవలే ప్రారంభమైన టీఎస్‌ఆర్టీసీ అంతర్గత ఆడిట్‌లో ఇలాంటి బాగోతాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఈ కుంభకోణాలన్నింటికీ కేంద్ర బిందువులు కొందరు అవినీతి అధికారులే కావడం గమనార్హం.

హైదరాబాద్‌బ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ప్రత్యామ్నాయ రవాణా పేరుతో ఇష్టం వచ్చినట్టు అద్దె బస్సుల్ని రోడ్లపైకి తెచ్చి, కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు శతధా ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు యాజమాన్యం నిర్ణయించిన సొమ్ములో సగం మినహాయించుకొని చెల్లింపులు చేశారు. తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రోజుకు రూ.వెయ్యి చొప్పున వేతనం ఇవ్వాల్సిండగా ఉండగా, దానిలో సగమే అందచేశారు. కానీ పూర్తిగా ముట్టచెప్పినట్టు రశీదులు పెట్టారు. మొత్తం 55 రోజులు పాటు ఈ తరహా దోపిడీ జరిగింది. బస్సుల్లో పోసే డీజిల్‌లోనూ ఇదే తరహా కుంభకోణాలు జరిగినట్టు అంతర్గత ఆడిట్‌లో వెల్లడి అవుతున్నది. ఆర్టీసీ బస్సులో డీజిల్‌ పోసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ దానిలో పేర్కొన్న నెంబర్లను పరిశీలిస్తే అవి ప్రయివేటు ట్రావెల్స్‌ కార్ల నెంబర్లుగా తేలడంతో ఆడిటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొన్ని డిపోల్లో బస్సుల విడిభాగాలు కొనుగోలు చేసినట్టు బిల్లులు పెట్టారు. ఈ బిల్లుల విశ్వనీయతపై కూడా ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో యూనియన్లు వద్దంటూ కార్మికులతో బలవంతంగా సంతకాలు చేయించిన అధికారులే ఈ తరహా బాగోతాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 97 ఆర్టీసీ డిపోలు ఉండగా, ప్రస్తుతానికి 15 డిపోల్లో అంతర్గత ఆడిట్‌ జరుగుతున్నది. దిల్‌సుఖ్‌నగర్‌-1 డిపోలో సమ్మె ప్రారంభమైన అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 23 వరకు మొత్తం 55 రోజులపాటు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు, డిపోలో పనిచేస్తున్న ప్రయివేటు కంప్యూటర్‌ ఆపరేటర్లు, స్వీపర్లకు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనాలు పెట్టినట్టు బిల్లులు పెట్టారు. రోజుకు రూ.2,600 చొప్పున 53 రోజులపాటు ఈ తరహాలో దోపిడీ చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ ఆడిట్‌ అధికారుల్ని కలిసి, విధులు నిర్వహించిన సమయంలో ఆర్టీసీ అధికారులు తమకు కనీసం టీ నీళ్లు కూడా పోయలేదనీ, తమపేర్లపై తప్పుడు బిల్లులు ఎలా పెడతారంటూ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఆర్టీసీ సమ్మె నవంబర్‌ 25న ముగిసింది. కానీ అధికారులు పెట్టిన బిల్లులపై డిసెంబర్‌ 25వ తేదీ వేసిఉండటం గమనార్హం. ఇది అనుమానాలకు తావిస్తున్నది. ఖమ్మం డిపోలోనూ ఇదే తరహా తప్పుడు బిల్లులు బయటపడినట్టు తెలిసింది. మరో డిపోలో ఆర్టీసీ కార్మికులకు నెలవారీగా ఇచ్చే ఇన్సెంటివ్‌ల సొమ్మును చెల్లించినట్టు చూపి, ఆ డబ్బును నొక్కేశారు. (2017 ఫిబ్రవరి నాటి ఇన్సెంటివ్‌లు) ఆర్టీసీలో యూనియన్లు వద్దంటూ కార్మికులతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న క్రమంలో…సదరు డిపోలోని కార్మికులతో ఈ కాగితాలపై కూడా సంతకాలు చేయించుకొని, చెల్లింపులు చేసినట్టు బిల్లులు పెట్టారు. ఆడిట్‌ అధికారులు క్రాస్‌ చెక్‌ చేయడంతో ఈ బండారం బయటపడింది. కొన్ని చోట్ల ఆడిట్‌ అధికారుల్ని లోబర్చుకొనేందుకు అవినీతి అధికారులు వారికి ‘ఆఫర్లు’ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆర్టీసీ అధికారుల సంఘం ప్రతినిధులుగా చెలామణి అవుతూ, డిపో మేనేజర్లుగా పనిచేస్తున్నవారి ‘చేతివాటం’ మరింత ఎక్కువగా ఉన్నదని ఆడిట్‌ అధికారులు సన్నిహితుల వద్ద చెప్తున్నట్టు తెలిసింది. సమ్మె సమయంలో డిపోల్లో వచ్చిన ఆదాయానికి, చేసిన ఖర్చులకు మధ్య పొంతనే లేదని కార్మిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 97 డిపోల్లో పారదర్శకంగా ఆడిట్‌ జరిగితే టీఎస్‌ఆర్టీసీలో కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడతాయని కార్మికులు చెప్తున్నారు.

Courtesy Nava telangana

Leave a Reply