- ఆర్టీసీ సమ్మె యథాతథం
- 21 డిమాండ్లపైనే చర్చలు.. స్పష్టంచేసిన అధికారులు
- 26 డిమాండ్లపై చర్చించాలి.. ఆర్టీసీ జేఏసీ డిమాండ్
- మా ఫోన్లు లాక్కున్నారు.. చర్చల్లో ఇంత నిర్బంధమా?
- మళ్లీ పిలవలేదు: అశ్వత్థామ.. వాళ్లే రాలేదు: సునీల్
హైదరాబాద్: ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. అధికారులు, జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. 22 రోజుల సమ్మె అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన చర్చల్లో ఎంతో కొంత ఫలితం ఉంటుందని కార్మికులు ఆశించారు. కానీ, అధికారులు తుస్సుమనిపించారు. కార్మిక నేతలు కొంత రాజీ ధోరణితోనే వ్యవహరించినా అధికారులు పట్టు వీడకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. కోర్టు సూచించిన 21 డిమాండ్లపైనే చర్చిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. జేఏసీ ఇచ్చిన 26 డిమాండ్లపై లేదా తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ఇచ్చిన 45 డిమాండ్లపై చర్చించాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. ఇక్కడే ప్రతిష్టంభన ఏర్పడింది. అసలు చర్చలు ప్రారంభమే కాలేదు. ఏ డిమాండ్లపై చర్చించాలన్న అంశాన్ని దాటి ముందుకు సాగలేదు. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో జేఏసీతో మాట్లాడతామని, మళ్లీ పిలిస్తే చర్చలకు వస్తామని చెప్పి బయటకు వచ్చేశారు. అధికారులు వారిని మళ్లీ లోపలికి పిలవలేదు.
మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన కార్మిక నేతలు తిరిగి రాలేదని అధికారులు ఆరోపించారు. ఏదో కోర్టుకు నివేదిక ఇవ్వాలి కాబట్టి… తూతూమంత్రంగా చర్చలకు పిలిచారని కార్మిక నేతలు ధ్వజమెత్తారు. చర్చలకు పిలిచి అవమానించారని, నిర్బంధ పరిస్థితుల్లో చర్చలు జరిపారని విమర్శించారు. ఫోన్లు లాక్కుని, స్విచ్చాఫ్ చేసి చర్చలు జరపబోయారని ఆరోపించారు. ప్రభుత్వానికి చర్చలు జరిపే ఉద్దేశం లేదని, ఏదో కోర్టు చెప్పింది కదా అన్న కారణంతోనే చర్చలకు పిలిచారని ఆరోపించారు. 21 డిమాండ్లను దాటి చర్చించబోమంటూ అధికారులు కరాఖండిగా చెప్పారని మండిపడ్డారు. కోర్టు కూడా 21 డిమాండ్లకే పరిమితం కావాలంటూ ఎక్కడా చెప్పలేదని, మొత్తం 45 డిమాండ్లలో 21 డిమాండ్లు ఆర్థిక పరమైనవి కావని, వీటిని కూడా పరిష్కరించకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు. సమ్మె యథాతథంగా కొనసాగుందని నేతలు ప్రకటించారు. సమ్మెపై పిటిషన్లకు సంబంధించి సోమవారం మరోసారి వాదనలు వింటామని, అప్పటిలోగా తమకు చర్చలు జరిపినట్లు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దాంతో ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఆర్థిక సలహాదారుతో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికపై శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
శనివారం కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మను ఆదేశించారు. ఆ మేరకు శనివారం చర్చలకు రావాల్సిందిగా జేఏసీ నేతలకు ఆహ్వానం పంపారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు ఉంటాయని, జేఏసీ కన్వీనర్, ముగ్గురు కో-కన్వీనర్లు మాత్రమే చర్చలకు రావాలని సునీల్ శర్మ సమాచారం పంపించారు. ఆ మేరకు కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్లు కె.రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావు ఎర్రమంజిల్‌కు వచ్చారు. మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. ఆర్టీసీలో జేఏసీ మాత్రమే కాకుండా జేఏసీ-1 కూడా సమ్మె చేస్తోందని, తమ జేఏసీ-1 నేతలను కూడా చర్చలకు పిలవాలని కన్వీనర్, టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు.
చర్చల వీడియో రికార్డింగ్..
చర్చల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తును, ఏర్పాటు చేయించిన అధికారులు… చర్చల మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. నేతలు చర్చల సమావేశ హాలులోకి ప్రవేశించిన తొలి క్షణం నుంచి మొత్తం రికార్డ్ చేశారు.
ఇవి నిర్బంధ చర్చలు: అశ్వత్థామరెడ్డి
యూనియన్ల జేఏసీతో అధికారులు నిర్వహించిన చర్చలు అసలు చర్చలే కావని జేఏసీ కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఏదో కోర్టు చెప్పింది కదా అని తూతూ మంత్రంగా చర్చలకు పిలిచారని విమర్శించారు. ఇంతటి నిర్బంధ చర్చలు ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. చర్చలకు ముందుగానే భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని ఆరోపించారు. జేఏసీలో మొత్తం 16 మంది నేతలుంటే… నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారని అన్నారు. తమ ఫోన్లు లాక్కోవడానికే వారికి అరగంట పట్టిందని ఎద్దేవా చేశారు. చిన్న చిన్న డిమాండ్లను కూడా పరిష్కరించలేకపోతున్నారని ఆరోపించారు. అసలు చర్చలను ప్రారంభించనే లేదన్నారు. తమ డిమాండ్లలో కొన్నింటిని మినహాయించాలంటూ కోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామంటే… తాము తమ నేతలతో చర్చిస్తామంటూ అధికారులకు చెప్పామన్నారు. మళ్లీ చర్చలకు పిలిస్తే వస్తామని కూడా చెప్పామన్నారు. అధికారులు చర్చలకు పిలవలేదన్నారు. కావాలంటే వీడియో రికార్డులను పరిశీలించవచ్చని చెప్పారు. చర్చలు సఫలం కానందున… సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. కె.రాజిరెడ్డి, వీఎస్ రావు మాట్లాడుతూ, శత్రు దేశాలతో కూడా ఇలాంటి చర్చలు ఎప్పుడూ జరగలేదన్నారు.
గంటన్నర పాటు వాదనలే
అధికారుల ఆహ్వానం మేరకు జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులు ఈఎన్‌సీ కార్యాలయంలోకి వెళ్లారు. లోపలికి ప్రవేశించగానే నేతల వద్ద నుంచి ఫోన్లు లాక్కుని, స్విచ్చాఫ్ చేశారు. చర్చల సారాంశం బయటకు పొక్కకుండా ఉండడానికి జాగ్రత్త వహించారు. సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా మాత్రమే చర్చలు జరపడానికి ఉపక్రమించారు. ఈడీలు కూడా చర్చల్లో పాల్గొంటారని చెప్పినా వారిని లోనికి పిలవలేదు. యూనియన్ల జేఏసీ ఇచ్చిన 26 డిమాండ్లపై లేదంటే ప్రతివాది-7గా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ఇచ్చిన 45 డిమాండ్లపై నైనా చర్చించాలని పట్టుబట్టారు. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని సునీల్ శర్మ, సందీప్‌కుమార్ స్పష్టం చేశారు. ముందుగా 26 లేదా 45 డిమాండ్లను పరిశీలించాలని, వాటిలో ఏవి సాధ్యమైతాయో వాటి గురించి చెప్పాలని కార్మిక నేతలు సూచించారు. అధికారులు ఒప్పుకోలేదు. గంట సమయం వాదనలతోనే గడిచిపోయింది. వేటిపై చర్చించాలన్న దగ్గరే చర్చలు ఆగిపోయాయి. ఒకవేళ 21 డిమాండ్లపైనే చర్చిస్తామంటే… ఇతర జేఏసీ నేతలతో చర్చిస్తామని నేతలు స్పష్టం చేశారు. మళ్లీ పిలిస్తే చర్చలకు వస్తామని చెప్పి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చేశారు.
మళ్లీ వస్తామని రాలేదు: సునీల్ శర్మ
కోర్టు ఆదేశాల మేరకు కార్మిక జేఏసీ నేతలతో చర్చలు జరిపామని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ చెప్పారు. చర్చలకు పిలిచాం. వారిచ్చిన డిమాండ్లపైనే చర్చించాలంటూ పట్టుబట్టారన్నారు. ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై చర్చించడం సాధ్యం కాదని చెప్పామన్నారు. రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ 26 డిమాండ్లపై చర్చ జరపాలంటూ కార్మిక నేతలు పట్టుబట్టారని అన్నారు. విలీనంపైనా చర్చించాలన్నారని తెలిపారు. అది సాధ్యం కాదని చెప్పామన్నారు. సభ్యులతో చర్చించి వస్తామని చెప్పి వెళ్లారని, అయినా… తిరిగి రాలేదని తెలిపారు.
Courtesy Andhra Jyothy