న్యాయవ్యవస్థతో పాలకుల చెలగాటం!

0
98
ఎ. కృష్ణారావు

ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టుకూ ప్రభుత్వానికీ మధ్య ఘర్షణాయుతమైన వాతావరణం పెరుగుతున్నట్లు కనపడుతోంది. ప్రధానంగా ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం న్యాయవ్యవస్థపై తన విమర్శనాబాణాలు ఉద్దేశపూర్వకంగా ఎక్కుపెట్టడం యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లనిపించడం లేదు. ఎప్పుడో 2015లో సుప్రీంకోర్టు న్యాయ నియామకాల కమిషన్ను రద్దు చేస్తే ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్తో సహా అధికారంలో ఉన్న పెద్దలు ఆ విషయం పదే పదే మాట్లాడుతుండడం, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’లో కూడా కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఊహించాల్సిందే. ఈ కమిషన్ గురించి మాత్రమే కాదు, సుప్రీంకోర్టు సెలవుల గురించి, పెండింగ్ కేసుల గురించి విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు కొందరికి బెయిల్ ఇవ్వకూడదని, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించకూడదని హితబోధలు చేస్తున్నారు. అంటే కేవలం న్యాయమూర్తుల నియామకం గురించి మాత్రమే కాదు, సుప్రీంకోర్టు పనితీరు పట్ల కూడా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఎన్ని ప్రశ్నించాల్సిన విషయాలున్నప్పటికీ ఈ దేశంలో చెప్పుకోదగిన విధంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న వ్యవస్థ ముమ్మాటికీ న్యాయవ్యవస్థే. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని, ప్రభుత్వ జోక్యం ఉండరాదని రాజ్యాంగ సభలో బీఆర్ అంబేడ్కర్ కూడా స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు న్యాయవ్యవస్థపై తరచూ దాడులు చేస్తున్నారు. ఏమిటి వారి లక్ష్యం? న్యాయవ్యవస్థను సైతం తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్నదే పాలకుల ఉద్దేశమని భావించేవారు చాలా మంది ఉన్నారు. న్యాయమూర్తులను నియమించేందుకు ప్రస్తుత కొలీజియం పద్ధతి కొనసాగించాలా లేదా అన్నది చర్చనీయాంశమే కానీ న్యాయవ్యవస్థలో ఉన్న సకల లోపాలకు కొలీజియం పద్ధతి మాత్రం కారణం కాదు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉండడానికి కారణం కొలీజియం వ్యవస్థ అని న్యాయశాఖ మంత్రి ఆరోపించారు. విచిత్రమేమంటే గత ఆగస్టు నాటికి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 71,411 కాగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 59,55,907 ఉంటుందని ఇదే న్యాయశాఖ మంత్రి పార్లమెంట్కు ఇచ్చిన సమాధానంలోనే చెప్పారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే అన్నిటికన్నా ఎక్కువగా 4.24 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో ఉత్తరప్రదేశ్లోనే కోటికి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొలీజియం పద్ధతి ద్వారా న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనే జరుగుతుంది కాని క్రింది కోర్టుల్లో కాదు కదా? క్రింది కోర్టుల్లో పేరుకుపోయిన కేసులకు సుప్రీం, హైకోర్టులు ఎలా బాధ్యత వహిస్తాయి? నిజానికి మౌలిక స్థాయిలో న్యాయవ్యవస్థ సరిగా పనిచేయకపోవడానికి, కేసులు పెండింగ్లో పడడానికి ప్రభుత్వాలే కారణం. భారతదేశంలో 70 శాతం ఖైదీల కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. వారిలో అత్యధికులు అభాగ్యులు, అణగారిన వర్గాల వారే. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే కోర్టులకు నిధులు లభించడం, పేలవమైన మౌలిక సదుపాయాలు, తమకు అనుకూలంకాని న్యాయమూర్తుల పేర్లను ఆమోదించకపోవడం వల్లే కేసులు పేరుకుపోతున్నాయని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ పలుసార్లు వాపోయారు. కేసులకు తగ్గట్లు న్యాయమూర్తులను, సిబ్బందిని నియమించడం, కంప్యూటర్ సౌకర్యాలు, శౌచాలయాలు మొదలైన మౌలిక సదుపాయాలతో కొత్త కోర్టులను నిర్మించడం జరగకపోవడానికి బాధ్యత ప్రభుత్వానిది కాదా? కేసులు సుదీర్ఘకాలం కొనసాగడానికి, ఇష్టారాజ్యంగా సాగడానికి సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, పోలీసు వంటి దర్యాప్తు ఏజెన్సీల బాధ్యత ఏమీ లేదా? ఎవరి కనుసన్నలలో, ఎవరికి అనుకూలంగా ఈ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి? మీకు సుప్రీంకోర్టుపై కోపం ఉన్నది కదా అని వ్యవస్థీకృత లోపాలకు బాధ్యతను ఉన్నత న్యాయస్థానంపై నెట్టివేయడం సరైనదా?

న్యాయనియామక కమిషన్ను పార్లమెంట్ ఉభయ సభలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించినా సుప్రీంకోర్టు కొట్టి పారేసిందని తరుచూ విమర్శించడంలో అర్థం లేదు. నిజానికి వీపీ సింగ్ హయాంలోనే జాతీయ న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు సవరణ ప్రవేశపెట్టారు కాని 1991లో లోక్సభ రద్దు కావడంతో ఈ సవరణ ఆమోదం పొందలేకపోయింది. పీవీ హయాంలో మళ్లీ ఈ విషయంపై మల్లగుల్లాలు జరిగాయి. అయితే ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించకుండా న్యాయమూర్తుల నియామకం, బదిలీ విషయంలో నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని 1993లో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని 9మంది సభ్యుల రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పు తర్వాతే సిజె ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే కొలీజియం వ్యవస్థ అమలులోకి వచ్చింది. 1998లో వాజపేయి ప్రభుత్వం ఈ తీర్పును వ్యతిరేకించడంతో రాజ్యాంగబెంచ్ ఈ పద్ధతిలో కొద్ది మార్పులు చేసింది. ఆ తర్వాతి నుంచీ నలుగురు న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2014లో సుప్రీంకోర్టు ఈ కమిషన్ను కొట్టి వేసిన తర్వాత ప్రభుత్వమే మౌనం పాటించింది, కనీసం సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా మరోసారి చట్టం చేసి కమిషన్ను నియమించేందుకు కూడా ప్రయత్నించలేదు.

క్రింది కోర్టుల్లో పలువురు నిష్ణాతులైన న్యాయమూర్తులు మగ్గిపోగా అనర్హులు పలువురు పై మెట్టేక్కేందుకు కొలీజియం వ్యవస్థ అవకాశం కల్పించిందని కిరణ్ రిజిజూనే కాదు, ఆయనకు ముందు న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ కూడా విమర్శించారు. అవినీతిపరులైనవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాగలిగారని జస్టిస్ మార్కండేయ కట్జూ నాడు వ్యాఖ్యానించారు, అంతమాత్రాన మోదీ తలపెట్టిన న్యాయనియామకాల కమిషన్ పరిపూర్ణమైనదని చెప్పడానికి వీల్లేదు. న్యాయనియామక కమిషన్లో లోపాలనే సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని, ఆరుగురు సభ్యులను నియమించి ప్రభుత్వం మాటే చెల్లుబాటు అయ్యేలా అనేక నిబంధనలను చేర్చిందని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను తగ్గించేలా ఉన్నందుకే ఈ కమిషన్ను రద్దు చేశారని ఉపేంద్ర బక్షి లాంటి న్యాయనిపుణులు కూడా చెప్పారు. ప్రముఖ వ్యక్తులు అన్న పేరుతో న్యాయ వ్యవస్థతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తులను నియమించి వారికి వీటో చేసే అధికారం ఇవ్వడం సరైంది కాదని అనేకమంది న్యాయనిపుణులు అన్నారు. కొలీజియంలో ఉన్న మంచి లక్షణాలు ఈ కమిషన్కు లేవని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పాత్రే లేదని అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్ స్పష్టం చేశారు. నిజానికి వాజపేయి హయాంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో నియమించిన రాజ్యాంగ సమీక్షా కమిషన్ కూడా న్యాయమూర్తుల నియామకానికి జాతీయ కమిషన్ అవసరమని సూచించింది. అయితే ఈ కమిషన్లో అయిదుగురు సభ్యులుండాలని వారిలో మెజారిటీ సభ్యులుగా ముగ్గురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులను నియమించాలని జస్టిస్ వెంకటాచలయ్య సూచించారు. దీని వల్ల రాజ్యాంగ మౌలిక స్వభావం దెబ్బతినదని ఆయన చెప్పారు. అంటే ఆయన కూడా న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థదే ఆధిపత్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య సూచనను పాటించి, లోపాలు లేని నిష్పాక్షికమైన కమిషన్ను నియమించి ఉంటే సుప్రీంకోర్టు ఆ కమిషన్ను కొట్టేసేదే కాదు.

ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులతో పార్లమెంట్ ఏర్పడుతుంది కనుక న్యాయనియామకాల విషయంలో పార్లమెంట్ మాటే చెల్లుబాటు కావాలని ప్రభుత్వాధినేతలు అనడంలో పసలేదు. పార్లమెంట్కు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎన్నికవుతున్నారు, సరైనవారు ఎన్నికవుతున్నారా, వారిలో పెద్ద సంఖ్యలో నేరచరితులు లేరా అన్నది చర్చనీయాంశం అయితే పార్లమెంట్, చట్టసభల్లో మెజారిటీ ఉన్నంత మాత్రాన అవి చేసే చట్టాలన్నీ సరైనవి అని చెప్పడానికి కూడా వీలు లేదు. రాజ్యాంగంలో 21వ అధికరణ చెల్లదని, జీవించే హక్కు లేదని మెజారిటీ ద్వారా చట్టసభలు నిర్ణయిస్తే సరిపోతుందా? 1967లోనే గోలక్నాథ్ కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు ప్రాథమిక హక్కులను రద్దు చేసే విషయంలో పార్లమెంట్కు అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఈ కేసును నీరు కార్చేందుకు ప్రయత్నిస్తే మళ్లీ సుప్రీం అడ్డుపడింది, రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని మార్చేందుకు వీలు లేదని కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 356 అధికరణను ఎడా పెడా ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం చెల్లదని 1994లో ఎస్ఆర్ బొమ్మయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు చట్టాలు, విద్యుత్ సంస్కరణలు, బీమా వ్యాపారం, ట్రిబ్యునల్ సంస్కరణలకు సంబంధించి ప్రవేశపెట్టిన అనేక బిల్లులపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం మరిచిపోరాదు. పర్యావరణం, హక్కులకు సంబంధించిన కేసులను మోదీ గతంలో ఫైవ్ స్టార్ కేసులుగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు వాటిని విచారణకు స్వీకరించరాదని హితవు చెప్పారు. ఇప్పుడు బెయిల్ పిటీషన్లను, ప్రజాహిత వ్యాజ్యాలను పరిశీలించకూడదని ఆయన మంత్రులు అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగాన్ని ఉపేక్షిస్తూ తీసుకున్న అనేక నిర్ణయాల మూలంగానే భారతీయ జనతా పార్టీకి నైతిక బలం చేకూరింది. అదే బిజెపి ఇప్పుడు తాను తీసుకోదలిచిన రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు సుప్రీం అడ్డురాకూడదని భావిస్తోందా? అన్ని వ్యవస్థలూ తమ అదుపులో ఉండాలనుకోవడం ప్రజాస్వామ్యమా?

Leave a Reply