మీ రోజువారీ ఖర్చులు ఇంకా పెరుగుతాయ్‌

0
93
  • డాలర్‌ విలువ రూ.80ని మించిన ప్రభావం
  • సెల్‌, టీవీలే కాదు.. రెడీమేడ్‌ దుస్తులూ భారమే
  • రూపాయి క్షీణత ఆపేందుకు రూ.8 లక్షల కోట్లు వెచ్చించడానికి ఆర్‌బీఐ సిద్ధం

హైదరాబాద్‌ : డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకూ పతనమై, బుధవారం 80.05 స్థాయికి చేరింది. రూపాయి క్షీణత ఇంకా కొనసాగుతుందని, డాలర్‌ విలువ రూ.85కు చేరే అవకాశం ఉందని కొన్ని బ్రోకరేజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

రూపాయి విలువ క్షీణత వల్ల మన రోజువారీ జీవితంపై తెలియకుండానే భారం పడుతోంది. ఎలా అంటే దిగుమతి చేసుకునే వస్తువులతో పాటు పెట్రోలియం ఆధారితంగా రూపొందే ఉత్పత్తుల ధరలు.. విదేశీ విద్యాభ్యాస ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని పరిశీలిస్తే..

* విమాన టికెట్లు అయితే మండిపోతున్నాయి. ఇందుకు విమాన ఇంధన ధర ఒక కారణం. విదేశాలకు వెళ్లే మన విమానయాన సంస్థల టికెట్లు రూపాయల్లో ఉంటాయి. అదే బ్రిటిష్‌, అమెరికన్‌ ఎయిర్‌వేస్‌, ఎతిహాద్‌, కతార్‌ వంటివి డాలర్‌ నుంచి రూపాయల్లోకి మార్చి చూపుతుంటాయి. డాలర్‌ విలువ పెరిగే కొద్దీ ఇక్కడ నుంచి వెళ్లే వారికి భారమవుతోంది.

* విదేశీ పర్యటనల ఖర్చులు మరింత పెరిగిపోయాయి. మలేసియా ట్రిప్‌నకు గతంలో విమాన టికెట్లతో కలిపి రూ.35 వేలు అయ్యేది. ఇప్పుడు రూ.65 వేల వరకు అవుతోంది. థాయ్‌లాండ్‌ ప్రయాణం కూడా రూ.15 వేల నుంచి రూ.35 వేలకు చేరింది.

* ఎల్‌ఈడీ టీవీల్లో తెర సహా ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల వంటివి; ఏసీల్లో కంప్రెషర్‌-ప్లాస్టిక్‌ భాగాలు, రిఫ్రిజరేటర్‌లో విడిభాగాలు కూడా దిగుమతి అయ్యేవే. అందువల్ల వీటి ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

  • వస్త్రాల తయారీలో వినియోగించే డైస్‌, రంగులు, రసాయనాలు దిగుమతి అయ్యేవే. రెడీమేడ్‌ దుస్తుల్లో వాడే మెటల్‌ బటన్లు, లోగోలు, కొన్ని రకాల జిప్‌ల వంటివి విదేశాల నుంచే వస్తుంటాయి. అందువల్ల వీటి ధరలూ పైకెళ్లొచ్చు.

  • విదేశీ విద్య అంటే అత్యధికులు వెళ్లేది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లకే. డాలర్‌ రూ.80, పౌండ్‌ రూ.96కు చేరడంతో ఫీజులు భారమవుతున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లేవారికి నెలవారీగా ఉపకార వేతనం లేదా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ద్వారా ఆర్జన ఉంటే సరే. లేకపోతే విద్యార్థికి అక్కడ నెలవారీ ఖర్చులు సగటున 700-1,000 డాలర్లు (రూ.56,000-80,000) అవుతాయి. జనవరిలో డాలర్‌ రూ.75. అప్పటితో పోల్చుకుంటే, నెలవారీ భారం రూ.3,500-5,000 పెరిగింది.

సెల్‌ఫోన్‌తయారీలో వినియోగించే విడిభాగాల్లో 80 శాతం దిగుమతి అయ్యేవే. వీటికి డాలర్లలో చెల్లించాలి కనుక, వీటి ధరలు పెరగొచ్చు.

రూపాయి విలువ కాపాడేందుకు..
రూపాయి పతనాన్ని ఆపేందుకు, అవసరమైతే తన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వల్లో ఆరోవంతు విక్రయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చూస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు వార్తాసంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ప్రస్తుత నిల్వల్లో ఆరో వంతు అంటే దాదాపు 100 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8 లక్షల కోట్ల)కు సమానం. ఈ ఏడాదిలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 7 శాతం నష్టపోయింది. 2021 సెప్టెంబరులో విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు జీవనకాల గరిష్ఠమైన 642.45 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఇప్పటికే 60 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ.. 580 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలతో ప్రపంచంలో అయిదో స్థానంలో భారత్‌ ఉంది. రూపాయిని ఒక స్థాయిలోనే ఉంచాలని ఆర్‌బీఐ భావించడం లేదని, అయితే భారీ పతనాన్ని మాత్రం ఆపుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply