వలసల నియంత్రణేది?

0
217

– నత్తనడకన రూర్బన్‌ మిషన్‌
– ఎంపికైన నాలుగు క్లస్టర్లలో అభివృద్ధి అంతంతే
– టెండర్లు ముగిసినా..సాగని పనులు
– ఎన్నికల కోడ్‌తోనే అంటూ దాటవేస్తున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వలసల నియంత్రణ కోసం అంటూ తీసుకొచ్చిన రూర్బన్‌ మిషన్‌ పథకం నత్తనడకన సాగుతున్నది. మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి కల్పనకు వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టకుండా తాత్సారం చేస్తున్నది. తొలి విడతలో ఎంపికైన నాలుగు క్లస్టర్లల్లో మార్చి 2020 నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉండగా…ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. ఐదు నెలల్లో పనులు చేపట్టడం అసాధ్యమనే చర్చ నడుస్తున్నది. ఈ సంగతిని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు ప్రజల వలసలను నియంత్రించేందుకు, గ్రామాల్లో పట్టణ స్థాయి వసతులను కల్పించేందుకు కేంద్రప్రభుత్వం శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌(ఎన్‌ఆర్‌యూఎం) పథకాన్ని ప్రవేశపెట్టింది. రూర్బన్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో 16 క్లస్టర్లు ఎంపికయ్యాయి. తొలి విడతలో వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్‌(ఎస్‌), కామారెడ్డి జిల్లా జుక్కల్‌, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం ర్యాకల్‌, కొమురంభీం జిల్లా అసిఫాబాద్‌ మండలం చిర్రకుంట ఉన్నాయి. రెండో విడతలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెన్నచర్ల, భూపాలపల్లి మండలం నాగారం క్లస్టర్లు, మూడో విడత కింద కరీంనగర్‌ జిల్లా బిజిగిరీ షరీఫ్‌, సిద్ధిపేట జిల్లా జాలిగామ, మహబూబ్‌నగర్‌ జిల్లా నాంచెర్ల, మెదక్‌ జిల్లా పాపన్నపేట, రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి, నిజామాబాద్‌ జిల్లా యేడ్పల్లె, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌, నల్లగొండ జిల్లా కొండభీమనపల్లి, నిర్మల్‌ జిల్లా కుంటాల క్లస్టర్లున్నాయి. ఎంపిక చేసిన 16 క్లస్టర్ల పరిధిలో గోడౌన్లు, ధాన్యం ఆరబోసే ప్లాట్‌ఫాం, ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం, లైబ్రరీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, అవసరమైన చోట హైలెవల్‌ వంతెనలు, పాఠశాలలకు ప్రహరీగోడలు, అదనపు తరగతి గదులు, బస్‌షెల్టర్లు, సీసీ రోడ్లు, డ్రయినేజీ, అంగన్‌వాడీ సెంటర్లకు భవనాలు, వీధుల్లో ఎల్‌ఈడీ లైట్లు, చెక్‌ డ్యామ్‌లు, చెత్త తరలించే ఆటోలు, తాగునీరు, 30 పడకల ఆస్పత్రి సౌకర్యం కల్పించాలి. డిజిటల్‌ పంచాయతీ సిటిజన్‌ సర్వీసులపై ప్రజలకు అవగాహన పెంపొందించాలి. స్థానిక ప్రజల ఉపాధి కల్పన కోసం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పాలి. మూడేండ్ల నుంచి విడతల వారీగా కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా ఇక్కడ పనులు జరుగుతున్నది అంతంతే. ఈ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1778.11 కోట్లను కేటాయించింది. ఈ నిధుల్లో కన్వర్జెన్సీ ఫండ్స్‌ రూ.1,373.11 కోట్లు ఉండగా, సీజీఎఫ్‌ నిధులు రూ.405 కోట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా మంజూరైన సుమారు రూ.761 కోట్ల కన్వర్జెన్సీ నిధులను ఆయా క్లస్టర్లలోని మిషన్‌ భగీరథ, విద్యుద్ధీకరణ, సీసీ రోడ్లు తదితర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, ప్రజల జీవనోపాధి కల్పనకు మంజూరైన రూ.405 కోట్ల క్రిటికల్‌ గ్యాప్‌ ఫండ్‌(సీజీఎఫ్‌)ను పక్కనబెట్టేసింది. తొలివిడతలో ఎంపికైన నాలుగు క్లస్టర్లలో 2020 మార్చి 31 వరకు గుర్తించిన పనులన్నీ పూర్తిచేయాలి. పథకంలో పేర్కొన్న పనులకు నిధులను వాడుకోలేదన్న విమర్శ కూడా ఉన్నది. రెండున్నరేండ్లలో ఇప్పటి వరకు కేవలం టెండర్లు మాత్రమే పూర్తయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఐదు నెలల్లో పనులు పూర్తి చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు మాత్రం ఏడాది కాలంగా వరుసగా వస్తున్న ఎన్నికల కోడ్‌తోనే టెండర్లలో ఆలస్యం జరిగిందని, త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. రెండో విడత, మూడో విడత ఎంపికైన క్లస్టర్లలోనూ ఇదే పరిస్థితి. మిగతా గ్రామాలతో పోల్చిచూస్తే తొలి విడతలో ఎంపికైన గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి ఏమీ జరగలేదన్న విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి.
పనులను వేగవంతం చేస్తాం : వీరారెడ్డి, జాయింట్‌ కమిషనర్‌, గ్రామీణాభివృద్ధి శాఖ
రూర్బన్‌ పథకంలో ఎంపికైన అన్ని క్లస్టర్లలో ఏడాది క్రితమే పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వరుసగా ఎన్నికల కోడ్‌ రావడంతో ఆలస్యం జరిగింది. ఈ మధ్యే అన్ని క్లస్టర్లలో దాదాపు టెండర్ల ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఫస్ట్‌ ఫేజ్‌లో ఎంపికైన నాలుగు క్లస్టర్లలో డెడ్‌లైన్‌లోగా పనులు కంప్లీట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

Courtesy Navatelangana…

Leave a Reply