- వంతెన పేల్చివేతకు రష్యా ప్రతీకారం.. బాంబుల వర్షం
- 11 మంది మృతి.. ఇంకొన్ని నగరాలపైనా విస్తృత దాడులు
- ఇరాన్ డ్రోన్ల వాడకం: జెలెన్స్కీ .. మొత్తం 84 క్షిపణి దాడులు
- చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సాయం: భారత్
- కీవ్‌పై బాంబుల వర్షం.. కెర్చ్ కూల్చివేతతో రష్యా ప్రతీకారం
కీవ్ : కెర్చ్ వంతెన పేల్చివేతపై రష్యా ఆగ్రహంతో ఊగిపోతోంది. వంతెన కూల్చివేతకు ప్రతీకారంగా సోమవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. క్షిపణి దాడులు చేసింది. కొన్ని గంటల పాటు కొనసాగిన రష్యా భీకర దాడులతో కీవ్ దద్దరిల్లింది. జూన్ 26 తర్వాత రష్యా సైన్యం కీవ్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. సోమవారం నాటి రష్యా దాడుల్లో ఒక్క కీవ్‌లోనే ఆరుగురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. మొత్తంగా సోమవారం 11మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. 64 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ పార్లమెంట్ సమీపంలో కూడా రష్యా క్షిపణి దాడులకు పాల్పడటం గమనార్హం. రష్యా దాడుల కారణంగా ల్వీవ్, పొల్టావా, సుమీ, టర్నోపిల్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నాలుగు నగరాలు పూర్తిగా అంధకారంలో చిక్కుకుపోయాయి. ఉక్రెయిన్‌లోని మిగతా ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కెర్చ్ బ్రిడ్జిని పేల్చివేసినందువల్లే ఉక్రెయిన్‌పై దాడులను విస్తృతం చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఇంధన వనరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ‘ఉక్రెయిన్ గనక ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఆపకపోతే రష్యా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’ అని హెచ్చరించారు. దాడుల అనంతరం పుతిన్ రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌తో భేటీ అయ్యారు.
ఉక్రెయిన్ను భూమ్మీద లేకుండా చేయాలనే..
రష్యా దాడులపై జెలెన్స్కీ మండిపడ్డారు. భూమిపై ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా చేయాలని రష్యా భావిస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం జరిపిన దాడుల్లో ఇరాన్ డ్రోన్లను ఉపయోగించిందని ఆరోపించారు. కనీసం 84 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
ఉద్రిక్తతలు ఎవరికీ మంచిది కాదు
ఉక్రెయిన్‌లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్‌కు సూచించింది. కెర్చ్ బ్రిడ్జి పేల్చివేత, సోమవారం రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగ్చి మాట్లాడుతూ.. ‘ఉద్రిక్తతలు, దాడులు ఎవరికీ మంచిది కాదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ సాయం చేస్తుంది’ అన్నారు. అత్యవసరమైతే తప్ప భారత ప్రజలెవరూ ఉక్రెయిన్‌కు రావద్దని ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు కూడా అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కోరింది.
ట్రక్కు బాంబు కాదు.. డ్రోన్ కావొచ్చు
కెర్చ్ వంతెన కూల్చివేత తమ పనే అని ఉక్రెయిన్ ప్రకటించకపోయినప్పటికీ.. ట్రక్కు బాంబును ఉపయోగించి ఉక్రెయినే వంతెనను పేల్చివేసిందని అందరూ భావించారు. పేలుడుకు సంబంధించిన వీడియోను చూస్తే కూడా అదే నిజమనిపిస్తుంది. వంతెన పేలిపోయిన సమయంలో అక్కడ ఓ ట్రక్కు ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. కానీ, ఆ ట్రక్కు పేలడం వల్లే బ్రిడ్జి కూలిపోయినట్లు ఆ వీడియోలో లేదు. పేలుడు జరిగిన రోజే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ తన ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే వంతెనపై నుంచి ట్రక్కు వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కింద రెండు పిల్లర్ల మధ్య అకస్మాత్తుగా అలలు వచ్చాయి. మరుక్షణమే భారీ పేలుడు సంభవించింది. దీన్ని బట్టి వంతెనను పేల్చివేయడానికి సముద్రపు డ్రోన్‌ను ఉపయోగించి ఉండవచ్చని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. సెప్టెంబరు 21న క్రిమియా బీచ్‌లోని సెవస్టపోల్ నౌకాదళ స్థావరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ మానవ రహిత పడవను రష్యా దళాలు కనుగొన్నాయి. రిమోట్ సా యంతో దాన్ని పేల్చివేయడానికి అనుకూలంగా ఉంది. ఇలాంటి పడవలను ఉక్రెయిన్‌కు అమెరికా అమ్మింది.