- వైర్‌సబారిన మిఖాయిల్ మిషుస్టిన్
- దేశంలో లక్ష దాటిన మొత్తం కేసులు
- అమెరికాలో మరో 1,824 మంది బలి
మాస్కో, వాషింగ్టన్, ఏప్రిల్ 30: కరోనా బారినపడిన దేశాల అగ్రనేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54) సైతం చేరిపోయారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్ తరచూ అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చివరిసారిగా ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆంక్షల సడలింపు హడావుడి స్థాయిలోనే అమెరికాలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంలో మరో 1,824 వేల మంది వైర్‌సకు బలయ్యారు. 26,809 కేసులు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో 2,700 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 2 వేల మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, కష్టాలు పోనున్నాయని.. ముందుంది మంచి కాలమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. ‘ఓపెనింగ్ అప్ అమెరికా ఎగైన్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం పాఠాలు నేర్పిందన్న ఆయన.. వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు అద్భుతంగా ఉండబోతోందని అన్నారు. కరోనాపై డబ్ల్యూహెచ్‌వో తప్పుదారి పట్టించిందంటూ నిందిస్తోన్న ట్రంప్.. ఆ సంస్థపై తమ చర్యలేమిటో త్వరలో వెల్లడిస్తామన్నారు. డబ్ల్యూహెచ్‌వో కచ్చితంగా చైనా తొత్తేనంటూ మండిపడ్డారు. రష్యాలో గురువారం అత్యధికంగా 7,099 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1,06,498కి చేరాయి. తాజాగా చనిపోయిన 101 మందితో కలిపి మృతుల సంఖ్య 1,073 అయింది.
కఠోరంగా శ్రమించి గెలిచాం: చైనా
వైర్‌సపై తాము కఠోరంగా పోరాడామని.. దాంతో నిర్ణాయక ఫలితం విజయం సాధించామని చైనా పేర్కొంది. ఇదొక వ్యూహాత్మక గెలుపని.. అధ్యక్షుడు జిన్ పింగ్ విశ్లేషించారు. వూహాన్ సహా హుబెయ్‌లో నిరోధ చర్యలు కొనసాగించాలని జిన్ పింగ్ సూచించారు.
యూర్‌పలో ముప్పు తగ్గలే: డబ్ల్యూహెచ్‌వో
స్పెయిన్‌లో 268, ఇటలీలో 285 మంది చనిపోయారు. గత ఏడు వారాల్లో ఇదే అత్యల్పం. ఇంకా కరోనా గుప్పిట నుంచి బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) యూరప్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా 874 కేసులతో పాకిస్థాన్‌లో బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. 346 మంది పాణ్రాలు కోల్పోయారు. సింగపూర్‌లో మరో 588 మందికి పాజిటివ్ తేలగా, బాధితుల సంఖ్య 16,169కి చేరింది. బ్రిటన్.. రోజుకు లక్ష మందికి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.
యూఏఈలోని భారతీయుల కోసం వెబ్‌సైట్..
యూఏఈలో చిక్కుకుపోయి స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయుల కోసం అబుదాబిలోని ఎంబసీ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించాయి.
www.indianembassyuae.gov.in లేదా www.cgidubai.gov.in వెబ్‌సైట్‌లలోని నిర్ణీత దరఖాస్తు ఫాంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. www.cgidubai.gov.in/ covid_register అనే లింక్‌లోనూ అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఒకేసారి పూర్తి చేయాలని, కుటుంబాలతో వెళ్లేవారు ఒక్కొకరి పేరిట ప్రత్యేకంగా వివరాలు ఇవ్వాలని సూచించింది. కంపెనీలు కూడా ప్రతి ఉద్యోగికి విడివిడిగా దరఖాస్తు సమర్పించాలని స్పష్టం చేసింది. యూఏఈలో అబుదాబిలోని భారత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని ప్రిన్సి రాయ్ మాథ్యూ కరోనాతో మృతి చెందారు.
Courtesy Andhrajyothi