రైతుబంధు డబ్బులు వడ్డీకి జమ

0
255
  • ఆదిలాబాద్‌ జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్వాకం
  • పెట్టుబడి ఖర్చులకు ఇబ్బందితో రైతు ఆత్మహత్య

ఉట్నూర్‌ : ఆ రైతుకు ఉన్నది రెండున్నర ఎకరాలు.. అందులో ప్రధానంగా పత్తి, మరో పంటగా సోయా సాగు చేశాడు. దిగుబడుల్లేక దెబ్బతిన్నాడు. అనారోగ్యం కారణంగా మరింత ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. అప్పటికీ ధైర్యం కూడదీసుకుని వ్యవసాయం చేయసాగాడు. ఇటీవల కష్టాలు మరింత పెరగడంతో డబ్బు సర్దుబాటు చేసుకురమ్మని భార్యాపిల్లలను అత్తారింటికి పంపాడు. ఈలోగా ప్రభుత్వం రైతుబంధు కింద రూ.12,500 మంజూరు చేయడంతో ఎంతోకొంత పెట్టుబడికి ఉపయోగ పడతాయని అనుకున్నాడు. కానీ, ఊహించని విధంగా బ్యాంకు అధికారులు ఆ డబ్బును పాత రుణం వడ్డీ కింద జమ చేయడంతో హతాశుడయ్యాడు. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేౄసుకున్నాడు. ఆదిలా బాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌కు చెందిన యువ రైతు చౌహాన్‌ అరవింద్‌ (36) విషాదాంతమిది.

గ్రామ శివారులో ఉన్న పొలంపై 2018లో అరవింద్‌ తాడిహత్నూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.90 వేల పంట రుణం తీసుకున్నాడు. పంటలు సరిగా పండకపోవడంతో వాయిదాలు చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా మంజూరైన రైతుబంధు డబ్బులను.. బ్యాంకు అధికారులు వడ్డీ కింద పట్టుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఓ వైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం.. మరోవైపు పెట్టుబడి ఖర్చుల ఇబ్బంది తట్టుకోలేక సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరవింద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పుట్టింట్లో ఉన్న భార్య, పిల్లలు ఈ విషయం తెలిసి బోరుమన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు నార్నూర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply