శభాష్‌ షాలినీ

0
67

వినూత్నం

మారు వేషాల్లో జనాల్లో కలిసిపోయి నేరగాళ్లను చట్టానికి పట్టించే పోలీసులను చూశాం. ఇండోర్‌కు చెందిన షాలినీ చౌహాన్‌ అనే ఒక మహిళా కానిస్టేబుల్‌ కూడా అదే బాట పట్టింది. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే విద్యార్థినులను కనిపెట్టడం కోసం మెడికల్‌ స్టూడెంట్‌ అవతారమెత్తింది. ఆ కథేంటో తెలుసుకుందాం!

ఆ అమ్మాయి అందరు విద్యార్థినుల్లాగే ఆకర్షణీయమైన డ్రస్సులు ధరిస్తుంది. భుజానికి బ్యాగు తగిలించుకుంటుంది. క్లాసులకు ఎగనామం పెడుతూ క్యాంటీన్‌లో అమ్మాయిలతో కబుర్లు చెబుతూ కనిపిస్తుంది. దాంతో కాలేజీ క్యాంప్‌సలో ర్యాగింగ్‌ ఆధారాలను కనిపెట్టడానికి వచ్చిన ఒక అండర్‌ కవర్‌ కాప్‌ అని ఆ అమ్మాయిని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ 24 ఏళ్ల మధ్యప్రదేశ్‌ పోలీసు కానిస్టేబుల్‌ షాలినీ చౌహాన్‌, తాజాగా ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ను ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. మూడేళ్ల వ్యవధిలో జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్న 11 మంది విద్యార్థినులను పసిగట్టి, కాలేజీ యాజమాన్యానికి అప్పగించింది. దాంతో ఆ సీనియర్లందరూ కాలేజీతో పాటు హాస్టళ్ల నుంచి మూడు నెలల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు.

పోలీసులకు భయపడి…
ఈ సంఘటన మూలాల్లోకి వెళ్తే… పోలీస్‌ కానిస్టేబుల్‌ షాలినీ తమ దృష్టిలోకొచ్చిన ర్యాగింగ్‌ సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘‘మాకు మెడికల్‌ కాలేజీ విద్యార్థుల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతూ ఉండేవి. మొదటి సంవత్సరం విద్యార్థుల చేత జుగుప్సాకరమైన పనులు చేయిస్తూ, వేధింపులకు గురి చేస్తున్న సీనియర్‌ విద్యార్థినులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. దాంతో నేనూ, ఇన్‌స్పెక్టర్‌ తెహజీబ్‌ కాజీ కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టాం. మేం పోలీసు యూనిఫామ్‌లో కాలేజీకి చేరుకుని విచారణ మొదలుపెట్టడంతో, బాధిత విద్యార్థులెవరూ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయేవారు. ఫిర్యాదు చేసిన విద్యార్థుల ఫోన్‌ నెంబర్లను వెతికి పడదామనుకుంటే, అందుకు హెల్ప్‌లైన్‌ సహకరించలేదు. దాంతో స్వయంగా రంగంలోకి దిగి మారువేషాల్లో ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థినులను కనిపెట్టాలనుకున్నాం.

మారువేషాల్లో మనసు కనిపెట్టి…
నాతో పాటు మరో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు సాదాసీదా కాలేజీ దుస్తుల్లో క్యాంప్‌సలోకి అడుగు పెట్టాం. క్యాంప్‌సలో సంచరిస్తూ, క్యాంటీన్‌లో విద్యార్థినులతో ముచ్చటిస్తూ, క్రమేపీ వాళ్లకు దగ్గరయ్యాం. స్నేహితులుగా మెలగడంతో నెమ్మదిగా జూనియర్లు మా దగ్గర మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. అలా వాళ్లు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మాతో చెప్పుకున్నారు. అలా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న 11 మంది సీనియర్లనూ గుర్తించి, కాలేజీ నుంచి సస్పెండ్‌ చేయించాం. కొన్ని సార్లు జూనియర్లు మమ్మల్ని కూడా అనుమానించారు. కానీ వాళ్లు మా గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా తెలివిగా వాటిని దాటవేసేవాళ్లం. ఇలా మారువేషాల్లో కాలేజీ క్యాంప్‌సలో ర్యాగింగ్‌కు పాల్పడే వాళ్లను వెతికి పట్టడం మా అందరికీ కొత్త అనుభవమే! ఈ అనుభవాన్ని మేమందరం మనాసారా ఆస్వాదించాం.’’

నాతో పాటు మరో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు కాలేజీ దుస్తుల్లో క్యాంప్‌సలోకి అడుగు పెట్టాం. క్యాంప్‌సలో సంచరిస్తూ, క్యాంటీన్‌లో విద్యార్థినులతో ముచ్చటిస్తూ, వాళ్లకు దగ్గరయ్యాం. నెమ్మదిగా జూనియర్లు మా దగ్గర మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు.

Leave a Reply