టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ దుర్మరణం

0
46
  • బలిగొన్న రోడ్డు ప్రమాదం 
  • ముంబై వస్తుండగా దుర్ఘటన 
  • ప్రాణాలు తీసిన అతి వేగం

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) మరిక లేరు. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ఆదివారం మధాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. మిస్త్రీకి భార్య రోహిక్వా,  కుమారులు ఫిరోజ్‌, జహాన్‌ ఉన్నారు. అహ్మదాబాద్‌ నుంచి మెర్సిడెజ్‌  బెంజ్‌ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్‌ జిల్లాలోని సూర్య నదిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మిస్త్రీ తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ (ఎస్‌పీ గ్రూప్‌) చైర్మన్‌ పల్లోంజీ మిస్త్రీ చనిపోయిన కొద్ది నెలలకే సైరస్‌ మిస్త్రీ ఇలా ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ కలిచివేసింది.

అతి వేగంతోనే: మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసు వర్గాలు చెప్పాయి. రాంగ్‌ రూట్‌లో మరో వాహనాన్ని ఎడమ పక్క నుంచి ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రయత్నంలో కారు అదుపు తప్పి, వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో కారు వెనక భాగంలో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ పండోల్‌ అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న ప్రముఖ గైనకాలజిస్ట్‌ అనహిత పండోల్‌ (55), ఆమె భర్త డారియస్‌ పండోల్‌ (60) మాత్రం తీవ్రగాయాలతో ప్రాణాలతో బయపడ్డారు. వారిరువురు గుజరాత్‌లోని వాపి వద్ద ఉన్న ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మిస్త్రీ మద్దతుదారు: ఈ ప్రమాదంలో చనిపోయిన జహంగీర్‌ పండోల్‌.. డారియస్‌ పండోల్‌ సోదరుడు. ఆయన గతంలో టాటా గ్రూప్‌ కంపెనీల్లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మిస్త్రీ దుర్మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

సైరస్‌ మిస్త్రీ అకాల దుర్మరణం దిగ్ర్భాంతి కలిగించింది. భారత ఆర్థిక సామర్ధ్యంపై ఆయనకు అపార విశ్వాసం ఉంది. ఆయన మృతి దేశ పారిశ్రామిక రంగానికి పెద్ద నష్టం.                              – ప్రధాని నరేంద్ర మోదీ

మిస్త్రీజీ అకాల, ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఆయన జీవితం కోసం తపించేవారు. ఇంత చిన్న వయసులోనే ఆయన కన్ను మూయడం బాధాకరం.                           -ఎన్‌ చంద్రశేఖరన్‌, చైర్మన్‌,టాటా సన్స్‌

న్యాయ పోరాటం
టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పించాక టాటా గ్రూప్‌ కంపెనీల బోర్డుల నుంచీ వరుస పెట్టి మిస్త్రీని తప్పించారు. ఈ అవమానాన్ని సహించలేక సైరస్‌ మిస్త్రీ.. ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ, కోర్టులను ఆశ్రయించారు. చివరికి విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. గత ఏడాది అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ విభేదాలతో టాటా సన్స్‌ ఈక్విటీలో తమకు ఉన్న 18.4 శాతం వాటాను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ అమ్మకానికి పెట్టేంత వరకు పోయింది.

టాటాలతో లడాయి
సైరస్‌ మిస్త్రీ.. షాపూర్జీ పల్లోంజీ కుటుంబ సభ్యుడు. 2012లో టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. నిజానికి 2006 నుంచీ మిస్త్రీ టాటా సన్స్‌ బోర్డులో డైరెక్టర్‌. రతన్‌ టాటా చైర్మన్‌గా రిటైర్‌ అయ్యాక దాదాపు ఏడాది పాటు ఆయన వారసుడి కోసం టాటా సన్స్‌ గాలించింది. చివరికి 44 ఏళ్ల వయస్సు కలిగిన మిస్త్రీ నే సరైన వారసుడని ఎంపిక చేసుకుంది. టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవీ చేపట్టిన అతి పిన్న వయస్కుడు కూడా మిస్త్రీనే. అంతేకాదు టాటా కుటుంబంతో సంబంధం లేకుండా చైర్మన్‌ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. అయితే టాటా సన్స్‌ పగ్గాలు చేపట్టేందుకు మిస్త్రీ తొలుత ఏ మాత్రం సుముఖత చూపలేదు. స్వయంగా రతన్‌ టాటా రంగంలోకి దిగి ఆయన్ని ఒప్పించారని చెబుతారు. టాటా సన్స్‌ చైర్మన్‌ కావడంతో మిస్త్రీ పేరు దేశ పారిశ్రామిక రంగంలో అందరికీ సుపరిచితమైంది. టాటా సన్స్‌ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టడంతోనే షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుని సోదరుడు షాపూర్‌ మిస్త్రీకి ఆ బాధ్యతలు అప్పగించారు. మిస్త్రీ నేతృత్వంలో ఎస్‌పీ గ్రూప్‌ భిన్న రంగాల్లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌ టర్నోవర్‌ కూడా 3,000 కోట్ల డాలర్లు దాటింది. ముందు నుంచీ మిస్త్రీ-టాటాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే టాటా గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు సంబంధించి మిస్త్రీ తీసుకున్న నిర్ణయాలు మాజీ చైర్మన్‌ రతన్‌ టాటాకు రుచించలేదు. దాంతో ఐదేళ్లు కూడా పూర్తికాక ముందే 2016 అక్టోబరు 24న ఆయన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించారు. టాటా గ్రూప్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఆయన మళ్లీ తన గ్రూప్‌ కంపెనీలో ఎలాంటి బాధ్యతలు చేపట్టలేదు.

లాభాలే కొలమానం
నష్టాలతో గుదిబండలా మారిన ఏ వ్యాపారాన్ని మిస్త్రీ ఇష్టపడే వారు కాదు. ఈ కారణంతోనే మలేషియా కంపెనీ ఎయిర్‌ఏషియాతో కలిసి టాటా గ్రూప్‌ ప్రారంభించిన విమానయాన కంపెనీ నష్టాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే టాటా మోటార్స్‌కు గుదిబండలా మారిన ‘నానో’ కారు ఉత్పత్తిని ఇంకా కొనసాగించడాన్నీ వ్యతిరేకించారు. సెంటిమెంట్‌ పక్కన పెట్టి మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పోతేనే ఏ వ్యాపారమైనా విజయవంతమవుతుందనేది మిస్త్రీ ప్రగాఢ నమ్మకం. ఈ విషయంలోనే ఆయనకు మాజీ చైర్మన్‌ రతన్‌ టాటాతో తీవ్ర విభేధాలు తలె త్తాయి. మిస్త్రీ హయాంలోనే టాటా గ్రూప్‌ (టాప్‌ 20  లిస్టెడ్‌ గ్రూప్‌ కంపెనీస్‌).. వార్షిక వృద్ధి రేటు 12.5 శాతానికి పెరిగింది. అంతేకాకుండా రుణ భారం కూడా స్వల్పంగా రూ.1.89 లక్షల కోట్ల నుంచి రూ.2.29 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో టాటా గ్రూప్‌ టర్నోవర్‌ 10,000 కోట్ల డాలర్లు దాటింది. ఏటా నికర లాభాల్లో వృద్ధి 42.3 శాతం నమోదైంది.

సైరస్‌ మిస్త్రీ వ్యక్తిగత వివరాలు  
పుట్టిన తేదీ 1968, జూలై 4
తల్లి ద్వారా సైరస్‌ మిస్త్రీకి ఐర్లాండ్‌ పౌరసత్వం
సోదరుడు షాపూర్‌ మిస్త్రీ, ఇద్దరు
సోదరీమణులు లైలా, అలూ
అలూ.. రతన్‌ టాటా సోదరుడు నోయల్‌ టాటా భార్య
లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ నుంచి 1990లో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి
1994లో 26 ఏళ్ల వయసులో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియామకం
1997లో లండన్‌  బిజినెస్‌ స్కూల్‌ నుంచి మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీ
భారత్‌తో పాటు పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో  షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ విస్తరణో కీలక పాత్ర
2012 జనవరి 24న టాటా సన్స్‌ చైర్మన్‌గా నియామకం
2016 అక్టోబరు 24నటాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగింపు

Leave a Reply