ఐదు శతాబ్దాల క్రితమే సమానత్వాన్ని కోరిన రవిదాస్‌

0
247

– ముకుంద రామారావు

విదాస్‌ ఒక యోగి, కవి, తత్వవేత్త, సంఘ సంస్కర్త. చర్మకారుల కుటుంబంలో పుట్టి, సామాజిక తత్వవేత్తగా అనేకమందిని ఆకట్టుకున్న ప్రబోధకుడు ఆయన. గొప్ప భక్తికవులైన నామదేవ్‌, కబీర్‌లతో కలిసి భాషా ప్రతిబంధకాల్ని దాటుకొని భారతదేశం అనేక ప్రాంతాల్లో భాషల్లో గుర్తించబడ్డాడు. రవిదాస్‌, రైదాస్‌, రయెదాస్‌, రుద్రదాస్‌, రుయిదాస్‌, రయిదాస్‌, రోహిదాస్‌, రోహిత్‌ దాస్‌, రుహ్దాస్‌, రామదాస్‌, రందాస్‌, హరిదాస్‌ … ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ప్రాచుర్యం పొందాడు. తెలుగునాట పోతులూరి వీరబ్రహ్మంలాగ సంఘ సంస్కరణను, సమానత్వాన్ని ప్రచారం చేసినవాడు.

రవిదాస్‌ గొప్ప మార్మిక సంత్‌ కవి. సంత్‌ అంటే కులంతో సంబంధం లేనివాడు. అతని కవితలు అతను రాసుకున్నవీ కాదు. జనసమూహాల్లో కవితాగానం చేసినవి. అతని మరణాంతరం అతని అనుయాయుల జ్ఞాపకాలనుంచి సేకరించినవి. కావున వాటిలో రూపాంతరాలు కనిపిస్తాయి. సిక్కుల మత గ్రంథంలో చేర్చిన 40 కవితలూ, అతని జీవితకాలంలోనే అతని దగ్గరనుండే సేకరించినవి కావడంతో, వాటి ప్రామాణికత విషయంలో ఎవరికీ ఏ అనుమానాలూ లేవు. ఆ 40 కవితలే కాకుండా, రవిదాస్‌ కవితలుగా ఉన్న రాతప్రతులు కొన్ని దొరికాయి. అతని మొట్టమొదటి కవితా సంకలనం ‘రవిదాస్‌ కవితా కీ బారీ’ అలహాబాద్‌ నుంచి 1908లో ప్రచురించబడింది. అందులో 87 భక్తి గీతాలు, 6 ద్విపదలు ఉన్నాయి. ఆ తరువాత రామచంద్ర శాస్త్రి, వీరేంద్ర పాండే పండితులు ఇద్దరూ కలిసి ‘సంత్‌ రవిదాస్‌’ పేరున సేకరించినవి 97 భక్తి గీతాలు, 6 ద్విపదలు. ‘సంత్‌ రవిదాస్‌’ పేరునే సంగం లాల్‌ పాండే 106 భక్తిగీతాలు, 7 ద్విపదలు, మరొక సంకలనకర్త జోగిందర్‌ సింగ్‌ 112 భక్తి గీతాలు, 8 ద్విపదలు సేకరించాడు. ఆచార్య పథ్వీసింగ్‌ 190 ద్విపదలు సేకరించాడు. వీటన్నింటి శైలి వస్తువు మూలంగా ప్రామాణికత నిర్ధారణ కాలేదు.
ప్రామాణికంగా భావించబడుతున్న సిక్కు మత గ్రంథంలోని కవితల్లో రవిదాస్‌ జీవిత విశేషాలు ఎక్కువ లేవు. ఉన్న కొన్ని కూడా – అతను చర్మకారుడు, చెప్పులు కుట్టుకునే వత్తి పాటించేవాడు. అతను ప్రాపంచిక జీవితాన్ని త్యజించకుండా, తని వృత్తినీ విస్మరించకుండా, ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అతని జీవిత కాలం విషయంలోనూ సేకరించిన వాటిలో స్పష్టత లేదు. అతను జన్మించిన సంవత్సరాలు 1375 నుంచి 1471 వరకూ కనీసం 10 వరకూ ఉన్నాయి. అతని మరణానికి సంబంధించి కూడా 1520 నుంచి 1595 వరకూ ఏడు సంవత్సరాలు ఉన్నాయి. అతని జీవితకాలం కూడా 50 నుంచి 150 వరకూ అని నమోదు చేశారు. అందులో అసలైనదేదో తేల్చలేక 15 – 16 శతాబ్దాల మధ్యవాడుగా పేర్కొనడం జరుగుతోంది.

1570 ప్రాంతంలో రవిదాస్‌ కవితలు బాబా మోహన్‌ పోథీల్లో (పుస్తకాల్లో) రాసుకొని ఉన్న వాటిని ఐదవ సిక్కు గురువు అర్జన్‌ దేవ్‌, ‘గురు గ్రంథ్‌ సాహిబ్‌ (ఆది గ్రంథ్‌)’ సిక్కుల పవిత్ర గ్రంథం, భగత్‌వాణి (భక్తుల పలుకులు) అధ్యాయంలో చేర్చారు. సంగీతానికి అనుగుణంగా సంస్కరించబడ్డ 40 రవిదాస్‌ కవితలు అవి. గురు గ్రంథ సాహిబ్‌ లోని 40 కవితలూ ఈ విధంగా ఉంచబడ్డాయి. రాగ – సిరి (1), గౌరి (5), ఆస (6), గుజరి (1), సోరథ్‌ (7), ధనసరి (3), జైత్సరి (1), సుహి (3), బిలవల్‌ (2), గౌంద్‌ (2), రాంకలి (1), మరు (2), కెదర (1), భైరౌ (1), బసంత్‌ (1), మల్హర్‌ (3). ఆ 40 కవితలే (అందులో ఒకటి పునరుక్తి), రవిదాస్‌ బోధనలు, ఆధ్యాత్మిక దర్శనం, తెలుసుకుందుకు ప్రధానంగా ప్రామాణికంగా దొరుకుతున్న మూలాలు. అతని మరణాంతరం వందేళ్ల లోపే ఈ సంకలనం తయారుకావడాన్ని, రవిదాస్‌ అవగాహనకు అమితంగా పనికొస్తున్న అమూల్య నిధులు. అయినా వాటిలో, అతని జీవితకాలం గాని, గురువు లేదా తల్లిదండ్రుల వివరాలు గాని అందులో ఏవిధమైన జాడలూ లేవు. అప్పట్లో అంతా మౌఖికంగానే ఉండేవి కావున, రవిదాస్‌ జీవిత వివరాలు, రచనలు, కచ్చితమైన అసలురూపంలో గాని లేదా యథార్థమైన అంశా లతో గాని దొరకలేదు. అతడి తాత్విక విజయాల మూలంగా కొంతలో కొంతయినా అతని ప్రాముఖ్యత తెలుసుకునే అవకాశం దొరికింది.

1693లో రాయబడ్డ ‘ప్రేమ అంబోధ్‌’ పుస్తకంలో రవిదాస్‌ జీవిత విశేషాలు కొంత దొరుకుతున్నాయి. రవిదాస్‌ యశస్సు తెలిసాక, మీరాబాయి వారణాసి వచ్చి అతని శిష్యురాలైంది. విష్ణుభక్తులు పూజించే రాయి సాలగ్రామాన్ని రవిదాస్‌ పూజిస్తున్నాడని, అది అపచారం అని విప్రులు రాజుకు ఫిర్యాదు చేసారు. ఆ విప్రులకు, రవిదాస్‌కు ఆ సాలగ్రామాన్ని నీటిలో తేలేటట్టు చేయాల్సిందిగా రాజు వారి మధ్య పోటీ పెట్టాడు. విప్రులు అందులో విఫలమయ్యారు, రవిదాస్‌ విజయం సాధించాడు. అదే సమయంలో రాజస్థాన్‌ మౌఖిక సంప్రదాయ పద్ధతిలో రవిదాస్‌ కవితలు పంజాబ్‌లో వ్యాపించడం మొదలైంది. రాజస్థానీ ఆధ్యాత్మిక కవి గురువు సంత్‌ దాదూ దయాల్‌, అనుయాయుల రాతప్రతుల్లో 40 నుంచి వంద కంటే ఎక్కువగా రవిదాస్‌ కవితలు ఉన్నాయని తేలినా, వాటి ప్రామాణికత మీదా సందేహాలు ఉన్నాయి.

రవిదాస్‌ ప్రతిష్ట దూరదూరాలకు ప్రాకి రాజస్థాన్‌ రాణి ఝల్లి చిత్తోర్‌ ఘడ్‌ నుంచి వచ్చి రవిదాస్‌ శిష్యురాలైంది. ఆమెతోబాటే రవిదాస్‌ చిత్తోర్‌ఘడ్‌ వచ్చినపుడు అక్కడ జరిగిన భోజనాది కార్యక్రమాల్లో రవిదాస్‌ని చేర్చడానికి వీల్లేదని అక్కడి విప్రులు ఆక్షేపణ తెలిపారు. రాణికి ఏమి చేయాలో తోచలేదు. అయితే రవిదాస్‌ అందులో చేరకుండా తన ధ్యానంలో బయటనే ఉండిపోయాడు. ఆ తరువాత విప్రులకు రవిదాస్‌ దైవిక లక్ష్యం అర్థమై, తమ యజ్ఞోపవీతాల్ని సైతం విసిరేశారని అనంతదాస్‌ రాసుకున్నాడు. ఆ సందర్భంగా విప్రులను ఉద్దేశించి రవిదాస్‌ చెప్పిన కవిత ఇది : ”నగర జనులారా, కేవలం చెప్పులు కుట్టే జాతి నాది/ కానీ నా హృదయంలో గోవిందుని గుణగణాల్ని కీర్తిస్తాను/ పవిత్ర జలంతో సారాయి తయారైనా, మునులారా మీరు దానిని తాగరు/ అపవిత్రమైన సారాయి, లేదా మలినమైన నీరు, పవిత్రమైన నీటితో కలిసినా పవిత్రతలో మార్పుండదు/ అయ్యా తాటిచెట్టుని అపవిత్రంగా భావిస్తారని అంగీకరిస్తాను, దాని ఆకుల్ని కూడా/ కానీ తాటాకుల మీద దేవుని పదాలు రాసి ఉంటే, వాటిముందు జనం ఒంగి ప్రార్థిస్తారు/ చర్మాన్ని ఒలిచి కళేబరాల్ని వారణాసి ఊరవతల పారేయడం నా వృత్తి/ అయినా అతని నామస్మరణలో దాసుడైన రవిదాసుకు, విప్రులంతా ఇప్పుడు వంగి నమస్కరిస్తారు.”

1624 ప్రాంతంలో రామానంద్‌ మరొక అనుయాయి నాభాదాస్‌ రాసిన ”భక్తమాల్‌”లో, రవిదాస్‌తో బాటు రెండొందలకు పైగా భక్తుల చరిత్ర ఉంది. 1712లో ప్రియాదాస్‌ రాసిన మరొక గ్రంథం ‘భక్తిరసబోధిని’కి అది నాంది అయింది. అందులో రవిదాస్‌ జీవితానికి సంబంధించి, నాభాదాస్‌తో ఏకీభవించినవి ఉన్నా, కొన్ని చెప్పుకోదగ్గ వ్యత్యాసాలూ ఉన్నాయి. విగ్రహారాధన చేయకపోవడం, ఆచారాలు పాటించకపోవడం, తీర్థ యాత్రలకు పోకపోవడం లాంటి అతని బోధనల మూలంగా, వారి జీవనో పాధికి భంగం కలుగుతుండటంతో, వారణాసిలో విప్రులు అవకాశం కోసం ఎదురు చూసేవారు. రవిదాసుని ఇబ్బంది పెట్టే దేనినీ వారు వదులుకోలేదు. రవిదాసు మీద వాటి ప్రభావం ఏమీ పడకపోవటం వారిని మరింత బాధించేది.

19వ శతాబ్దం నుంచి హిందీ ప్రాంతంలో రవిదాస్‌ పట్ల ఆసక్తి ఎక్కువైంది. అందులో ఎక్కువగా వర్తకులు, దళితులూ ఉన్నారు. శివదయాల్‌ సింగ్‌ 1861లో స్థాపించిన రాధస్వామి ఉద్యమం సంత్‌ జీవితాలను అనుసరించే దిశలో మొదలైంది. 20వ శతాబ్దం మొదటి భాగంలో రవిదాస్‌ మీద అనేక సంకలనాలు, బాలేశ్వర్‌ ప్రసాద్‌ అగరవాల్‌ అలహాబాద్‌ నుంచి ప్రచురించాడు. మీరట్‌ జిల్లా జహీద్పూర్‌కి చెందిన చర్మకారుడు జాతవ్‌ రాసిన 14 ఉదంతాల ‘రవిదాస్‌ రామాయణం’, రామాయణం పద్ధతిలో వచ్చింది. 1940లో మరొక చర్మకారుడు రామచరన్‌ కురిల్‌ (1882-1956) రాసిన ‘భగవాన్‌ రవిదాస్‌ సత్యకథ’, దళితుల్లో సంస్కరణ కోసం వినియోగించుకున్నాడు.

మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. వారణాసి శివారు ప్రాంతమైన మందూదిV్‌ా (ఇటీవల పరిశోధకుల ప్రకారం, సీర్‌ గోవర్ధనపూర్‌)లో రవిదాస్‌ జన్మించి అక్కడే స్థరపడ్దాడని మొదటిసారి బయటపెట్టాడు.

రవిదాస్‌ ఒక కొత్త ప్రపంచాన్ని కూడా ఊహించాడు. దాని గురించి ఇలా చెప్పాడు : ”ద్ణుఖమూ బాధకూ తావులేని/ నగరం ఉంది, పేరు బేగంపురా/ అక్కడ కప్పం లేదా పన్ను భయం లేదు/ అక్కడ చింత లేదా అపరాధం లేదా భీతి లేదా చావు లేదు/ ప్రశస్తమైన నివాసాన్ని నేను ఇప్పుడు కనుగొన్నాను/ నా మిత్రులారా, అంతులేని ఆనందం అక్కడ వెల్లివిరుస్తుంది/ స్థిరంగా చూసే దేవుని పరిపాలన అక్కడ/ ఒకటో రెండో స్థాయిలు అక్కడ లేవు, అతనొక్కడే పాలించేది/ ఆ నగరం జనసమ్మర్ధంతో శాశ్వతంగా ప్రసిద్ధమైనది/ దాని నివాసితులు సంపూర్ణ భాగ్యవంతులు/ ఎవరి ఇష్టానుసారం వారు స్వేచ్ఛగా విహరించొచ్చు/ అక్కడ ఎవరి దారిని ఎవరూ అడ్డుకోరు/ అక్కడ నా స్నేహితులు నా తోటి పౌరులవుతారు.” తాత్విక దృష్టితో అతడు స్వప్నించిన కొత్త లోకం ఎంత బాగుందో మనం గమనించొచ్చు. అతని సమసమాజ తత్వం మూలంగా, సమాజంలో అన్ని వర్గాలవారూ అతని శిష్యులయారు. అందులో చిత్తూర్‌ రాణి ఝాలి, మేవార్‌ రాజు సంగ్రాం సింగ్‌ కోడలు రాజపుట్‌ రాకుమారి మీరాబాయి, మధ్యప్రదేశ్‌ రేవా రాకుమారుడు వీర్‌ సింగ్‌ దేవ్‌ వాఘేలా లాంటి వారు ఎందరో ఉన్నారు.

అతనికి జీవం ఆత్మాకాదు, శరీరమూ కాదు, రెండింటి సంయోగం. జీవమే ఆత్మ, ప్రపంచంతో ముడిపడ్డ శరీరంలో బందీ. ”నీకూ నాకూ మధ్య, నాకూ నీకూ మధ్య, భేదం ఏముంది?/ కనకం కంకణం, నీరూ కెరటం లానే మనం” అని అందుకే అంటాడు. తీర్థయాత్రల మూలంగా సాధించేదీ ఏదీ లేదని పదేపదే ప్రకటించాడు. ”నువ్వు తీర్థయాత్రయితే, నేను నీ యాత్రికుడ్ని/ ప్రభూ! నిజమైన ప్రేమలో నేను నీతో కలిసాను/ నీతో కలిసాక, ఇతరులందరితోనూ తెంపుకున్నాను” – అని స్పష్టంగా చెప్పాడు. అతని కవిత్వమంతా బానిసత్వం మీద తీవ్రమైన నిరసన ఒక వైపు, నిరాకారుడైన దేవుని పట్ల ఎల్లలు లేని ప్రేమా భక్తి ఇంకో వైపూ గా సాగింది.

రవిదాస్‌ గీతాలు దళిత ఉద్యమానికి ఒక పతాకంలా, అతని కవిత్వం ఒక పవిత్ర వాచకంలా, అతని గాథలు దళితుల ఆత్మాభిమానం, శక్తికి ఉదాహరణలుగా పనికొచ్చాయి. పంజాబ్‌ లాంటి ప్రాంతాల్లో దళిత ఉద్యమానికి రవిదాస్‌ ఒక ఉత్ప్రేరకం అయ్యాడు. అది రాను రాను ఉత్తర భారతదేశం, విదేశాలలకు సైతం పాకింది. పంజాబ్‌లో అతనిని గురువుగా, సంత్‌ కవిగా, సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తగా, మానవతావాదిగా, యాత్రికుడుగా, అహింసావాదిగా, ఆధ్యాత్మిక మూర్తిగా ఆరాధిస్తారు. భారతదేశం అనేక ప్రాంతాల్లో చెప్పులు కుట్టే చోట, అక్కడి గోడకో చెట్టుకో రవిదాస్‌ చిత్రం పూజనీయంగా వేలాడి ఉంచడం ఇప్పటికీ కనిపిస్తుంది. అతని కవిత్వంలో మతం పేరుమీద, కులం పేరుమీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నర్మగర్భంగా చెబుతున్నా, మెరుగైన ప్రపంచపు ఆశల్ని రేకెత్తిస్తాయి. అణగారిన వర్గాల సామాజిక ఆధ్యాత్మిక అవసరాలను ప్రతిబింబిస్తుంది అతని స్వప్నం.

Leave a Reply