హాస్య రచయిత ఆదివిష్ణు కన్నుమూత

0
365
  • ఉపిరితిత్తుల వ్యాధితో మృతి
  • నాటక రచయితగా ఆదరణ
  • హాస్య రచనలకు ప్రసిద్ధి
  • జంధ్యాల సినిమాలకు మాటలు
  • కోట, బ్రహ్మానందం నివాళి

చిక్కడపల్లి: ఒరేయ్‌.. అరగుండూ, లోపల ఇంకో పేపరుంది.. దాన్ని నువ్వు కట్టుకో. గొ…ప్ప సుఖంగా ఉంది’ అంటూ పేపరు లుంగీ కట్టులో పీనాసి లక్ష్మీపతి వెంటపడితే.. ‘నా వల్ల కాదు మహాప్రభో.. అది చిరగరాని చోట చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది’ అంటూ అరగుండు గోవిందు గగ్గోలుపెట్టే ‘అహనా పెళ్లంట’ చిత్రం గుర్తుందా? దర్శకుడు జంధ్యాల పండించిన ఈ హాస్యపంటకు అక్షర సేద్యకాడు ఆదివిష్ణు! హాస్యాన్ని ఆస్వాదించే సినీ ప్రేక్షకులకు జంద్యాల వీరాభిమాని అయితే, సాక్షాత్తు జంధ్యాల మెచ్చిన రచయిత ఆయన.

జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన ఆదివిష్ణు (80) ఇకలేరు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య సూర్య మహాలక్ష్మి, ముగ్గురు కుమారులు వెంకటరమణ, శ్రీనివాస్‌, బాలాజీ ఉన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడైన ఆయన తన ముగ్గురు కుమారులకు కూడా స్వామివారి పేర్లే పెట్టారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశినాడే ఆయన పరమపదించడం విశేషం.

పాఠశాల స్థాయిలోనే నాటక రచనలు: మచిలీపట్నంలో 1940 సెప్టెంబరు 5న ఆదివిష్ణు జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, నాగయ్య. ఆయన అసలు పేరు విఘ్నేశ్వరరావు వినాయక చవితిరోజున పుట్టడంతో ఆయనకు ఆ పేరు పెట్టారు. హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఆర్టీసీలో ఉద్యోగిగా చేరారు. 1998లో పబ్లిక్‌ రిలేషన్స్‌ చీఫ్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. పాఠశాల స్థాయిలోనే పొట్టి కథలు, చిట్టి కథలతో పలు కథలు, నవలలు, నాటకాలు రచించారు. నాటక రచయితగా గొప్ప పేరు సాధించారు. సుప్రసిద్ధ సినీ రచయిత, దర్శకుడు జంధ్యాలతో కలిసి అహనా పెళ్లంట, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. బాలమిత్రుల కథ, ఇదాలోకం, కన్నె వయ సు సినిమాలకూ ఆయన రచయితగా పనిచేశారు. ఓ ప్రముఖ దినపత్రికలో సరిగమలు పేరిట వెయ్యికిపైగా కాలమ్స్‌ రాశారు. తనదైన హాస్యంతో కొత్త ఒరవడిని సృష్టించిన ఆయన రచన లు ఆశేష ప్రేక్షకలోకాన్ని ఆలరించాయి. 60ఏళ్ల ఆయన రచనా వ్యాసాంగంలో స్నేహం, తొలి మజిలీ, సత్యంగారిల్లు, శివతాండవం, మనిషి-మిథ్య, మా నాన్న ప్రేమకథ వంటి నవలలు ప్రాచుర్యం పొందాయి.

విభిన్న ప్రయోగాల రచయితగా పలు రేడియో నాటిక లు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1984లో సుం దరి సుబ్బారావు సినిమాకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ స్ర్కీన్‌ ప్లే రచయితగా నంది అవార్డు ను అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సాహితీ, సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నటులు కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అశోక్‌కుమార్‌, సుబ్బారాయ శర్మ తదితరులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి పారు. బన్సీలాల్‌పేటలోని శ్మశాన వాటికలో మంగళవారం సాయం త్రం ఆదివిష్ణు అంత్యక్రియలను నిర్వహించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply