ప్రమాదకరమైన తీర్పు

0
132

గుజరాత్ మతఘర్షణల్లో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో, తనపై ఆ దారుణానికి పాల్పడిన దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదలచేయడంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎదురుదెబ్బతిన్నారు. దోషులకు రెమిషన్ పాలసీని వర్తింపచేసే విషయంలో గతంలో ఇచ్చిన అనుకూల తీర్పును పునఃసమీక్షించాలన్న ఆమె అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెపై అత్యాచారంతో పాటు అనేకమంది దారుణమైన హత్యలకు కూడా కారకులై, యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న పదకొండుమంది ముందస్తు విడుదలపై నిర్ణయాధికారం గుజరాత్ ప్రభుత్వానిదేనంటూ సుప్రీంకోర్టు మే నెలలో నిర్థారించిన నేపథ్యంలో, ‘సత్ప్రవర్తన’ పేరిట వారిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏ రాష్ట్రంలో అయితే ఘోరకలి జరిగిందో, అదే రాష్ట్ర పాలకులకు రెమిషన్ అధికారం కూడా దక్కినందున, సరిగ్గా ఎన్నికలకు ముందు, ఆజాదీకా అమృతోత్సవ వేళ నిందితులు విడుదల కావడమే కాక, వారికి హారతులు, వీరతిలకాలు, ఘనస్వాగతాలతో అధికారపక్షం ఒక బలమైన రాజకీయ సందేశాన్ని కూడా ఇవ్వగలిగింది.

ఒక తీర్పును పునఃస్సమీక్షించాల్సిందిగా బాధితులు కోరడం, న్యాయస్థానాలు పరిశీలించడం జరుగుతున్నదే. ఈ పదకొండుమందిలో ఒకరు, తమను దోషులుగా నిర్ధారించినప్పటికి అమల్లో ఉన్న 1992నాటి రెమిషన్ పాలసీ ప్రకారమే తమ దరఖాస్తులు పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించమంటూ సుప్రీంకోర్టుకు విన్నవించుకుంటే, ఆ నిందితుడి వాదనతో ఏకీభవించిన బెంచ్, గుజరాత్ ప్రభుత్వానిదే నిర్ణయాధికారమని ప్రకటిచింది. తద్వారా, ఎక్కడైతే బిల్కిస్ బానో అత్యాచార ఘటన కేసు విచారణ సక్రమంగా జరగదని సర్వోన్నత న్యాయస్థానమే భావించి, ‘అసాధారణ, తీవ్రాతి తీవ్రమైన పరిస్థితుల’ దృష్ట్యా దానిని 2004లో మహారాష్ట్రకు బదిలీచేసిందో, ఇప్పుడు తిరిగి అదే రాష్ట్రానికి ఉపశమనాన్నిచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. నిందితుడికి శిక్ష ఖరారైన రాష్ట్ర ప్రభుత్వానికే రెమిషన్ అంశాన్నీ నిర్ణయించే అధికారం ఉంటుందని సీపీసీ సెక్షన్ 432(7) విస్పష్టంగా ‘జురిస్ డిక్షన్’ నిర్ధారించినప్పటికీ, ఇందుకు భిన్నంగా ఆ తీర్పు ఉన్నందున బిల్కిస్ బానో పునఃపరిశీలన కోరుకుంది.

ఇతర రాష్ట్రాలకు తరలిన ఇటువంటి కేసుల్లో రెమిషన్ నిర్ణయాధికారం కూడా ఆ రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందంటూ గతంలో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ కు లోబడి ఇచ్చిన అరడజనుకుపైగా తీర్పులను న్యాయనిపుణులు ఉటంకిస్తున్నారు. మే నెలలో ఏ న్యాయమూర్తి గుజరాత్ కు రెమిషన్ అధికారాన్ని దఖలుపరిచారో, ఇప్పుడు అదే న్యాయమూర్తి పునఃస్సమీక్ష విజ్ఞప్తిని తోసిపుచ్చడం మరొక విశేషం. గుజరాత్ లో తీవ్రపరిస్థితుల దృష్ట్యా, కేసు విచారణ సవ్యంగా సాగదని భావించి, మహారాష్ట్రకు బదిలీచేసిన సుప్రీంకోర్టుకు, రెమిషన్ అధికారం గుజరాత్ ప్రభుత్వానికే కట్టబెడితే ఏం జరుగుతోందో తెలియదనుకోలేం. తనకు అన్యాయం జరిగిందనిపిస్తే, న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉన్నదని అప్పట్లోనే బాధితురాలికి అవకాశం ఇచ్చిన న్యాయస్థానం ఇప్పుడు గత తీర్పును పరిశీలించబోనని చెప్పడం ఆమెకు అన్యాయం చేయడమే అవుతుంది. ఇప్పుడు అమలులో లేని 1992నాటి విధానాన్ని నిందితులకు వర్తింపచేసుకోనివ్వడం కూడా గుజరాత్ ప్రభుత్వానికి మంచి ఆయుధాన్ని అందించినట్టయింది. కోర్టును ఆశ్రయించింది ఒక్కరే అయినా నిందితులందరికీ రెమిషన్ వర్తింపచేసిన కమిటీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం ఈ నిర్ణయం వెనుక సత్ప్రవర్తన కన్నా రాజకీయమే అధికంగా పనిచేసిందని తెలుస్తూనే ఉంది. గోధ్రాఘటన, అనంతరం జరిగిన ఊచకోతలతో గుజరాత్ పాలకులు ఎంత ఎత్తుకు ఎదిగిపోయారో, ప్రతీ ఎన్నికల ముందూ దానిని దుష్టశిక్షణగా చూపుతూ ఓట్లు ఎలా కొల్లగొడుతున్నారో తెలిసిందే. కుల, మతమారణకాండలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు విడుదల విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించినప్పుడే ప్రభుత్వాలు కూడా హద్దుల్లో ఉంటాయి. దేశాన్ని కుదిపేసిన ఇటువంటి తీవ్రమైన ఘటనలో సైతం న్యాయస్థానం విచిత్రమైన తీర్పులివ్వడం, సమీక్షించడానికి అంగీకరించకపోవడం వంటివి జరిగితే, ఇకపై అత్యాచారం, హత్యకేసుల్లో యావజ్జీవం అనుభవిస్తూ, రాజకీయంగా పలుకుబడి ఉన్న శక్తులు ఉపశమనం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడితెచ్చే ప్రమాదం మరింత హెచ్చుతుంది.

Leave a Reply