పెగాసెస్ పై సుప్రీంలో విచారణ

0
37

– వచ్చేవారం ప్రారంభిస్తాం : సీజేఐ

న్యూఢిల్లీ : ఇటు పార్లమెంట్‌నూ, ఇటు కేంద్రాన్ని వణికిస్తున్న పెగాసెస్‌ కుంభకోణంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతరుల ఫోన్లను హ్యాకింగ్‌ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక విచారణను వచ్చే వారం చేపడతామని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శుక్రవారం తెలిపారు. ఈ కుంభకోణంపై మాజీ సిట్టింగ్‌జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటుచేయాలని సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌ రామ్‌, శశి కుమార్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విచారణ చేపట్టేందుకు జాబితా చేయాలని వారి తరుపున న్యాయవాది కపిల్‌ సిబల్‌ అభ్యర్థన చేశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలపై అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనీ, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, జడ్జిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వాదన విన్న న్యాయమూర్తి ఎన్‌వి రమణ…పనిభారాన్ని బట్టి వచ్చేవారం ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు.

ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థకు చెందిన నిఘా వైరస్‌ పెగాసెస్‌ను వినియోగించి భారత్‌లోని పలువురి ఫోన్లను కేంద్రం హ్యాక్‌ చేసిందని గ్లోబల్‌ మీడియా దర్యాప్తులో తేలింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అగ్రనేత, పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, జర్నలిస్టులు, జడ్జిలు కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలైన నాటి నుంచి ఆందోళన చేపడుతూనే ఉన్నప్పటికీ… ఇప్పటి వరకు ఎటువంటి చర్చ జరగకపోవడం గమనార్హం.

Courtesy Nava Telangana

Leave a Reply