ఎస్సీ ఎస్టీల ప్రత్యేక నిధి పక్కదారి !

0
187

క్యారీ ఫార్వర్డ్‌ చేయకుండా దాటవేత
కాగితాలమీదనే కేటాయింపులు
రూ.70వేల కోట్లు ఇతర పనులకే..?
ఎస్‌. వెంకన్న

దళితులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి పాటుపడతున్నామంటూ పదేపదే ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ..పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదన్న చర్చ జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్డీఎఫ్‌).ని ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పథకాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ.. వారి కోసం ఖర్చు చేస్తున్నది నామమాత్రమేనని, ఆ నిధులను దారిమళ్లిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్లు, నీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో దళితుల వాటా ఉంటది కదా అని సర్కారు నమ్మబలుకుతున్నది. ఈ అభివృద్ధి కూడా దళితుల అభివృద్దేనని అధికారులు చెబుతున్నారు. దీనిపై దళితసంఘాలు మండిపడుతున్నాయి.

ఆరేండ్ల రాష్ట్ర బడ్జెట్‌ను చూస్తే..ఎస్డీఎఫ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం1.09 లక్షల కోట్లు కేటాయించగా అందులో రూ. 57,100కోట్లనే మంజూరు చేసింది. అందులో కూడా రూ. 47,685.52 కోట్లనే ఖర్చు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. మిగతా రూ. 97,586 కోట్లకు పైగా నిధులను ఇతర పనులకు ప్రభుత్వం మళ్లించినట్టు తెలుస్తోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి పెట్టిన ఖర్చులను కూడా ఎస్డీఎఫ్‌ ఖాతాలోనే చూపించడం గమనార్హం.

క్యారీ ఫార్వర్డ్‌కు చిక్కకుండా..
ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16శాతం, ఎస్టీలు 10శాతంగా ఉన్నారు. జనాభా వాటాను అనుసరించి రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నారు. సబ్‌ప్లాన్‌ ప్రకారం ఆ ఏడాదిలో ఖర్చు చేయలేకపోతే తర్వాత ఏడాదికి నిధులను క్యారీ ఫార్వర్డ్‌ చేయాలి. గడిచిన ఆరేండ్లలో ఒక్కఏడాది కూడా ఈ నిధులు మిగిలిన దాఖలాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. క్యారీ ఫార్వర్డ్‌ చేయాల్సి వస్తుందనే కారణంతో నూటికి నూరు శాతం ఖర్చు చేసినట్టు చూపిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.

అన్నింట్లో వారున్నారంటూ..
ఎస్సీ ఎస్టీల ప్రత్యేక నిధిని ఆ తరగతులకే నిర్దేశించిన పథకాలకు ఖర్చు చేయాలని నిబంధన ఉన్నది. కానీ.. అందరికీ అమలవుతున్న సాధారణ పథకాలనే చూపి, అందులో ఎస్సీ,ఎస్టీల వాటాకూడా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేస్తున్నది. ”రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, ఉచితవిద్యుత్‌, ఆసరా పెన్షన్లు..ఇలా అన్నింటా ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు ఉన్నారు కదా? అందుకే వాళ్ల కోటా నుంచి ఖర్చు చేస్తున్నాం” అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి ఏడాది ఎస్సీ, ఎస్టీ ఫండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో చెబుతున్నది. ఎస్డీఎఫ్‌ నిధులను ప్రతి ఏడాది సంపూర్ణంగా ఖర్చు చేసినట్టు చూపించేందుకు ప్రభుత్వం అన్ని పథకాలకు తమ నిధిని పంచిపెడుతున్నదని దళిత, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ వాటా నిధులన్నీ ఖర్చు అవుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా..అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇరిగేషన్‌ రోడ్లకు ఎస్డీఎఫ్‌ నిధులు..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కూడా ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్‌ నుంచి రూ.8,678 కోట్లు ఖర్చు చేసింది. రోడ్ల నిర్మాణం, వాటి అభివృద్ధికి మరో రూ. 1,557 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించింది.

ఈ రెండు పద్దులకు ఎస్సీ, ఎస్టీల ఫండ్‌కు ఉన్న సంబంధమేంటన్న ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర పనుల నిధులన్నింటినీ ఇదే తీరుగా ప్రభుత్వం తమ కోటాలో చూపించడమేంటని దళిత ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇతరత్రా పనులకు వెచ్చించే నిధులకోసం ఎస్డీఎఫ్‌ నుంచి మళ్లించొద్దనీ, దారిమళ్లించిన నిధులను తరువాత బడ్జెట్‌లో కేటాయించాలని వారు పలు మార్లు ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

కాగితాలపైనే లెక్కలు..
2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆరేండ్ల కాలంలో ఎస్సీల అభివృద్ధికి ఎస్డీఎఫ్‌ కింద రూ.69,479 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్సీ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో అమలయ్యే దళితులకు మూడెకరాల భూ పంపిణీ, స్వయం ఉపాధి, రెసిడిన్షియల్‌ పాఠశాలలు, ఫ్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు, పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌ షిప్పులు, ఉచిత విద్యుత్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, అట్రాసిటీ పరిహారం వంటి పథకాలకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది.

ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ గురుకులాలు కొన్ని అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వీటి కోసం ఖర్చు చేసిన నిధులను కూడా స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కింద ప్రభుత్వం లెక్కగట్టింది. ఇది సరికాదన్న విమర్శలు లేకపోలేదు. బీసీ, మైనార్టీల మాదిరిగానే ఎస్సీ ఎస్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారనీ, ఇందుకోసం చేసిన ఖర్చును ప్రత్యేక ఫండ్‌ లెక్కల్లో చూపెట్టడమేంటనీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీల కోసమే స్పెషల్‌గా కేటాయించిన నిధులను ఆ వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా ఇతర వాటికి మళ్లిస్తున్నారంటూ ఆరు నెలలకోసారి జరిగే మానిటరింగ్‌ కమిటీ సమావేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు..

సబ్‌ప్లాన్‌ చట్టం మార్గదర్శకాలకు విరుద్దం..
ప్రగతి పద్దుకింద ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నప్పటికీ బడ్జెట్‌ కేటాయింపులు కాగితాలకు పరిమితమతమయ్యాయి. ఖర్చులో అంతులేని నిర్లక్ష్యం, వివక్ష కొనసాగుతున్నది. ఏడేండ్లలో ఎస్సీ ప్రత్యేకాభివృద్ధికి రూ.85,913 కోట్ల నిధులు కేటాయించగా కేవలం రూ.57,100 కోట్లను మాత్రమే విడుదల చేసింది. అందులో ఖర్చు చేసింది రూ. 47,685 కోట్లు మాత్రమే. ఇరిగేషన్‌, ట్రాన్స్‌పోర్టు రంగాలకు, మూసీనది అభివృద్ధికి తదితర దళితేతరుల అభివృద్ధి పనులకు ఎస్సీల నిధులు దారిమళ్లిస్తున్నారు. ఇది సబ్‌ప్లాన్‌ చట్టం మార్గదర్శకాలకు విరుద్దం..
టి.స్కైలాబ్‌బాబు కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Courtesy Nava Telangana

Leave a Reply