ఆ శిల్పి దృష్టిలో కేసీఆర్‌ దేవుడు!

0
686

యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు చిత్రాలను చెక్కారని ‘శిలలపై సారునే చెక్కినారూ’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాదాద్రిలో కేసీఆర్‌ బొమ్మలేమిటి అంటూ రాజకీయ పార్టీలు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదాద్రిలో ధర్నాలు కూడా చేశారు. దాంతో కింకర్తవ్యం అంటూ ఆలయ, వైటీడీయే అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. చివరికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా శిల్పే చేశాడని తేల్చేశారు. అయినా కేసీఆర్‌, కారు చిత్రాలను చెక్కడం తప్పుకాదని చెప్పారు. తీవ్ర అభ్యంతరాలు వస్తే తొలగించడానికి సిద్ధమనీ అన్నారు.

అందుకే ప్రాకార స్తంభంపై చిత్రాన్ని చెక్కాడు
ఆ మేరకు మాకు ఉత్తరం కూడా రాసి పంపాడు
యాదాద్రిలో శిల్పులకు మేం స్వేచ్ఛ ఇచ్చాం
ముఖ్యమంత్రిపై ప్రేమతోనే బొమ్మ చెక్కారు
ఇలా చేయాలని కేసీఆర్‌ మాకు చెప్పలేదు
కేసీఆర్‌, కారు బొమ్మ చెక్కడం తప్పు కాదు
ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తొలగిస్తాం
కమలం, గాంధీ, నెహ్రూ చిత్రాలూ ఉన్నాయి
కారే కాదు.. సైకిల్‌, ఎడ్లబండి, నాగలి కూడా
కేసీఆర్‌ కిట్‌తో ఎంతోమందికి ప్రయోజనం
చరిత్రను భావితరాలకు చెప్పేందుకే ఇవన్నీ
ఆంధ్రజ్యోతి’ కథనంపై వైటీడీయే వివరణ.

‘‘శిల్పాలు చెక్కేటప్పుడు శిల్పులకు స్వేచ్ఛ ఇచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకున్న ప్రేమాభిమానాలతోనే ఓ శిల్పి ఆయన చిత్రాన్ని చెక్కారు. వారంతా సీఎం గారిని ఒక దేవుడిలా చూస్తున్నారు. ఆయన వల్ల తమ కుటుంబాలు బతుకుతున్నాయని భావిస్తున్నారు. కేసీఆర్‌ను శిల్పి హరిప్రసాద్‌ దేవుడుగా భావించాడు. అందుకే, అష్టభుజి ప్రాకారాలపై ఆయన చిత్రం చెక్కారు’’ అని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి తెలిపారు. ‘కేసీఆర్‌ నాకు దేవుడిగా అనిపించాడు’ అని ఆ శిల్పి లేఖ కూడా ఇచ్చారంటూ దానిని విడుదల చేశా రు. కేసీఆర్‌ బొమ్మపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైతే, దానిని తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘శిలలపై సారునే చెక్కినారూ’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది.

దాంతో, స్థపతి వేలుతో కలిసి కిషన్‌ రావు, ఆనంద్‌ సాయి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఏయే బొమ్మలు చెక్కాలనే విషయాన్ని శిల్పులకు తాము చెప్పడం లేదని, ఎవరూ సూచనలు, సలహాలు ఇవ్వడం లేదని, తమ తమ భావనలకు అనుగుణంగా ప్రేమతో, ఆసక్తితో వాళ్లే చెక్కుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ బొమ్మను చెక్కాలని కూడా ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. యాదాద్రి దేవాలయ ప్రాకారంపై సీఎం కేసీఆర్‌, కారు చిత్రాలను చెక్కడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. చరిత్రను తెలిపేదే దేవాలయమని, భావి తరాలకు చరిత్రను, సమకాలీన అంశాలను చెప్పడం కోసమే వాటిని చెక్కామన్నారు. ఇలా చెక్కకపోతే భావితరాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. ‘‘కారు ప్రత్యేక పార్టీదని చెప్పడం సరికాదు. కేవలం కారు మాత్రమే కాదు.. సైకిల్‌, ఎడ్లబండి తదితరాలు కూడా చెక్కాం. ఈ కాలంలో వీటిని ఉపయోగిస్తున్నారని చెప్పడమే మా ఉద్దేశం. కేసీఆర్‌ సామాజిక సంస్కరణలు చేశారు. దీనిని వ్యక్తిగతంగా తీసుకోరాదు. ఆలయ నిర్మాణాన్ని పెద్ద యజ్ఞంలా చేస్తున్నారు. లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. సామాజిక కోణంలోనే ఆయన చిత్రాన్ని చెక్కడం జరిగింది. అంతే తప్ప, ప్రమోషన్‌ కోసం కాదు’’ అని వివరించారు. ఆలయ ప్రాకారాలపై మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ బొమ్మలు కూడా ఉన్నాయని తెలిపారు. కమలం చిత్రం కూడా చెక్కామని తెలిపారు. యాదాద్రి సప్త గోపురాల్లో 5000 బొమ్మలు ఉంటాయని, ఫలానా బొమ్మను చెక్కాలని సీఎం కేసీఆర్‌ తమకెప్పుడూ ఆదేశాలు ఇవ్వలేదని వివరించారు.

‘‘శిల్పులకు ఎవరూ ఆదేశాలు ఇవ్వరు.. కాలమాన పరిస్థితులను భావితరాలకు తెలియజేసేలా మాత్రమే చెక్కుతారు. నాగరికత, సంస్కృతిని భావితరాలకు శిల్పులు తాము చెక్కిన శిల్పాల రూపంలో తెలియజేస్తారు. గతంలో చిర్ర గోన ఉండేది. ఇప్పుడు లేదు. అలాగే, ఇప్పుడు క్రికెట్‌ ఉంది. 500 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. అందుకే, క్రికెట్‌, బంతిపూలు వంటి వాటిని కూడా చెక్కాం. అహోబిలం, శ్రీశైలం, శ్రీకాళహస్తిల్లోనూ అలనాటి చరిత్రకు సంబంఽధించిన చిత్రాలున్నాయి. యాదాద్రి ప్రాకారాలపై వాస్తు శాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం ప్రకారమే శిల్పాలు చెక్కాం’’ అని వివరించారు. యాదాద్రి పునర్నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దాదాపు ప్రతిరోజూ సమావేశమై చర్చించారని తెలిపారు. తిరుపతి కొండపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉందని గుర్తు చేశారు. చార్మినార్‌ ఒక చరిత్ర అని, అందుకే చెక్కామన్నా రు. కృష్ణ శిలలపై చెక్కిన శిల్పాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, భూకంపాలు వచ్చినా 2000 సంవత్సరాలకుపైగా నిలిచిపోతాయని చెప్పారు. యాదాద్రి పనులను ఒక రాజు అప్పగించినట్లుగానే తాము భావిస్తున్నామన్నారు. అయినా, ఆలయ ప్రథ మ ప్రాకారంలో దేవతా చిత్రాలు మాత్రమే ఉంటాయని, రెండో ప్రాకారం (భక్తుల విశ్రాంతి మండపం)లోనే కేసీఆర్‌ చిత్రాలు చెక్కామని తెలిపారు. ‘‘నాగార్జున సాగర్‌ బుద్ధవనం ప్రాజెక్టులోనూ కేసీఆర్‌ ఫొటో ఉంది. అప్పట్లో ఆయన రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. అప్పుడు అక్కడ కూడా హరిప్రసాద్‌ పని చేశాడు’’ అని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ సామాజిక అంశమని, దానితో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని, అందుకే, దానికి సంబంధించిన బొమ్మ చెక్కామని తెలిపారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ఇచ్చిన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ చిత్రాలను ఎందుకు చెక్కలేదు అన్న ప్రశ్నకు వారు స్పష్టంగా సమాధానమివ్వలేదు.

(Courtacy Andhrajyothi)

Leave a Reply