మౌలిక రంగాల్లో తిరోగమనం

0
297
  • సెప్టెంబరులో -5.2 శాతంగా నమోదు
  • ఏడు రంగాల్లో ప్రతికూల వృద్ధి
  • దశాబ్దకాలంలో ఇదే కనిష్ఠం
న్యూఢిల్లీ: దేశంలోని కీలక మౌలిక పరిశ్రమల వృద్ధి తిరోగమన బాట పట్టింది. సెప్టెంబరు నెలలో ఈ పరిశ్రమలు 5.2 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. దశాబ్దకాలంలో ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఇది ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని తెలియజేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఎనిమిది రంగాల్లోని ఏడు రంగాల ఉత్పత్తిలో ప్రతికూలతే నమోదైనట్టు గురువారంనాడు వెల్లడైన ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఎనిమిది రంగాలు 4.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
కానీ ఈ సెప్టెంబరులో మాత్రం బొగ్గు ఉత్పత్తి (-20.5 శాతం), ముడిచమురు (-5.4 శాతం), సహజ వాయువు (-4.9 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (-6.7 శాతం), సిమెంట్‌ (2.1 శాతం), ఉక్కు (0.3 శాతం), విద్యుత్‌ (-3.7 శాతం) రంగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. కేవలం రసాయనిక ఎరువుల ఉత్పత్తి మాత్రం 5.4 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్యకాలంలో మౌలిక పరిశ్రమ వృద్ధి క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 5.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 2011-12, 2004-05 బేస్‌ సీరి్‌సలో ఇలాంటి తక్కువ స్థాయి వృద్ధి నమోదు కాలేదని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. పారిశ్రామిక మందగమనాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని పేర్కొంది. తాజా గణాంకాల నేపథ్యంలో సెప్టెంబరు నెలకు సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 2.5-3.5 శాతం క్షీణతకు అవకాశం ఉందని ఇక్రా అంచనా వేస్తోంది.
Courtesy Andhra Jyothy..

Leave a Reply