పల్లెల్లో అరకొర వైద్యం

0
86
  • సామూహిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టులు ఖాళీ..
  • డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులకు కొరత
  • సీహెచ్‌సీల్లో 59% స్పెషలిస్టు వైద్యుల లేమి
  • గ్రామీణ వైద్య సేవల వివరాలు వెల్లడించిన కేంద్రం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పల్లె ప్రజలకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో డాక్టర్లు, వైద్య సదుపాయాలకు తీవ్ర కొరత ఉంది. సామూహిక ఆరోగ్య కేంద్రా(సీహెచ్‌సీ)ల్లో స్పెషాలిటీ వైద్యులు 41ు మందే పనిచేస్తుండగా, 59ు ఖాళీలున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ‘‘రూరల్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌ 2020-21’’ నివేదికను విడుదల చేసింది. 2021 జూలై చివరి నాటికి నమోదైన గణాంకాల ఆధారంగా దీనిని రూపొందించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో 83.2ు సర్జన్లు, 74.2ు గైనకాలజిస్టులు, 81.6ు ఫిజీషియన్లు, 81.6ు పిల్లల డాక్టర్ల కొరత ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) 45.1ు ఆస్పత్రుల్లోనే 24 గంటల సేవలందుతున్నాయని పేర్కొంది. దేశంలో 5,480 సీహెచ్‌సీలుంటే 541 కేంద్రాల్లోనే 4 రకాల స్పెషాలిటీ వైద్య సేవలందుతున్నాయని పేర్కొంది.

రాష్ట్రంలో సీహెచ్‌సీల పరిస్థితి ఇలా…
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 85 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో కనీసం నాలుగు స్పెషాలిటీ వైద్య సేవలందించేవి 30 మాత్రమే. ప్రతీ సీహెచ్‌సీకి ఒక సర్జన్‌ ఉండాలి. ప్రస్తుతం 32 మందే ఉండగా, 53 ఖాళీలున్నాయి. సీహెచ్‌సీల్లో 244 గైనకాలజిస్టు పోస్టులుండగా 103 మందే పనిచేస్తున్నారు. 79 ఫిజీషియన్‌ పోస్టులు ఉండగా, 30 మందే పనిచేస్తున్నారు. ఇక చిన్న పిల్లల డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. 217 పోస్టులకుగాను 93 మందే పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంత సీహెచ్‌సీల్లో 625 మంది స్పెషలిస్టు డాక్టర్లు ఉండాలి. ప్రస్తుతం 258 మందే వైద్య సేవలందిస్తుండగా, 367 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 219 అనెస్థీషియాలజిస్ట్‌ పోస్టులకుగాను 93 మంది పనిచేస్తుండగా 126 ఖాళీలున్నాయి. కంటి శస్త్రచికిత్స నిపుణుల పోస్టులు 44 ఉంటే, 25 మంది పనిచేస్తున్నారు. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌(జీడీఎంవో) పోస్టులు 353 ఉంటే, 122 ఖాళీలున్నాయి. రేడియోగ్రాఫర్‌ పోస్టులు 99 ఉంటే, 55 ఖాళీలున్నాయి. 150 ఫార్మసిస్టు పోస్టులకుగాను 66 మందే పనిచేస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 135 ఉంటే, 80 ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ పోస్టులు 1,062 ఉండగా, 890 మంది పనిచేస్తున్నారు. 172 ఖాళీలున్నాయి. 85 సీహెచ్‌సీలకు గాను 53 చోట్లనే ఎక్స్‌రే సేవలందుతున్నాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలా..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 636 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో 314 కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. వీటిలో 1,254 డాక్టర్‌ పోస్టులు ఉండగా, 1,213 మంది పనిచేస్తున్నారు. 636 కేందాల్ర్లో వంద శాతం లేబర్‌ రూమ్‌లు ఉండగా, ఆపరేషన్‌ థియేటర్లు మాత్రం 449 ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. పీహెచ్‌సీల్లో మంజూరైన ఫార్మసిస్టు పోస్టులు 525 ఉంటే, 376 మందే పనిచేస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 638 ఉంటే, 592 మంది పనిచేస్తున్నారు. 1,350 నర్సిం గ్‌ పోస్టులకుగాను 1,186 మంది పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 31,851 మందికి ఒక పీహెచ్‌సీ, 2,38,318 మందికి ఒక సీహెచ్‌సీ ఉంది. సగటున 18 గ్రామాలకు ఒక పీహెచ్‌సీ, 48 పల్లెలకు ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. ఇక, జిల్లా ఆస్పత్రుల్లో 319 మంది వైద్యులకుగాను 266 మందే ఉన్నారు. సబ్‌ డివిజినల్‌ ఆస్పత్రుల్లో 1,421 డాక్టర్‌ పోస్టులుంటే 681 మందే సేవలందిస్తున్నారు. 1,217 పారామెడికల్‌ పోస్టులుంటే, 979 మందే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 4,744 ఏఎన్‌ఎమ్‌ ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 2,449 కేంద్రాలకే శాశ్వత భవనాలున్నాయి. రాష్ట్రంలో ఆయుష్‌ వైద్య పోస్టుల సంఖ్య 394గా ఉంది. ప్రస్తుతం 243 మందే పనిచేస్తునారు. పట్టణ ప్రాంతాల్లో 1.75 కోట్ల జనాభా ఉంది. అందుకు 350 అర్బన్‌ పీహెచ్‌సీలు అవసరం కాగా, కేవలం 227ఉన్నాయి. రాష్ట్రంలో గతఏడాది జూలై చివరినాటికి గ్రామీణ ప్రాంతాల్లో 4,744 సబ్‌ సెంటర్లు, 636 పీహెచ్‌సీలు, 85 సీహెచ్‌సీలున్నాయి.

గిరిజన ప్రాంతాల్లో అరకొర వైద్యం…
రాష్ట్రంలోని గిరిజన పాంతాల్లో 202 పీహెచ్‌సీలు, 19 సీహెచ్‌సీలు, 1,489 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల్లో 854 ఏఎన్‌ఎమ్‌ పోస్టులుండగా, 727 మంది పనిచేస్తున్నారు. గిరిజన జనాభా ప్రాతిపదికన 1,489 మేల్‌ హెల్త్‌ వర్కర్స్‌ పోస్టులు అవసరం. కాగా, 870 ఉన్నాయి. అందులో 531 మందే పనిచేస్తున్నారు. అలాగే 372 మంది డాక్టర్లకుగాను 277 మంది సేవలందిస్తున్నారు. 13 సర్జన్‌ పోస్టుల(సీహెచ్‌సీల్లో)కు గాను ఏడుగురే పనిచేస్తున్నారు. 19 ఫిజీషియన్‌ పోస్టు లు అవసరం కాగా, 9 పోస్టులే మంజూరయ్యాయి. అందులో ఆరుగురే పనిచేస్తున్నారు. ఇక, దేశవ్యాప్తంగా 2005తో పొల్చితే 2021 నాటికి 10,075 సబ్‌సెంటర్లు, 1,904 పీహెచ్‌సీలు, 2135 సీహెచ్‌సీలు పెరిగాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. పీహెచ్‌సీల్లో వైద్యులు 56 శాతం పెరగగా, ఇంకా 4.3 శాతం డాక్టర్ల కొరత ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే సీహెచ్‌సీల్లో 79 శాతం స్పెషలిస్టుల కొరత ఉందని వెల్లడించింది.

Leave a Reply