కరువు రైతుల గోసపై అసెంబ్లీ స్పందిస్తుందా?

0
191

ఎం. రాఘవాచారి

సాగునీరందని తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్నే ప్రశ్నించాలి. జూరాల వివాదాలు లేని తెలంగాణ ప్రాజెక్టు కాదా, కృష్ణ వరదెత్తి తొలుత చేరేది జూరాలకే కదా. తంగిడి నుంచి జూరాలకు చేరేలోగా రోజూ అయిదు టి.ఎం.సి వరద నీరు తీసుకునే విధంగా పాలమూరు-–రంగారెడ్డి పథకం చేపట్టి నీరు తీసుకోవచ్చుగదా. ఈ మాత్రం ఎందుకు తోచలేదు? నడిగడ్డన గట్టు ఎత్తిపోతల ఎందుకు చేపట్టలేదు? ఆర్డీఎస్‌ ఎందుకు బాగు చేయించలేదు? ఇప్పుడు గండ్రేవుల పేరిట తెలంగాణకు నష్టం చేసే పనికి ఎందుకు సహకరిస్తున్నారు? మరణం అంచున ఉన్న చెంచుల జనాభాను కాపాడే తక్షణ చర్యగా చంద్రసాగర్‌ నుంచి అమ్రాబాద్‌ ఎత్తిపోతల ఎందుకు చేపట్టలేదు? బల్మూరు ఎత్తిపోతల ఏమైంది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ కరవు పీడిత ఎగువ ప్రాంత రైతుల జలగోస తీరుతుందనుకున్నాం. గోదావరి నదిని జల సమృద్ధం చేసే ప్రాణహిత ఒడ్డున ఆదిలాబాద్‌ రైతాంగం, భీమా-తుంగభద్ర నదులను కలుపుకుని ప్రవహించే కృష్ణానది ఒడ్డున మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల రైతాంగం కన్నీటి కడగండ్ల నుంచి గట్టెక్కుతుందనుకున్నాం. అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టి, పూర్తిచేసి వలస బతుకులను ఒడ్డుకు చేర్చి స్వీయగౌరవ జీవన విశ్వాసం కాపాడుతుందనుకున్నాం. మనం కలలుగని, పోరాడి, ప్రాణాలర్పించి, మనమే రెండు చేతులూ చాచి నిలిచి ఓట్లేసి అధికారం కట్టబెట్టి మనమే గెలిచినంత సంబరపడ్డాం. మనం తప్పకుండా నీటి ఎద్దడి అనే చిక్కుముడిని విప్పేస్తామనుకున్నాం. కానీ ఉల్టా అయింది. నీళ్లు రాలేదు. నిధులు పోయాయి. రాష్ట్రం ఏర్పడి ఎగువ ప్రాంత రైతులకు కలిగిన మేలేమీ లేదు, నిత్య పోరాటం తప్ప. ఎందుకిట్లా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటవు తూనే ఒక భాగం పనులు పూర్తయిన ప్రాణహిత-చేవెళ్ల పథకం రీడిజైన్‌కు పూనుకుంది. ఈ పథకంలో ప్రాణహిత దగ్గర తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు మొదటి నిర్మాణం కాగా చేవెళ్ల చివరిది. మొదటి, చివరి ప్రాజెక్టులు రెండూ రద్దుచేసి రెండు జిల్లాలకు ద్రోహం చేసి దానికి రీడిజైన్‌ అనే పేరు తగిలించారు. ఈ దెబ్బతో ఆదిలాబాద్‌ జిల్లాలో 1,56,500 ఎకరాల ఆయకట్టు, రంగారెడ్డి జిల్లాలో 2,46,700 ఎకరాల ఆయకట్టు పోయింది. తెలివిగల ఇంజనీర్లెవరైనా ఇలాంటి రీడిజైన్‌ చేయరు. దీంతో గోదావరి నీరు అత్యంత ఎత్తయిన చేవెళ్లకు రాకుండా పోయింది. నల్లగొండ ఎగువ ప్రాంత రైతులకూ నష్టం జరిగింది. నిధుల వ్యయం రాష్ట్రానికి భారమయ్యే స్థాయిలో పెరిగిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్‌ నైపుణ్యాలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా రీడిజైన్‌ చేసిన మరో పథకం పాలమూరు-–రంగారెడ్డి. దీనిని రీడిజైన్‌ చేయడం కాదు, అసలు లక్ష్యాన్ని దెబ్బతీసి, కొత్త ప్రాజెక్టు నమూనా చేసి, ఇదే పాలమూరు-–రంగారెడ్డి పథకం అంటున్నారు. ఒకవేళ ఎవరైనా రీడిజైన్‌ అనుకుంటే దీనిలో మొదటి, చివరి, మధ్య ప్రాజెక్టులను దెబ్బతీశారు. మొదటి మూడు లేకుండాపోయాయి. చివరి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కాగితాల మీద చూపించి, ఆచరణలో పక్కన పడేశారు. ఆరేళ్లుగా అదిగో ఇదిగో అంటున్నారు. ఈ దెబ్బతో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లాలో మర్రిగూడ, చింతపల్లి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని కనీసం పది మండలాల రైతాంగం సాగునీటి ఆశలు వదులుకోవలసిన దుస్థితి కలిగింది. ఈ ఎగువ ప్రాంతమంతా వర్షపాతం సరిగా లేని, భూగర్భంలో నీరింకి ఎడారీకరణ చెందుతూ డార్క్‌ ఏరియాగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత రైతాంగం మీద తొలి తెలంగాణ ప్రభుత్వం నీడలు పరిచింది.

తాను చొరవ చేసి రీడిజైన్‌ చేసిన విధంగానైనా ఈ ఆరేళ్లలో పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇరవై శాతం కూడా పూర్తి కాని పనులలో కూడా నాణ్యత లేదని, చిన్న వానలకే తెగిపోతున్న కట్టలు తెలుపుతున్నాయి. ఈ పథకానికి పాలమూరు-డిండి పేరిట మరో పథకం జోడిం చడంతో ఇది అంతర్గత వివాదాలకు లోనైంది. ఇలా జోడించడం సరికాదని అధికార పార్టీ ప్రతినిధులు రాసిన లేఖను ప్రభుత్వం చెత్తబుట్టలో వేసింది. శ్రీశైలం ప్రాజెక్టు లోపల నుంచి నీరు తీసుకునే లెవల్‌ను 800 నుంచి 820 అడుగులకు పెంచింది. పైన ఎత్తిపోసుకునే వ్యవస్థలుంటే మునుముందు విస్తరించుకునే అవకాశాలుంటాయి. అలా కాకుండా భూగర్భ నిర్మాణాలను చేపట్టాలని అనుమతించింది. ఈ విధానం నష్టమని, బ్లాస్టింగ్‌ వల్ల పక్కన కల్వకుర్తి, మిషన్‌ భగీరథ పథకాలు దెబ్బతింటాయని నిపుణులు ఇచ్చిన నివేదిక పనికిరానిదైపోయి కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా పనులు చేసుకుపోయే దుస్థితి మిగిలింది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వల్ల, పాలమూరు-రంగారెడ్డి పథకం వల్ల భూములు కోల్పోయిన రైతులు మరోసారి పాలమూరు-డిండి వల్ల కూడా భూములు కోల్పోవలసి వస్తుందని ఇలా కోల్పోతున్న భూములు కల్వకుర్తి పథకపు ఆయకట్టు భూములు అని వివరించినపుడు ముఖ్యమంత్రి పాలమూరు-డిండి పథకం పనులు జరగవు అని అసెంబ్లీలో ప్రకటించారు. అయినా ఆ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లే పనులు చేసుకుపోతున్నారా?

ఇదివరలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 25 టి.ఎం.సిల సామర్థ్యంతో చేపట్టారు. అంటే రెండున్నర లక్షల ఎకరాల ఆరుతడి ఆయకట్టు కోసం, కొత్త ఆయకట్టు కోసం ఈ ఆరేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించనందువల్ల, కొద్ది రోజులు ఎత్తిపోసి కాలువలు పారించి పాత చెరువులు నింపటం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. పూర్తయిన కల్వకుర్తి పథకం సామర్థ్యం పెంచకుండానే ఆయకట్టు నాలుగున్నర లక్షలకు పెంచారు కదా, ఒక్క రిజర్వాయరు కూడా కట్టకుండా నీరెట్లా ఇస్తారంటే జవాబు లేదు. పాలమూరు-డిండి పథకం రిజర్వాయర్లు ముందు కట్టేస్తున్నారు. ఉల్పర, సింగరాజుపల్లి, గోకారం, ఇర్విన్‌, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రైతుల పట్ల వివక్ష కాదా? నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పథకాల పరిస్థితి కూడా ఇదే. ఈ పథకాల సామర్థ్యం, స్థాయి పెంచవలసిన అవసరాన్ని సమీక్షించలేదు. భీమాను రెండు భాగాలుగా విభజించినందువల్ల, పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని మొత్తంగా దిగువకు మార్చినందువల్ల మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గం, వికారాబాద్‌, రంగా రెడ్డి జిల్లాలకు బీడవడమే మిగిలింది. జిల్లాలోని పాత పథకాలను 30 వరద రోజులలో తీసుకునే విధంగా రీడిజైన్‌ చేయాలనే వినతులు ప్రభుత్వానికి ఎక్కలేదు. ప్రతిపక్షాలకు ఈ అన్యాయం అర్థం కాలేదు. ఆర్డీఎస్‌ దుస్థితి మార లేదు. తెరాస హామీలు ఎండమావుల్లో నీటి తీరయ్యాయి.

ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌తో వ్యయం పెరిగినంతగా ప్రయోజనం రాదని, కాళేశ్వరం పథకం ఆదిలాబాద్‌కు నష్టమని నిరూపణ అయిన తరువాత కూడా ప్రభుత్వం ఆదిలాబాద్‌ ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు మరొక టి.ఎం.సి నీరు లిఫ్టు చేయడానికి పైపులైన్‌ విధానం పేరిట కొత్త దోపిడీకి తెరతీసింది. ఇప్పుడీ ప్రతిపాదన ఆపేసి తుమ్మిడిహెట్టి నిర్మాణం చేపట్టి ఆదిలాబాద్‌ సాగునీటి అవసరం తీర్చాలని, అటునుంచి ఎల్లంపల్లికి నీరు తెచ్చి వృథా వ్యయం తగ్గించాలని రైతాంగం డిమాండ్‌ చేస్తోంది. అలాగే తూర్పువైపు మార్చిన పాలమూరు–-రంగారెడ్డి పథకాన్ని కల్వకుర్తి పథకంలో భాగం చేసి తూర్పు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు నీరివ్వాలని, యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుండి ఎత్తిపోసే పని లేకుండా, గోదావరి నీటిని డిండి దాకా గ్రావిటీతో తరలించి నల్లగొండ ఎగువ ప్రాంత రైతాంగానికి నీరిచ్చి ఆయకట్టు భూముల ముంపు నివారించి జిల్లాల మధ్య చిచ్చు పెట్టకుండా ప్రభుత్వం విజ్ఞతతో నడుచుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం అవగాహనా రాహిత్యంతో గోదావరి నీరు సాగర్‌కు, అటునుండి శ్రీశైలానికి తరలిస్తామని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని మాట్లాడింది. తన రైతాంగపు సాగునీటి అవసరాలు తీర్చలేక కబుర్లతో కాలయాపన చేస్తూ, తెలంగాణ స్వీయ గౌరవ ఆకాంక్షను అపహాస్యం చేసిన ఈ ప్రకటనలు, సాగిన చర్చలు, సమావేశాలు తెలంగాణకు అవమానమే మిగిల్చాయి. ఈ పరిస్థితులే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పోతిరెడ్డిపాడు విస్తరణకు పురికొల్పాయి.

ఆరేళ్ల పాటు కృష్ణా నది నీటి వినియోగ సమస్యను, దక్షిణ తెలంగాణ సాగునీటి సమస్యను పట్టించుకోకుండా ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బహుశా కృష్ణానది మీద ఉన్నన్ని వివాదాలు ప్రపంచంలో మరే నది మీదా లేవు. 1995 లోనే కృష్ణానది నీటిలో మాకు న్యాయం చేయకపోతే మలి దశ తెలంగాణ ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ అప్పటి ముఖ్యమంత్రి రామారావుకు బహిరంగ లేఖ రాసి ఉద్యమం ప్రారంభించాం. ఈ ఉద్యమంలో రాగుల రాంరెడ్డి అమరులయ్యారు. అమరులు కె.జయశంకర్‌, ఆర్‌.విద్యాసాగర్‌ గార్లు కృష్ణా నది నీటి పంపిణీలో అన్యాయం అంటే- మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు జరిగిన అన్యాయం అని తెలంగాణను చైతన్యపరిచారు. తెలంగాణ వస్తేనే న్యాయం జరుగుతుందని తెరాస నేతలు అన్ని వేదికలనూ ఉపయోగించుకున్నారు. అధికారం చేపట్టి ఆరేళ్లయినా ఆ అన్యాయంలో మార్పు లేదు.

ఇపుడు సాగునీరందని తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్నే ప్రశ్నించాలి. జూరాల వివాదాలులేని తెలంగాణ ప్రాజెక్టు కాదా, కృష్ణ వరదెత్తి తొలుత చేరేది జూరాలకే కదా. తంగిడి నుంచి జూరాలకు చేరేలోగా రోజూ అయిదు టి.ఎం.సి వరద నీరు తీసుకునే విధంగా పాలమూరు–-రంగారెడ్డి పథకం చేపట్టి నీరు తీసుకోవచ్చుగదా. ఈ మాత్రం ఎందుకు తోచలేదు? నడిగడ్డన గట్టు ఎత్తిపోతల ఎందుకు చేపట్టలేదు? ఆర్డీఎస్‌ ఎందుకు బాగు చేయించలేదు? ఇప్పుడు గండ్రేవుల పేరిట తెలంగాణకు నష్టం చేసే పనికి ఎందుకు సహకరిస్తున్నారు? మరణం అంచున ఉన్న చెంచుల జనాభాను కాపాడే తక్షణ చర్యగా చంద్రసాగర్‌ నుంచి అమ్రాబాద్‌ ఎత్తిపోతల ఎందుకు చేపట్టలేదు? బల్మూరు ఎత్తిపోతల ఏమైంది? పాత ఎత్తిపోతల పథకాల స్థాయి, సామర్థ్యం వరద నీటి లభ్యతకు అనుగుణంగా ఎందుకు అభివృద్ధి పరచలేదు? లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు రియల్టర్ల ప్రయోజనాల కోసమే చేపట్టలేదా? నిధులన్నీ కాళేశ్వరం పేరిట తరలిస్తుంటే, ఆదిలాబాద్‌ ఆగమైపోతుంటే, దక్షిణ తెలంగాణ గతం కన్నా నష్టపోతుంటే అధికార, ప్రతిపక్ష గత, వర్తమాన నేతలందరూ ఏం చేస్తున్నారు? బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం పోయింది. యాదృచ్ఛికమే కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది. ఈ ప్రాంతానికి జరిగిన నష్టం తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీరుస్తాడనుకున్న ప్రజలకు నష్టమే ఎందుకు మిగిలింది? ఈ ప్రశ్నలన్నింటినీ ‘తెలంగాణ ప్రజా అసెంబ్లీ’ చర్చించింది. తెరాస నేతృత్వంలోని అసెంబ్లీ చర్చిస్తుందా? సమస్యలు తీరుతాయా? ప్రశ్నలు పెరుగుతాయా? ఎవరు జవాబు చెబుతారు?

పాలమూరు అధ్యయన వేదిక

Leave a Reply