గ్రేస్‌ అనాథాశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపులు

0
74
  • రంగంలోకి పోలీసులు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు
  • నలుగురు నిందితుల అరెస్టు
  • కూకట్‌పల్లి మైత్రి ఆశ్రమంలో చిన్నారులతో మసాజ్‌!
  • తండ్రీకొడుకులను అరెస్టు చేసిన పోలీసులు
  • రెండు ఆశ్రమాల మూసివేత.. స్టేట్‌హోంకు బాలికలు
  • రెండు ఆశ్రమాలను మూసివేసిన అధికారులు
  • స్టేట్‌హోంకు బాలికల తరలింపు

    హైదరాబాద్‌ సిటీ/నేరేడ్‌మెట్‌ : బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనను మరవక ముందే.. మతం మాటున కొనసాగుతున్న ఓ అనాథాశ్రమంలో లైంగిక వేధింపులు, మరో చిల్డ్రన్‌హోంలో బాలికలతో బాడీ మసాజ్‌లు చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు, పోలీసులు నిందితుల ఆటను కట్టించారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నేరెడ్‌మెట్‌లోని జేజేనగర్‌లో ఉన్న గ్రేస్‌ అనాథాశ్రమంలో 14-15 ఏళ్ల మధ్య వయసుగల 34 మంది బాలికలు ఉన్నారు. వీరిపై కొంతకాలంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. విషయాన్ని బటయకు పొక్కనీయకుండా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం రాత్రి ముగ్గురు బాలికలపై లైంగిక దాడి జరిగిందంటూ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో.. నేరెడ్‌మెట్‌ పోలీసులు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు గ్రేస్‌ ఆశ్రమానికి చేరుకుని, విచారణ చేపట్టారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆశ్రమంలోని మిగతా బాలికలను నింబోలిఅడ్డాలోని స్టేట్‌ హోంకు తరలించారు.

    కూకట్‌పల్లి ఆశ్రమంలో అకృత్యాలు

    కూకట్‌పల్లి కేబీహెచ్‌బీ కాలనీలోని మైత్రి చిల్డ్రన్స్‌ హోమ్‌లో బాలికలపై అకృత్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు దాడులు నిర్వహించి.. నిర్వాహకుడు బీఎల్‌ నర్సింహారావు, అతని కుమారుడు ప్రణీత్‌కుమార్‌లను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మైత్రి చిల్డ్రన్స్‌ హోంలో బాలికలతో వీరిద్దరూ బాడీ మసాజ్‌లు చేయించుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా.. హోంలోని బాలికలతో బాత్‌రూంలను శుభ్రపరచడం, కూరగాయలు తరగడం, గదులను శుభ్రం చేయడం వంటి పనులను చేయించుకుంటున్నారు. ఆ పనులు చేసేందుకు చిన్నారులు నిరాకరిస్తే.. బెల్టుతో కొడుతున్నారు. ఫిర్యాదు అందుకున్న చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు బాలరక్షక్‌ భవన్‌ కో-ఆర్డినేటర్‌ బి.నాగమణి, పీవో ఎన్‌ఐసీ నాగమధు, సఖీ సెంటర్‌ అడ్మిన్‌ నిత్యూష, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ టీమ్‌ సభ్యులు ప్రశాంత్‌, స్వప్న హోమ్‌ను సందర్శించారు. చిన్నారుల వాంగ్మూలం తీసుకున్నారు. తమకు అందిన ఫిర్యాదు నిజమేనని గుర్తించి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడిచేసి, నర్సింహారావు, ప్రణీత్‌లను అరెస్టు చేశారు. వారిపై జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆశ్రమంలో ఉన్న 50 మంది బాలికలను నింబోలిఅడ్డాలోని స్టేట్‌హోంకు తరలించారు. గ్రేస్‌ అనాథాశ్రమం, మైత్రి చిల్డ్రన్‌హోంలను మూసివేస్తున్నట్లు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులు ప్రకటించారు.

    • విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
    • అరెస్టు చేసిన పోలీసులు
    • సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ స్కూలులో ఘటన

    సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసి జైౖలుకు పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఓ ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఉపాధ్యాయుడి వేధింపులకు భయపడి ఆ చిన్నారి ఇటీవల జరిగిన పరీక్షకు కూడా హాజరుకాలేదు. తమ కుమార్తె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు సంగారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీంతో శనివారం రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి ఉ పాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేస్తూ మంగళవారం ఎస్‌ఎ్‌ఫఐ, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు తోటి విద్యార్థులు ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది.

Leave a Reply