- గుండెపోటుతో షేన్ వార్న్ హఠాన్మరణం
- థాయ్‌లాండ్‌లోని విల్లాలో అచేతన స్థితిలో..
- ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం శూన్యం
- అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు విశేష ప్రతిభ
- టెస్టుల్లో 708, వన్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు
అతడి బంతి అనూహ్యం! ఎటు నుంచి ఎటు వస్తుందో ఎవరికీ తెలియదు! లెగ్ సైడ్ నుంచి వచ్చి ఆఫ్ వికెట్‌ను గిరాటేసేస్తుంది! పాములా మెలికలు తిరుగుతూ వికెట్లను చుట్టేస్తుంది! ఆ మణికట్టు మంత్రంతోనే అతడు వెయ్యి మందికిపైగా క్రికెటర్లను పెవిలియన్‌కు పంపాడు! అంత గొప్ప ప్రతిభతో అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజంగా పేరొందిన షేన్ వార్న్ 52 ఏళ్లకే అనూహ్యంగా ప్రపంచం నుంచి నిష్క్రమించాడు! విజయాలతో పాటు వివాదాలనూ కేరాఫ్‌గా మార్చుకున్న స్పిన్ మాంత్రికుడు క్రికెట్ అభిమానులను దిగ్ర్భాంతికి గురి చేస్తూ.. మరలి రాని లోకాలకు తరలిపోయాడు!
చేతినే మంత్రదండంలా వాడుతూ.. బంతిని బొంగరంలా గింగిరాలు తిప్పుతూ.. మేటి బ్యాట్స్‌మెన్‌కూ గుండెల్లో గుబులు రేపి.. కళాత్మక లెగ్ స్పిన్‌కు ప్రాణ ప్రతిష్ఠ చేసి.. అటాకింగ్ శైలితో క్రికెట్ ప్రపంచానికి గ్లామర్ తీసుకొచ్చిన షేన్ వార్న్ (52) ఇక లేడు. స్పిన్ మెజీషియన్‌గా పేరుగాంచిన ఈ ఆస్ట్రేలియా దిగ్గజం గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం థాయ్‌లాండ్‌లోని కోసామ్యూయ్‌లో ఉన్న తన విల్లాలో వార్న్ అచేతనంగా పడి ఉండగా.. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణం దక్కలేదు. వార్న్ గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ‘‘ఆల్‌టైమ్ గ్రేట్’’లలో ఒకడైన వార్న్ అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచం, అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ప్రస్తుతానికి తమ వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వార్న్ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అతడి కుటుంబం తెలిపింది. వార్న్ అసలు పేరు షేన్ కీత్ వార్న్. 1969 సెప్టెంబరు 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జన్మించాడు. 23 ఏళ్ల వయసులో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. 1992లో టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా ఆ సిరీ్‌సలో భాగంగా జరిగిన మూడో టెస్టుతో వార్న్ అంతర్జాతీయ ప్రస్థానం మొదలైంది. కానీ, తొలి మ్యాచ్‌లో వార్న్‌కు చేదు అనుభవమే మిలిగింది. 150 పరుగులిచ్చిన అతడు ఒక్క వికెట్‌ను మాత్రమే పడగొట్టగలిగాడు. ఆ వికెట్.. మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రవిశాస్త్రి (206) కావడం విశేషం. అయితే, తదుపరి సిరీస్ నుంచి వార్న్ ప్రభ మొదలైంది.
వార్న్ స్పిన్ కింగ్
1960, 70 దశకాల్లో స్పిన్ బౌలింగ్ అంటే భారత క్రికెట్ జట్టు గుర్తుకు వచ్చేది. ఆ తర్వాత రెండు దశాబ్ధాలపాటు ఈ విభాగంలో ఎవరూ పెద్దగా ఆకట్టుకున్నది లేదు. కానీ పేసర్లు రాజ్యమేలుతున్న వేళ తన సుడులు తిరిగే బంతులతో ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు 1992లో షేన్ వార్న్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 15 ఏళ్లపాటు లెగ్ స్పిన్ దిగ్గజంగా అజరామర కీర్తి పొందాడు. సమకాలీకుడు మురళీధరన్‌తో కలిసి ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వార్న్.. 52 ఏళ్ల వయస్సులోనే లోకాన్ని వీడతాడన్నది ఎవరూ ఊహించని విషయం. అతడి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను ఓ గుర్తు చేసుకుంటే..
శతాబ్దపు బంతి
1993 యాషెస్ సిరీ్‌సలో మైక్ గ్యాటింగ్‌ను వార్న్ అవుట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. తొలి టెస్టు రెండో రోజున వార్న్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాగా మొదటి బంతికే దిమ్మ తిరిగేలా చేశాడు. లెగ్ స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని ఆఫ్ స్టంప్ వికెట్‌ను గిరాటేయడంతో గ్యాటింగ్‌కు ఒక్కసారిగా బుర్ర పనిచేయలేదు. చూసిన ప్రేక్షకులకు సైతం ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. అందుకే ఆ బంతిని ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా పేర్కొంటారు. ఆరు టెస్టుల ఈ సిరీ్‌సలో వార్న్ 34 వికెట్లు పడగొట్టడం విశేషం.
1999 వన్డే వరల్డ్‌కప్
ఈ మెగా టోర్నీలో అత్యధికంగా 20 వికెట్లు తీసిన షేన్ వార్న్ ఒంటి చేత్తో జట్టుకు టైటిల్‌ను అందించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ అయితే గ్రేటెస్ట్ క్లైమాక్స్‌గా పేరు తెచ్చుకుంది. ఆరంభంలో ఆసీస్ 213 పరుగులే చేయడంతో ఛేదనలోనూ సఫారీలు జోరుగా కనిపించారు. ఈ దశలో బంతి చేతికి తీసుకున్న వార్న్.. వరుస ఓవర్లలో కిర్‌స్టెన్, గిబ్స్, క్రోనేల వికెట్లు తీయడంతో పూర్తిగా తడబడి, చివరి ఓవర్‌లో డొనాల్డ్ రనౌట్‌తో ఓటమి పాలైంది.
2006 యాషెస్ సిరీస్
డ్రాగా ముగియాల్సిన రెండో టెస్టును వార్న్ తన మేజిక్‌తో ఆసీస్ వశం చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 551, ఆసీస్ 513 పరుగులు చేశాయి. ఇకవికెట్ నష్టపోయి 38 పరుగుల ఆధిక్యంతో ఉన్న ఫ్లింటాఫ్ సేన ఆఖరి రోజున బరిలోకి దిగింది. చేతిలో తొమ్మిది వికెట్లుండడంతో ఎలాగూ రోజంతా ఆడేస్తారు.. ఫలితం తేలదని అంతా భావించారు. కానీ వార్న్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 129 రన్స్‌కే కుప్పకూల్చాడు. దీంతో 168 పరుగుల చేధనను ఆసీస్ సునాయాసంగా ముగించి ఆరు వికెట్లతో గెలిచింది.
వివాదాలకు కేరాఫ్..
షేన్ వార్న్.. నిస్సందేహంగా దిగ్గజ క్రికెటర్. ఆటతో అతడు ఎంతగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించాడో, తన వివాదాలతో అంతే ప్రసిద్ధి గాంచాడు. ఆ వివాదాలలో ముఖ్యమైనవి కొన్ని..
బుకీతో సంబంధాలు: శ్రీలంక పర్యటన సంద ర్భంగా 1994లో మార్క్ వాతో కలిసి పిచ్, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వివరాలను భారత బుకీ ఒకరికి అందజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
డోపింగ్‌లో దొరికి..: 2003 వరల్డ్‌కప్‌నకు ముందు నిషిద్ధ ఉత్ర్పేరకం తీసుకొన్నట్టు తేలడంతో వార్న్‌పై ఏడాది నిషేధం విధించారు. శరీరం సమతుల్యంగా ఉండేందుకు తాను డ్రగ్స్ వాడినట్టు వార్న్ అంగీకరించడం గమనార్హం. నిషేధకాలంలో అతడు కామెంటేటర్‌గా వ్యవహరించాడు.
స్టీవ్ వాతో..: వెస్టిండీ్‌సలో 1993 టూర్ సందర్భంగా మూడో టెస్ట్ నుంచి అప్పటి కెప్టెన్ స్టీవ్ వా తనను తప్పించినప్పటినుంచి వార్న్ అతడిపై కక్ష పెంచుకున్నాడన్న ఆరోపణలు వినిపించాయి. సందర్భం వచ్చినప్పుడల్లా స్టీవ్‌పై విమర్శలు గుప్పించే వార్న్ అతడు అత్యంత స్వార్థపూరిత క్రికెటర్ అని దుయ్యబట్టాడు.
బ్రిటిష్ నర్స్‌తో అసభ్యంగా..: 2000 సంవత్సరంలో ఓ బ్రిటిష్ నర్స్‌కు వార్న్ అసభ్య మెసేజ్‌లు పంపడం తీవ్ర వివాదాస్పదమైంది. ఫలితంగా అతడు ఆస్ట్రేలియా జట్టు వైస్‌కెప్టెన్సీ కోల్పోయాడు. బ్రిటన్ విద్యార్థిని లారా సాయర్స్‌ను గ్రూపు సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా వార్న్ ఒత్తిడి చేశాడన్న ఆరోపణలు పెను దుమారం రేపాయి. ఇంకా..భార్యతో విడాకులు, పలువురు మహిళలతో అఫైర్లు, లండన్ నైట్‌క్లబ్ వద్ద మహిళపై దాడి వంటి చర్యలతో వార్న్ నిత్యం వార్తల్లో నిలుస్తుండేవాడు.
వార్న్.. ఎప్పటికీ లెజెండ్
షేన్ వార్న్ హఠాన్మరణం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. వార్న్ మృతిపై పలువురు ప్రముఖులు ఇలా స్పందించారు. ‘నమ్మలేకపోతున్నా. బాధగా ఉంది. మైదానం వెలుపల కానీ, బయట కానీ, నీవు పక్కన ఉంటే ఒక్క క్షణం కూడా నిస్తేజంగా ఉండదు. మైదానంలో మన మధ్య జరిగిన పోటీ.. వెలుపల మన మధ్య చోటు చేసుకున్న అనేక సరదా సంగతులు ఒక నిధిలా ఎప్పటికి నిలిచిపోతాయి. భారతీయుల హృదయాల్లోనూ నీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్న వయసులోనే విడిచి వెళ్లిపోయావు’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ‘వార్న్ మృతి క్రికెట్‌కు తీరని లోటు’ అని వీవీఎన్ రిచర్డ్స్.. ‘మాటలు రావడం లేదు. నీవు నిజమైన చాంపియన్, లెజెండ్’ అని రోహిత్ శర్మ.. ‘నేను లెగ్ స్పిన్ నేర్చుకుంది నీ స్ఫూర్తితోనే వార్న్’ అని చాహల్.. ‘వార్న్ వికెట్ తీసినప్పుడల్లా.. క్రికెట్ ఆట మరో టర్న్ తీసుకునేది’ అని వసీం జాఫర్.. ‘నిన్ను చూసే నేను స్పిన్నర్‌ని కావాలనుకున్నా’ అని అమిత్ మిశ్రా ట్వీట్ చేశారు.
Courtesy Andhrajyothi