ఎలుకల దాడిలోనే పాప సత్యశ్రీ మృతి
- ముఖమంతా గాయాలైనా.. ఏమీ లేవంటూ పోస్టుమార్టం నివేదిక
- మరో శిశువుకు తెగిపోయిన ముక్కు
- ఈఏడాది 9మంది మృతిపై అనుమానాలు
శిశు విహార్‌లో చిన్నారుల మరణాలకు కారణం ఏమిటి? ఈ ఏడాది ఇప్పటిదాకా 9మంది చిన్నారులు ప్రాణాలు విడిచారంటే అది అంత తేలికైన విషయమేమీ కాదు. వారంతా తిండి లేక ఆకలితో అలమటించారా? సమయానికి వైద్య చికిత్స అందలేదా? లేదంటే వసతుల లేమినా? ఇవన్నీ ఎంతో కొంత కారణమే! వీటికన్నా దిగ్భ్రమ కలిగించే ఘోరం ఏమిటంటే అక్కడ పిల్లలు ఎలుకల బారిన పడి మరణిస్తున్నారు. హైదరాబాద్ యూసు్‌ఫగూడలోని శిశు విహార్.. చిన్నారులకు ఏమాత్రం సురక్షితంగా లేకపోగా.. వారిపాలిట మృత్యుకేంద్రంగా మారిన వైనం ఆంధ్రజ్యోతి పరిశోధనలో తేలింది! జూలై 14న ఒకే రోజు నిత్య, సత్యశ్రీ (9నెలలు) అనే పిల్లలు చనిపోయారు. ఇద్దరిలో సత్యశ్రీ ఎలుకలు కొరకడంతోనే ప్రాణాలు కోల్పోయింది. సత్యశ్రీ మృతదేహం ఫొటో చూస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ చిన్నారి ముఖమంతా ఎలుక కొరికిన గాయాలే ఉన్నాయి. కుడి చెంపకు లోతుగా గాయమైతే.. ముక్కు దాదాపుగా లేదు.
వైద్యులకు గాయాలు కనిపించలేదా?…తీవ్రంగా గాయపడిన సత్యశ్రీని మొదట నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులు అక్కడ చికిత్స పొందిన తర్వాత పాప చనిపోయింది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసిన ఎవరికైనా పాప ముఖానికి అయిన గాయాలు కనిపిస్తాయి. అయితే.. శిశువిహార్‌లోని అధికారులకు గానీ.. నిలోఫర్ వైద్యులకు గానీ గాయాలేవీ కనిపించలేదు. పైగా పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ వైద్యులు కూడా పాపకు ఎలుక కొరికిన గాయాలను దాచారు. ఊపిరితిత్తుల వ్యాధితో పాప మృతిచెందిందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. అలాగే, నిత్య అనే పాప అనుమానాస్పదంగానే మృతిచెందింది. లింగంపల్లికి చెందిన దంపతులు నిత్యను నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తించి శిశువిహార్‌కు తరలించారు. తర్వాత రెండ్రోజులకే పాప చనిపోయింది. తలకు బలమైన గాయం కావడం వల్లే పాప చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది.
ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిందే,….జూలై 28న సంగారెడ్డి నుంచి అప్పుడే పుట్టిన పసిగుడ్డును శిశువిహార్‌కు తరలించగా.. మరుసటి రోజే ఎలుకలు దాడి చేశాయి. ముక్కు పూర్తిగా కట్ అయింది. నిలోఫర్‌లో చికిత్స అందించారు. ఆ బాబుకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు తెలిసింది.
Courtsey Andhrajyothi…