మంచి తిండి పెట్టడం లేదు..

0
237
మంచి తిండి పెట్టడం లేదు..

సియాచిన్‌, లడక్‌, డొక్లాంలలో సైనికుల పరిస్థితి దారుణం
చలిని తట్టుకునే దుస్తులు, బూట్లు లేవు

న్యూఢిల్లీ : అత్యంత సంక్లిష్ట వాతావరణం నెలకొని ఉండే సియాచిన్‌, లడక్‌, డొక్లాంలలో విధులు నిర్వర్తిస్తున్న మనదేశ సైనికులకు సరైన ఆహారం సైతం ఇవ్వటం లేదని ‘కాగ్‌’ (కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌) తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు..ఎముకలు కొరికే చలిని తట్టుకొనే ప్రత్యేక దుస్తులు, బూట్లు, ప్రత్యేకమైన కండ్లద్దాలు సరిపడినన్ని లేక అక్కడి సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నివేదిక పేర్కొన్నది. ఆహారం విషయంలో వారికి కేటాయించిన మేరకు (రేషన్‌) సరఫరా కావటం లేదని తేలింది. బడ్జెట్‌ సమావేశాల్లో కాగ్‌ నివేదిక తాజాగా పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. సైనికులకు విధిగా ఇవ్వాల్సిన వివిధ రకాల వస్తువుల విషయంలో పెద్ద ఎత్తున కొరత ఉందని, ఆర్మీ ప్రధాన కార్యాలయాల్లోనే ఈ కొరత 24 నుంచి 100శాతం వరకు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. ” అత్యవసర పరిస్థితి ఏర్పడితే…ఎలా అన్న ఆలోచన లేదు. రీసైకిల్‌ చేసిన బూట్లను ఇస్తున్నారు.

వీటిని ధరించిన సైనికులు మైనస్‌ 55 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పనిచేయాల్సి వస్తున్నది. కారణం నాణ్యమైన బూట్లు నవంబరు 2015 నుంచి సెప్టెంబరు 2016 వరకు సరఫరా చేయలేదు” అని నివేదికలో తెలిపారు. సముద్రమట్టానికి ఎంతో ఎత్తులో మంచుతో కప్పేసిన ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు సైనికులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందుగా వాతావరణం నుంచి తమను తాము కాపాడుకోవాలి. సూర్యుడు నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి చూపును దెబ్బతీయకుండా ప్రత్యేక కండ్లద్దాలు అవసరం. శక్తినిచ్చే ఆహారం కావాలి. ఇవేవీ వారికి దక్కాల్సినమేరకు దక్కటం లేదని కాగ్‌ నివేదిక తెలిపింది.

Courtesy Nava Telangana

Leave a Reply