ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం

0
226
పొలం బాట ఆక్రమణపై ఆక్రందన

బోధన్‌ ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సంఘటన

ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం

బోధన్‌, న్యూస్‌టుడే: తాము పొలానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకున్నారంటూ ఆరుగురు కర్షకులు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజావాణికి వచ్చిన రైతులు కార్యాలయం బయట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. పోలీసులు వారి నుంచి సీసాలు లాక్కుని రక్షించారు. ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం పెంటాఖుర్దు గ్రామానికి చెందిన 20 మంది రైతులకు కోటగిరి మండలం వల్లభాపూర్‌ శివారులో సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నిజాంసాగర్‌ ప్రధాన కాలువ గట్టు పక్క నుంచి వీరు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటారు.

ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం
రెండు నెలల కిందట శ్రీనివాసరెడ్డి, వీరన్న, సాయిపటేల్‌ కాలువ గట్టుపై గేటు బిగించి తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గేటు తొలగించాలని తాము విజ్ఞప్తి చేస్తుండగా ఈ మార్గంతో సంబంధం లేదని కాగితంపై తమ సంతకాలు తీసుకున్నారని వాపోయారు. కాలువ గట్టు మొత్తాన్ని ఆక్రమించుకొని మొక్కజొన్న వేశారని, ఎమ్మెల్యే షకీల్‌కు విషయం తెలపగా ఆయన ఆదేశాల మేరకు సర్వేయర్‌, ఆర్‌ఐ వచ్చి గేటు తీసేయాలని వారికి సూచించినట్లు పేర్కొన్నారు. అయినా ఫలితం లేదని 20 మంది ప్రజావాణికి వచ్చారు. వారితో కుటుంబ మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. రెండు సీసాల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రైతులు నయీం, సలీం, అఫ్సర్‌, ఈసా, గోరీబీ, జనార్దన్‌రావులు ఒంటిపై పోసుకొన్నారు. పక్కనే ఉన్న పోలీసులు వచ్చి సీసాలు లాక్కున్నారు. వారిపై నీటిని చిమ్మారు. అనంతరం ఆర్డీవో గోపీరామ్‌ వద్దకు తీసుకెళ్లారు. నిజానిజాలు విచారించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్‌ గఫార్‌మియాను క్షేత్ర పరిశీలనకు పంపారు. ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశామని పట్టణ సీఐ రాకేశ్‌ తెలిపారు.

Courtesy Eenadu

Leave a Reply