మారణహోమం

0
25
  • ఆరుగురిని బలి తీసుకున్న పాత పగ
  • ఒక్కొక్కరినీ నరుకుతూ పోయిన ఉన్మాదం
  • మృతుల్లో 6నెలల చిన్నారి, 63 ఏళ్ల వృద్ధుడు
  • కుమార్తెతో వివాహేతర సంబంధంపై కక్ష
  • ఊరు వదిలిపోయినా చల్లారని పగ
  • అతనే వచ్చాడనుకుని కత్తితో వీరంగం
  • ఇల్లంతా తిరుగుతూ ఒక్కొక్కరిగా నరికివేత
  • విశాఖ జిల్లాలో చిందిన నెత్తురు

మనిషి మృగంగా మారాడు! మారణ హోమం సృష్టించాడు. గతంలో తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతో… ఒక యువకుడి కుటుంబ సభ్యులందరినీ వరుసబెట్టి నరికాడు. ఆరు నెలల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు… ఆ ఇంట్లో కనిపించిన వారందరిపైనా కత్తివేటు వేశాడు. మొత్తం ఆరుగురిని బలిగొన్నాడు.

విశాఖపట్నం/పెందుర్తి : మనిషి మృగంగా మారాడు! మారణ హోమం సృష్టించాడు. గతంలో తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతో… ఒక యువకుడి కుటుంబ సభ్యులందరినీ వరుసబెట్టి నరికాడు. ఆరు నెలల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు… ఆ ఇంట్లో కనిపించిన వారందరిపైనా కత్తివేటు వేశాడు. మొత్తం ఆరుగురిని బలిగొన్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం… విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు (45)కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి ఇంటికి ఎదురుగా బమ్మిడి విజయ్‌ (32) కుటుంబం నివసించేది. విజయ్‌ ఆటో డ్రైవర్‌. అతనికీ, అప్పలరాజు కుమార్తెకు వివాహేతర సంబంధం ఉండేది. విజయ్‌కి అప్పటికే పెళ్లయి ఒక కుమారుడున్నాడు. ఇలాంటి సంబంధాలు సరికాదని అప్పలరాజు ఇద్దరినీ మందలించాడు. ఇంకా మారకపోవడంతో 2018లో విజయ్‌పై తన కుమార్తెతో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో అత్యాచారం కేసు పెట్టించాడు.

తన కుమార్తెకు మత్తుమందు ఇచ్చి 8నెలలుగా అత్యాచారం చేస్తున్నాడంటూ విజయ్‌పైనా… వారిద్దరూ సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఫొటోలు చూపించి బెదిరిస్తున్నారంటూ అతని భార్య ఉషారాణితోపాటు పలువురిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విజయ్‌ని అరెస్టు చేయగా ఆయన బంధువులు రాజీ ప్రయత్నాలు చేశారు. విజయ్‌ ఊరొదిలి వెళ్లిపోవాలని, లేకుంటే చంపేస్తానని అప్పలరాజు తేల్చిచెప్పాడు. దీంతో విజయ్‌ జైలునుంచి బయటకు రాగానే కుటుంబంతో విజయవాడ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆయన తండ్రి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నాడు. అప్పటికీ… అప్పలరాజు కోపం చల్లారలేదు. విజయ్‌ కనిపిస్తే చంపేస్తానని తరచూ అనేవాడు.

ఎన్నికలప్పుడు వచ్చి…
పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో విజయ్‌, ఆయన భార్య ఉషారాణి (30), కుమారులు అఖిల్‌(9), ఉదయ్‌నందన్‌ (2), కుమార్తె ఉర్విష(6నెలలు)లతో కలిసి ఇటీవల జుత్తాడ వచ్చారు. ఓటు వేసిన తర్వాత అతనొక్కడే విజయవాడ వెళ్లిపోయాడు. విజయవాడలోనే ఉంటున్న విజయ్‌ చిన్నత్త అరుణ కుమార్తెకు, చిన్నాన్న కొడుకు శ్రీనుకు వచ్చే నెల 13న పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పనుల కోసం విజయ్‌ అత్త రమాదేవి, చిన్నత్త అరుణ, పెళ్లికొడుకు శ్రీను మూడు రోజుల కిందట విశాఖ వచ్చారు. వీరంతా శివాజీపాలెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ పెళ్లి పనులు చూసుకున్నారు.

బుధవారం సాయంత్రం అఖిల్‌(9)ను శివాజీపాలెంలోనే వదిలేసి ఇద్దరు పిల్లలతో ఉష, రమాదేవి, అరుణ జుత్తాడ వచ్చారు. అక్కడే ఉండి పెళ్లి పనులు చూసుకుంటున్నారు. గురువారం తెల్లవారుజామున 5గంటల సమయంలో అప్పలరాజు పాలు తీసేందుకు పశువుల శాలకు బయల్దేరాడు. అప్పటికే విజయ్‌ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఇంటి ముందు ఒక మహిళ కళ్లాపి చల్లుతూ కనిపించింది. దీంతో విజయ్‌ వచ్చాడనుకుని అప్పలరాజు కోపంతో ఊగిపోయాడు. పశువుల శాలలోని కత్తి తీసుకొచ్చి కళ్లాపి చల్లుతున్న విజయ్‌ చిన్నత్త అరుణను నరికాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె చెయ్యి అడ్డం పెట్టింది. కత్తివేటుకు చెయ్యి తెగి పడింది. ఆ తర్వాత అప్పలరాజు ఆమె మెడపై నరకాడు. అరుణ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. ఆ తర్వాత అప్పలరాజు ఇంట్లోకి వెళ్లాడు

మంచంపై నిద్రపోతున్న ఉషారాణి మెడపై కత్తివేటు వేశాడు. తల్లికి అటూ ఇటు పడుకుని నిద్రిస్తున్న ఉదయ్‌ నందన్‌, పసిపాప ఉర్విషను దారుణంగా నరికేశాడు. విజయ్‌ అత్త రమాదేవిని నరికి… జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బాత్‌రూమ్‌లోకి తీసుకువెళ్లాడు. అక్కడ విజయ్‌ తండ్రి రమణ(63)ను కూడా నరికి చంపేశాడు. ఇంకెవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే బయటికి వచ్చాడు. ‘అందరినీ నరికేశా’ అని తన తల్లికి చెప్పాడు. రోడ్డుపై నిలబడి… ‘విజయ్‌ కుటుంబంలో అందరినీ చంపేశాను’ అని కేకలు వేశాడు. చేతిలో రక్తంతో తడిసిన కత్తి, ఒళ్లంతా నెత్తుటి మరకలతో ఉన్న అతడిని చూసి స్థానికులు భయపడిపోయారు. అప్పలరాజే స్వయంగా ‘100’కు ఫోన్‌ చేసి… తాను ఆరుగురిని  చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

కుటుంబ సభ్యులు హత్యకు గురైనట్లు తెలుసుకున్న విజయ్‌… మధ్యాహ్నం 4 గంటలకు జుత్తాడ చేరుకున్నాడు. మృతదేహాలను చూసి భోరుమని రోదించాడు. మంత్రి ముత్తంశెట్టి వచ్చి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చేవరకూ మృతదేహాలను తరలించనీయబోమని బంధువులు బైఠాయించారు. సాయంత్రం 6గంటలకు మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడడంతో మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.

వారిద్దరూ మృత్యుంజయులు..
విజయ్‌ భార్య, అత్తతో కలిసి జుత్తాడ వచ్చిన పెళ్లి  కొడుకు శ్రీను అక్కడ నిద్రపోకుండా సమీపంలో మరో బంధువు ఇంటికి వెళ్లాడు. విజయ్‌ పెద్ద కొడుకు అఖిల్‌ శివాజీపాలెంలో పిల్లలతో ఆడుకుంటూ… జుత్తాడకు రానని మొండికేశాడు. వీరుకూడా వచ్చి ఉంటే అప్పలరాజు చేతిలో చనిపోయేవారే! విజయ్‌ కంటికి కనిపించనప్పటికీ… కుటుంబ సభ్యులందరినీ చంపేయడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Courtesy Andhrajyothi

Leave a Reply