అనంత విషాదం! ఒకే రోజు 6గురు ఆత్మ‌హ‌త్య‌

0
329
అనంత విషాదం! ఒకే రోజు 6గురు ఆత్మ‌హ‌త్య‌

Image result for ఒకే రోజు 6గురు ఆత్మ‌హ‌త్య‌"ఆర్థిక ఇబ్బందులే కారణం
రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కన్న తల్లితండ్రులకు ఇంత తిండి పెట్టడం కష్టం కావడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట… పిల్లల చదువుకు, వైద్యానికి డబ్చులు లేక నిరాశలో కూరుకుపోయి తనతో పాటు ఇద్దరు కూతుళ్లను బలవన్మరణం వైపు నడి పించిన ఒక తల్లి.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు భారమై మరో మార్గం లేక ఉరితాడుకు వేలాడిన ఒక చేనేత కార్మికుడు…! ఇవి అనంత విషాదాలు… అంతేలేని పేదల కష్టాలు. నిత్యక్షామ పీడిత జిల్లా అనంతపురంలో ఒకే రోజు చోటు చేసుకున్న ఘోరాలు! మాంద్యం లేనేలేదు… వృద్ది వైపు పరుగులు తీస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్న మాటలకు భిన్నమైన నిజజీవిత వాస్తవాలు..

అనంతపురం నగర శివారులోని నేషనల్‌ పార్కు వద్ద రైలు కింద పడి తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని పాపంపేట పంచాయతీ పరిధిలోని రాజా హోటల్‌ సమీపంలో వడ్డే పోలేరమ్మ (45), ఆమె కూతుళ్లు ఆర్తీ (17), దీపి ్త(13) నివసిస్తున్నారు. పోలేరమ్మ భర్త వడ్డే వెంకటేష్‌తో కలిసి కూలి పనులు చేసుకునేది. ఈ దంపతుల పెద్ద కుమార్తె ఆర్తీ ఇంటర్‌ పూర్తి చేసి ఓ కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ పొందుతోంది. చిన్న కుమార్తె దీప్తి మానసిక పరిస్థితి బాగోలేక ఇంటివద్దే ఉంటుంది. పెద్ద కుమార్తె చదువు కోసం, చిన్న కుమార్తె వైద్య చికిత్సల కోసం పోలేరమ్మ పలువురి వద్ద వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకుంది. వారికొచ్చే కూలి సొమ్ముతో అప్పులు తీర్చడం కష్టమైంది. ఇటీవల ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి కొన్ని అప్పులు తీర్చారు. అయినా, ఇంకా అప్పులు మిగిలాయి. దీనికి తోడు పోలేరమ్మ భర్త వెంకటేష్‌ ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం మరింత దిగజారింది. చేసిన అప్పులు తీర్చలేమన్న ఆందోళనతో పోలేరమ్మ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. తాను చనిపోతే కూతుళ్లను ఎవరూ పట్టించుకోరని భావించి వారిని తన వెంట తీసుకెళ్లింది. శనివారం రాత్రి ముగ్గురూ ఇంటి నుంచి బయటకెళ్లి అనంత పురం నగర శివారు ప్రాంతంలోని నేషనల్‌ పార్కు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

కూడేరులో భార్యాభర్తలు..
ఆర్థిక ఇబ్బందులను తాళలేక కూడేరు మండలం పిఎబిఆర్‌ డ్యామ్‌ వద్ద భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. పిఆర్‌బిఆర్‌ డ్యామ్‌ జన్‌కో కంపెనీలో విధులు నిర్వహించే ఈడిగ గోపాల్‌ కుమారుడు ఈడిగ వాసు (28), ఈడిగ నాగతేజశ్విని (26) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు సంవత్సరాల బాబు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. ప్రయివేటు ఉద్యోగైన వాసు తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. ఆదాయం చాలకపోవడంతో కుటుంబ అవసరాల నిమిత్తం వాసు అప్పులు చేశాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు. తరచూ భార్యకు ఈ విషయం చెప్పి బాధపడేవాడు. ఇదే విషయంపై శనివారం రాత్రి భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. అప్పులు తీర్చడం కష్టమని భావించి అర్ధరాత్రి సమయంలో ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ధర్మవరంలో చేనేత కార్మికుడు…
అప్పుల వారి ఒత్తిళ్లను భరించలేక ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు సురువు వెంకటరాముడు (52) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు నగర్‌లో నివసిస్తున్న వెంకటరాముడు ఓ మగ్గాల యజమాని వద్ద కూలికి మగ్గంనేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ నిమిత్తం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు అధికం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. గత మూడు రోజులుగా ఇదే విషయాన్ని భార్య కృష్ణవేణితో చెప్పుకుని మదనపడేవాడు. శనివారం రాత్రి పని ఉందని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రైల్వేస్టేషన్‌ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని వద్ద ఉన్న ఆధారాలను బట్టి అతన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంకటరాముడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

(Courtesy Prajashakti)

Leave a Reply