రాష్ట్రానికి రక్తహీనత

0
251

ఐదేళ్లలోపు చిన్నారుల్లో 60 శాతం మంది రక్తహీనత బాధితులే
56 శాతం మంది మహిళల్లోనూ ఇదే పరిస్థితి
నేషనల్హెల్త్ప్రొఫైల్‌–2019 నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: తెలంగాణలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌–2019’నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

ఇక 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయస్కుల్లో సాధారణ మహిళలు 56.9 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండగా, అదే వయసున్న గర్భిణుల్లో 49.8 శాతం మంది సైతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మొత్తంగా 15 నుంచి 49 ఏళ్ల మహిళలు 56.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. ఈ వయసు వారిలో అత్యంత తక్కువగా మిజోరం రాష్ట్రంలో 22.5 శాతం, నాగాలాండ్‌లో 23.9 శాతం, మణిపూర్‌లో 26.4 శాతం మహిళలు రక్తహీనతకు గురయ్యారు.

హడలెత్తిస్తున్న శ్వాసకోశ వ్యాధులు
రాష్ట్రంలో శ్వాసకోశ వ్యాధులు హడలెత్తిస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో ఈ పరిస్థితి పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం నగరాల్లో ప్రతి 10 మందిలో ఒక రు కాలుష్యానికి గురవుతున్నారని అంచనా వేసింది. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ లెక్కల ప్రకారం 2017 కంటే 2018లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. 2017లో దేశంలో 4.21 కోట్ల మంది శ్వాసకోశ వ్యాధులకు గురికాగా 3,254 మంది మరణించారు.

2018లో 4.19 కోట్ల మంది ఈ వ్యాధులబారిన పడగా మరణాల సంఖ్య 3,740కు చేరుకుంది. అదే తెలంగాణలో చూస్తే 2017లో శ్వాసకోశ వ్యాధులకు గురైనవారు 7.69 లక్షల మంది ఉండగా వారిలో 26 మంది చనిపోయారు. 2018లో 7.40 లక్షల మంది శ్వాసకోస వ్యాధులబారిన పడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. గతేడాది కేరళలో అత్యధికంగా 58.57 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులకు గురయ్యారు.

ఐదేళ్లలో విజృంభించిన సీజనల్వ్యాధులు
సీజనల్‌ వ్యాధులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. ఒక ఏడాది కాస్తంత తక్కువగా కనిపించినా మరో ఏడాది అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ కేసులు గత ఐదేళ్లలో హెచ్చుతగ్గులతో నమోదవుతున్నాయి. 2014లో డెంగీ కేసులు 704 నమోదు కాగా ఒకరు చనిపోయారు. 2015లో 1,831 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఇక 2016లో ఏకంగా 4,037 డెంగీ కేసులు నమోదవగా నలుగురు చనిపోయారు. 2017లో ఏకంగా 5,369 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఎవరూ చనిపోలేదని కేంద్ర నివేదిక తెలిపింది. ఇక 2018లో 4,592 కేసులు నమోదు కాగా ఇద్దరు చనిపోయారు. (ఈ ఏడాది రాష్ట్రంలో డెంగీ కేసులు ఏకంగా 15 వేలు ఉండొచ్చని వైద్య నిపుణులు అనధికారికంగా అంచనా వేశారు. వారిలో దాదాపు 150 మంది చనిపోయి ఉండొచ్చని సమాచారం.) మరోవైపు 2014లో 78 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 8 మంది చనిపోయారు.

2015లో స్వైన్‌ఫ్లూ రాష్ట్రంపై పంజా విసిరినప్పుడు 2,956 కేసులు నమోదవగా ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో 166 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 12 మంది మరణించారు. 2017లో 2,165 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా 21 మంది చనిపోయారు. గతేడాది 1,007 మందికి స్వైన్‌ప్లూ సోకగా 28 మంది కన్నుమూశారు. దేశంలో గతేడాది రాజస్తాన్‌లో 2,593 కేసులు నమోదైతే, చనిపోయినవారి సంఖ్య దేశంలోనే అత్యధికంగా 461 ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఇక చికున్‌గున్యా కేసులు కూడా రాష్ట్రంలో అధికంగానే నమోదయ్యాయి. 2014లో 1,687 కేసులు నమోదు కాగా 2015లో 2,067, 2016లో 611, 2017లో 1,277, 2018లో 1,954 కేసులు నమోదయ్యాయి. గతేడాది తెలంగాణలో 51,145 టైఫాయిడ్‌ కేసులు సైతం నమోదయ్యాయి.

గణనీయంగా అతిసారం కేసులు
రాష్ట్రంలో అతిసారానికి గురవుతున్న వారి సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. పురుషుల కంటే స్త్రీలల్లో అధికంగా ఉంటోంది. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదిక ప్రకారం తెలంగాణలో 2017లో 4.87 లక్షల మందికి అతిసారం ప్రబలగా 2018లో 4.88 లక్షల మందికి సోకింది. అందులో అత్యధికంగా మహిళలే ఉండటం గమనార్హం. 2018లో అతిసారం సోకిన వారిలో పురుషులు 2.35 లక్షల మంది ఉండగా మహిళలు 2.52 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది అతిసారంతో ఒకరు చనిపోయారని తెలిపింది. అతిసారం విషయంలో దేశంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 22.51 లక్షల మంది అతిసారానికి గురయ్యారు.

Courtesy Sakshi..

Leave a Reply