ఈ ఆదాయంతో బతికేదెలా?

0
307

– 58శాతం పట్టణ ప్రజల్లో ఆందోళన
– ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయంపై పెరిగిన భయాలు : తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : ఆర్థిక అవసరాలు పట్టణ ప్రజల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలు ఎలా తీరుతాయోనని పట్టణాల్లో నివసిస్తున్న సగటు పౌరుడు ఆలోచనలతో సతమత మవుతున్నాడు. నెలా నెలా జీతం వస్తేనే ఇలా ఉంటే, రిటైర్మెంట్‌ తర్వాత పరిస్థితేంటి అన్న ఆందోళన మరికొందరిది. దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల్లో 58శాతం మందిని ఆర్థిక భయాలు చుట్టుముట్టాయని ఒక బీమా కంపెనీ జరిపిన సర్వేలో తేలింది.

ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేదని కొందరు, దాచుకున్నదంతా ఒక్క ఏడాదిలో కరిగిపోయిందని మరికొందరు…ఇలా సగానికిపైగా నగర ప్రజల్ని ఏదో ఒక ఆర్థిక సమస్య వేధిస్తున్నది. భవిష్యత్తు ఆర్థిక అవసరాలు ఎలా తీరుతాయన్న బెంగ వారిని ఆవరించింది. మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(ఢిల్లీకి చెందిన సంస్థ), కాంటార్‌(లండన్‌లోని కన్సల్టెన్సీ సంస్థ) సంయుక్తంగా 25 నగరాల్లో సర్వే జరిపి…పై విషయాల్ని వెల్లడించింది. డిసెంబరు 2019-జనవరి 2020 మధ్య 7వేల మంది నుంచి సర్వే వివరాలు సేకరించి ఈ నివేదికను రూపొందించారు.

ఒక్క ఏడాదిలో ఎగిరిపోతున్నది
ఆర్థిక పరంగా ఎలాంటి అండదండలూ లేవని బాధపడేవారి సంఖ్య పట్టణాల్లో పెరుగుతున్నది. ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఎంతో కొంత పొదుపు చేశామని అనుకుంటున్న తరుణంలో ఏదో ఒక అవసరం, ఉపద్రవం అనేక కుటుంబాల్ని తాకుతున్నది. ఎంతోకాలంగా పొదుపుచేసి దాచుకున్నది వైద్యం, పిల్లల ఉన్నత విద్యకు ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఒక్క ఏడాదిలో అంతా పోయిందని 57శాతం మంది బాధను వ్యక్తం చేశారు.
ొ రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఉండదని 58శాతం ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే వీరి సంఖ్య 4శాతం పెరిగింది.
ొ ఇప్పుడున్న ఆదాయంతో జీవనశైలిని కొనసాగించటం కష్టతరమని, వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని 58శాతం ఆందోళన చెందుతున్నారు.
ొ ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం గురించి ఆవేదన చెందేవారు 56శాతం మంది ఉన్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply